Published : Mar 14, 2026, 09:44 PM ISTUpdated : Mar 14, 2026, 09:55 PM IST
Mumbai Indians : ఐపీఎల్ 2026కు ముందు రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్ ఇచ్చాడన్న వార్తలు వైరల్ గా మారాయి. దీంతో ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ ను తీసేస్తారా?
ఐపీఎల్ 2026 ముందు ముంబైలో రచ్చ.. హిట్ మ్యాన్ విషయంలో అసలేం జరుగుతోంది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ (MI) జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు వార్నింగ్ ఇచ్చాడనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందించింది.
26
వైరల్ పోస్ట్‌లో ఏముంది?
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ఒక యూజర్ చేసిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. "ఐపీఎల్ 2026కు ముందు రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సీజన్‌లో రోహిత్ రాణించకపోతే ఏమాత్రం సహించేది లేదని మేనేజ్‌మెంట్‌కు హార్దిక్ స్పష్టం చేశాడు. గత 10-12 ఏళ్లుగా రోహిత్ ప్రదర్శన పట్ల మేనేజ్‌మెంట్ అసంతృప్తిగా ఉంది. భారీ వేతనం తీసుకుంటున్నప్పటికీ, రోహిత్ సీజన్‌కు కేవలం 200-300 పరుగులు మాత్రమే చేస్తున్నాడు, అది కూడా 120 స్ట్రైక్ రేట్‌తోనే రాణిస్తున్నాడు" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
36
ముంబై ఇండియన్స్ ఘాటు రిప్లై
ఈ తప్పుడు ప్రచారాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం వెంటనే తిప్పికొట్టింది. సదరు పోస్ట్‌ను కోట్ చేస్తూ కుచ్ భీ (ఏదో ఒకటి వాగకండి) అంటూ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక జిఫ్ ఫైల్‌ను జత చేసింది. ఈ పోస్టుతో రోహిత్, హార్దిక్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆ వార్తలన్నీ కల్పితమని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. 2024లో రోహిత్ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా వచ్చినప్పటి నుండి అభిమానుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఇలాంటి రూమర్లు రావడం గమనార్హం.
గత కొన్ని సీజన్లుగా రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ చర్చనీయాంశంగా మారింది. 2013 తర్వాత రోహిత్ ఒక్క సీజన్‌లో కూడా 500 పరుగుల మార్కును అందుకోలేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో రోహిత్ 15 మ్యాచ్‌ల్లో 29.86 సగటుతో 418 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. అతను 227 మ్యాచ్‌ల్లో 29.52 సగటుతో 5,876 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో రోహిత్ 272 మ్యాచ్‌ల్లో 7,046 పరుగులు పూర్తి చేశాడు.
రోహిత్ శర్మను కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ ఉపయోగించుకోవాలని మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఆకాష్ చోప్రా సూచించారు. "రోహిత్ శర్మ వంటి నాయకుడు మైదానంలో ఉండాలి. కష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి హార్దిక్ పాండ్యాకు రోహిత్ అనుభవం తోడ్పడుతుంది" అని హర్భజన్ పేర్కొన్నాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, "రోహిత్ ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఒక ఓపెనర్ 20 ఓవర్ల పాటు డగౌట్‌లో కూర్చుని ఆ తర్వాత బ్యాటింగ్‌కు రావడం కష్టం. అతను 40 ఓవర్ల పాటు మైదానంలోనే ఉండాలి" అని అభిప్రాయపడ్డారు.
66
మార్చి 29న తొలి మ్యాచ్
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28, శనివారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆడనుంది. 2020లో చివరిసారిగా టైటిల్ గెలిచిన ముంబై, ఈసారి హార్దిక్ సారథ్యంలో 6వ ట్రోఫీపై కన్నేసింది.