Sohail Tanvir : ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విన్నర్.. 904 వికెట్లు తీసినా కనుమరుగైన స్టార్ పేసర్

Published : Apr 12, 2026, 04:05 PM IST

Sohail Tanvir : ఐపీఎల్ 2008లో పర్పుల్ క్యాప్ గెలిచి రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్ గా నిలిపిన పాక్ పేసర్ సోహైల్ తన్వీర్ మళ్లీ ఐపీఎల్ లో ఎందుకు కనిపించకుండా పోయాడు. 904 వికెట్లు తీసిన ఈ స్టార్ బౌలర్ ఇప్పుడు ఎక్కడున్నారు?

PREV
15
ఐపీఎల్ చరిత్రలో మర్చిపోలేని పేరు సోహైల్ తన్వీర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్ర గురించి మాట్లాడుకుంటే, మొదటి సీజన్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 2008లో జరిగిన ఆరంభ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడంలో ఒక బౌలర్ కీలక పాత్ర పోషించాడు. అతనే పాకిస్థాన్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్. విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో బ్యాటర్లను వణికించిన తన్వీర్, ఆ సీజన్‌లో అత్యధికంగా 22 వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్' గెలుచుకున్నాడు. కానీ ఆ ఒక్క సీజన్ తర్వాత, అతను మళ్ళీ ఎప్పుడూ ఐపీఎల్ మైదానంలో అడుగుపెట్టలేకపోయాడు. నేడు 904 వికెట్ల భారీ రికార్డు ఉన్నా, అతను వెలుగులోకి రాకుండా కనుమరుగైపోయారు.

25
6 వికెట్లు 14 పరుగులు.. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు

సోహైల్ తన్వీర్ ఐపీఎల్ కెరీర్ చాలా చిన్నది, కానీ అది ఎప్పిటికీ మర్చిపోలేనిది. 2008 మే 4న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన మ్యాచ్‌లో తన్వీర్ సృష్టించిన విధ్వంసం క్రికెట్ ప్రేమికులు ఎవరూ మర్చిపోలేరు. కేవలం 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో చాలా కాలం పాటు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది. ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ గణాంకమే. కేవలం 11 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే ఆయన 22 వికెట్లు తీసి తన సత్తా చాటారు. అయితే, ఆ సీజన్ ముగిసిన వెంటనే రాజకీయ పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్లపై నిషేధం పడటంతో తన్వీర్ ఐపీఎల్ ప్రయాణం అక్కడితోనే ముగిసింది.

35
డొమెస్టిక్ క్రికెట్‌లో 904 వికెట్లతో అదరగొట్టిన తన్వీర్

అంతర్జాతీయ క్రికెట్‌లో తన్వీర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని కొందరు భావిస్తారు, కానీ ఆయన గణాంకాలు వేరే కథ చెబుతున్నాయి. పాకిస్థాన్ తరపున 62 వన్డేలు, 57 టీ20లు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తన్వీర్, మొత్తంగా 130 అంతర్జాతీయ వికెట్లు తీశారు. అయితే, డొమెస్టిక్ క్రికెట్ (ఫస్ట్ క్లాస్, లిస్ట్-A, టీ20) విషయానికి వస్తే ఆయన ఒక దిగ్గజం. అన్ని ఫార్మాట్లు కలిపి తన్వీర్ ఏకంగా 904 వికెట్లు పడగొట్టారు. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ, ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. మార్చి 2023లో ఆయన అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

45
తన్వీర్ చుట్టూపవివాదాలు

సోహైల్ తన్వీర్ కెరీర్‌లో ప్రతిభతో పాటు వివాదాలు కూడా తోడయ్యాయి. ముఖ్యంగా 2018 కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) సమయంలో ఆయన చేసిన పని పెద్ద దుమారమే రేపింది. గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతున్నప్పుడు, ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ కటింగ్ వికెట్ తీసిన తర్వాత తన్వీర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అంతకుముందు బంతికి సిక్స్ కొట్టిన బెన్ కటింగ్‌ను తర్వాతి బంతికే అవుట్ చేసిన తన్వీర్, తన మిడిల్ ఫింగర్ ను చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన అప్పట్లో క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

55
పాక్ ప్లేయర్లకు ఐపీఎల్ బ్యాన్ తో సైలెంట్ అయిన స్టార్ బౌలర్

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన టీ20 బౌలర్‌గా పేరు తెచ్చుకున్న సోహైల్ తన్వీర్, ఇప్పుడు క్రికెట్ కు దూరం అయ్యాడు. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లపై నిషేధం విధించడం ఆయన కెరీర్‌కు పెద్ద దెబ్బగా మారింది. ఒకవేళ ఆ నిషేధం లేకపోయి ఉంటే, ఐపీఎల్ చరిత్రలో తన్వీర్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచేవారు అనడంలో సందేహం లేదు. తన విభిన్నమైన బౌలింగ్ యాక్షన్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన ఈ బౌలర్, ఇప్పుడు కేవలం గణాంకాల రూపంలో మాత్రమే రికార్డు పుస్తకాల్లో మిగిలిపోయారు.

Read more Photos on
click me!

Recommended Stories