
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో ఇప్పుడు అంతా సవ్యంగా లేదనే వార్తలు సంచలనంగా మారాయి. ఆ జట్టు మాజీ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనాన్ని రేపుతున్నాయి.
తన హోమ్ టీమ్ అయిన చెన్నై తరపున కెరీర్ ప్రారంభించి, ఎన్నో విజయాల్లో పాలుపంచుకున్న అశ్విన్, ఇప్పుడు అదే జట్టులోని అంతర్గత పరిస్థితులపై విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. పది కోట్ల రూపాయల భారీ ధర పలుకుతున్నా, తాను ఎందుకు అర్ధాంతరంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందో అశ్విన్ కుండబద్దలు కొట్టారు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన ఆర్ అశ్విన్, ఐపీఎల్ 2025 సీజన్ తనను మానసికగత తీవ్రంగా కలచివేసిందని వెల్లడించారు. అశ్విన్ డిసెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత గతేడాది ఆగస్టులో ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన యూట్యూబ్ ఛానెల్ 'యాష్ కి బాత్'లో మాట్లాడుతూ, ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మరో సీజన్ ఆడే సత్తా తనలో ఉన్నప్పటికీ, మానసిక స్థితి సహకరించకపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అశ్విన్ వివరించారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో గతంలో ఉన్న సానుకూల వాతావరణం ఇప్పుడు లేదని అశ్విన్ అభిప్రాయపడ్డారు. "గత సీజన్ వ్యక్తిగతంగా, భావోద్వేగపరంగా నాకు చాలా బాధ కలిగించింది. జట్టులో అంతా సవ్యంగా లేదు" అని ఆయన పేర్కొన్నారు.
కేవలం తన రిటైర్మెంట్ ద్వారా జట్టుకు తలనొప్పి తగ్గించడమే కాకుండా, వేలంలో 10 కోట్ల రూపాయల అదనపు నిధులు మిగిలేలా చేశానని ఆయన అన్నారు. జట్టు తనను రిటైన్ చేయాలా లేదా రిలీజ్ చేయాలా అన్న ప్రశ్నల మధ్య ఉన్న సమయంలో, తనే స్వయంగా తప్పుకోవడం మేలని భావించినట్లు అశ్విన్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు ఓటములను చవిచూడటంపై అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టు అనుసరిస్తున్న బౌలింగ్ వ్యూహాలు ఏమాత్రం బాగోలేవని ఆయన విమర్శించారు. బౌలర్ల సహజ సిద్ధమైన ప్రతిభను వాడుకోకుండా, వారిని బలవంతంగా వైడ్ యార్కర్లు వేయమని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ వ్యూహం విఫలమవుతోందని, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆలోచనా విధానం మారనంత వరకు జట్టు మళ్ళీ పుంజుకోవడం కష్టమని అశ్విన్ హెచ్చరించారు. యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల జట్టుకు నష్టం కలుగుతోందని అశ్విన్ అన్నారు.
ఐపీఎల్ 2025లో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆ సీజన్‌లో అశ్విన్ ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 9.12 ఎకానమీతో కేవలం 7 వికెట్లు మాత్రమే తీయగలిగారు. అయితే, ఈ పేలవ ప్రదర్శనకు జట్టులోని అంతర్గత విభేదాలు, మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. జట్టు యాజమాన్యం, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లనే ఛాంపియన్ జట్టు పతనమవుతోందని కూడా మాజీలు, క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిని అశ్విన్ విశ్లేషించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆర్సీబీ, మిగిలిన జట్లన్నింటికీ ప్రమాద సంకేతాలు పంపిందని ఆయన అన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 251 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, చెన్నై బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. గత మ్యాచ్‌లతో పోలిస్తే కొంత పర్వాలేదు అనిపించినప్పటికీ, విజయం సాధించే స్థాయికి జట్టు ఇంకా చేరుకోలేదని అశ్విన్ అన్నారు. చెన్నై జట్టు తన తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ ఫామ్‌లోకి వస్తుందో లేదో చూడాలి మరి.