IPL 2026 జాతర మొదలు.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తొలి సమరం.. కొత్త డేట్ ఇదే !

Published : Mar 08, 2026, 07:45 PM IST

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్ బెంగళూరులో 5 మ్యాచ్‌లు ఆడనుండగా, ఫైనల్ కూడా అక్కడే జరగనుంది.

PREV
16
మార్చిలోనే ఐపీఎల్ 2026 షురూ.. ఆర్సీబీ అభిమానులకు డబుల్ ధమాకా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముహూర్తం ఖరారైంది. మార్చి 28వ తేదీన ఐపీఎల్ 19వ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ ప్రకటన వెలువడటం విశేషం. గత సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

26
మార్చి 28న ప్రారంభం.. మే 31న ఫైనల్

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభమై, మే 31న ముగియనుంది. వాస్తవానికి ఈ టోర్నమెంట్‌ను మార్చి 26 నుంచే ప్రారంభించాలని బీసీసీఐ తొలుత భావించింది. అయితే, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అంతర్గత చర్చల తర్వాత ప్రారంభ, ముగింపు తేదీలను రెండు రోజులు వెనక్కి జరిపారు. ప్రస్తుతానికి పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కానప్పటికీ, తొలి మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగడం దాదాపు ఖాయమైంది. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, భద్రత, రవాణా సంబంధిత కారణాల దృష్ట్యా షెడ్యూల్ విడుదలలో జాప్యం జరుగుతోంది.

36
బెంగళూరులో 5 మ్యాచ్‌లు.. రాయ్‌పూర్‌లో మరో 2

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ విషయాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) సెక్రటరీ సంతోష్ మీనన్ ధృవీకరించారు. ఆర్సీబీకి మొత్తం ఏడు హోమ్ మ్యాచ్‌లు ఉండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ లో ఉన్న షహీద్ వీర్ నారాయణ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ఒక ప్లే-ఆఫ్ మ్యాచ్‌కు కూడా బెంగళూరులో కానుంది.

46
కొత్తగా చిన్నస్వామి స్టేడియం రెడీ

గతేడాది జూన్ నెలలో ఆర్సీబీ ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన సందర్భంలో జరిగిన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ కార్యకలాపాలను నిలిపివేశారు. అయితే, ఇప్పుడు స్టేడియంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. దీనిపై ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపింది.

56
షెడ్యూల్ విడుదలపై బీసీసీఐ వివరణ ఇదే

ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పందిస్తూ.. అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ తేదీలలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో 15 నుంచి 20 రోజుల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

66
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ రెడీ

2025 ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని జట్టు భావిస్తోంది. ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. "చిన్నస్వామి స్టేడియం మా జట్టుకు కేవలం హోమ్ గ్రౌండ్ మాత్రమే కాదు, అది మా ఉనికి. బెంగళూరు అభిమానులు ఇచ్చే శక్తి మా ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. అందుకే ఈసారి మెజారిటీ హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులోనే నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్లేయర్ క్యాంపులను ప్రారంభించి, ప్రాక్టీస్ సెషన్లలో నిమగ్నమయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories