CSK: సంజు శాంసన్ అద్భుత సెంచరీతో ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. 56 బంతుల్లో 115 పరుగులు చేసిన సంజూ, మూడు వేర్వేరు ఐపీఎల్ జట్ల తరపున సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. వరుస వైఫల్యాల తర్వాత సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేయడమే కాకుండా, ఢిల్లీని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. ఈ సెంచరీతో శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
25
చెన్నై భారీ స్కోరు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ శాంసన్ కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో సెంచరీ సాధించిన మొదటి బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. అనంతరం 213 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులు మాత్రమే చేసి 10 వికెట్లు కోల్పోయింది.
35
మూడు ఫ్రాంచైజీల తరపున సెంచరీలు
ఈ సెంచరీతో సంజూ శాంసన్ ఐపీఎల్‌లో తన నాలుగో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీల (ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్) తరపున సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు కె.ఎల్. రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సంజూ శాంసన్ స్పందిస్తూ, వరుసగా రెండు మూడు మ్యాచ్‌లు విఫలమైనప్పుడు సందేహాలు రావడం సహజమని, కానీ బేసిక్స్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈరోజు ఫలితం వచ్చిందని తెలిపాడు. "మొదట్లో పిచ్ కొంత నెమ్మదిగా ఉంది, పవర్ ప్లేలో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి కాస్త ఆగింది. కానీ బంతి పాతబడిన తర్వాత బ్యాటింగ్ సులభమైంది" అని సంజూ వివరించాడు.
55
రవిశాస్త్రిని కలవడం అదృష్టం
ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని కలిశానని, అది తనకు అదృష్టంగా మారిందని సంజూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు ఆయనను కలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఆయుష్‌తో కలిసి చేసిన భాగస్వామ్యం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిందని సంజూ పేర్కొన్నాడు.