బ్యాట్‌తో అదరగొట్టింది, బంతితో మాయ చేసింది.. భారత్ ను గెలిపించిన ఇద్దరు స్టార్లు

Published : Nov 03, 2025, 01:28 AM IST

India Wins ICC Womens World Cup 2025: ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి టైటిల్ గెలుచుకుంది. అయితే, భారత్ విజయం సాధించడంలో షెఫాలీ వర్మ, దీప్తిశర్మలు కీలక పాత్ర పోషించారు.

PREV
15
భారత్‌కు తొలి మహిళల వరల్డ్ కప్ విజయం

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే ఘనత ఇది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. నవి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్‌ వర్షం కారణంగా రెండు గంటల ఆలస్యంతో ప్రారంభమైంది.

దక్షిణాఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగి భారత బ్యాటర్లు సత్తా చాటారు. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 298 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలర్ల ప్రదర్శనతో దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే కుప్పకూలింది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్‌ సారథ్యంలో టీమ్‌ ఇండియా 52 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.

25
ప్రతి మ్యాచ్‌లో కొత్త స్టార్‌లు

ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు వెలుగులోకి వచ్చారు. కొన్నిసార్లు స్మృతి మంధాన అద్భుత ప్రదర్శన చేయగా, మరికొన్ని సందర్భాల్లో ప్రతికా రావల్‌ జట్టును ముందుండి నడిపించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జెమిమా రోడ్రిగ్స్‌ ధాటిగా ఆడారు. ఫైనల్‌లో ఈ ముగ్గురు పెద్దగా రాణించకపోయినా, మరో ఇద్దరు యువతారలు భారత విజయానికి పునాది వేశారు.

35
షెఫాలీ వర్మ సంచలనం.. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ

ప్రతికా రావల్‌ గాయంతో ఫైనల్లో షెఫాలి వర్మ ఓపెనర్‌గా జట్టులోకి వచ్చారు. సెమీఫైనల్లో పెద్దగా రాణించలేకపోయిన ఆమె ఫైనల్లో మాత్రం సంచలనం సృష్టించింది. కేవలం 78 బంతుల్లో 87 పరుగులు అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడారు. 7 బౌండరీలు, 2 సిక్సర్లు బాదారు.

ఇంతటితో షెఫాలీ వర్మ ప్రదర్శన ఆగిపోలేదు. ఆశ్చర్యకరంగా హర్మన్‌ప్రీత్‌ ఆమెకు బౌలింగ్‌ బాధ్యత అప్పగించగా, కెప్టెన్‌ నమ్మకాన్ని షెఫాలీ వమ్ము చేయలేదు. సునే లూస్‌, మారిజాన్‌ కాప్‌ వికెట్లు తీసి ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ ను దెబ్బకొట్టింది. ఆమె 7 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశారు. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకుంది.

45
దీప్తి శర్మ మాయజాలం.. బ్యాట్ బౌలింగ్ రెండింట్లోనూ దూకుడు

భారత అనుభవజ్ఞులలో ఒకరైన దీప్తి శర్మ మరోసారి తన ఆల్ రౌండ్ ప్రతిభను చూపించారు. మొదట బ్యాటింగ్ లో దంచికొట్టారు. ఆమె 58 బంతుల్లో 58 పరుగులతో విలువైన ఇన్నింగ్స్‌ ఆడింది. తర్వాత బౌలింగ్‌లో తన స్పిన్‌ మ్యాజిక్‌ చూపించింది.

దీప్తి 9.3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి సౌతాఫ్రికాను కోలుకోని దెబ్బకొట్టింది. ఈ టోర్నమెంట్ లో మొత్తంగా 215 పరుగులతో పాటు 21 వికెట్లతో సత్తాచాటారు. ఈ అసాధారణ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ గౌరవం లభించింది.

55
భారత జట్టు గర్వకారణం

ఈ విజయంతో భారత మహిళల క్రికెట్‌ కొత్త యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. హర్మన్‌ప్రీత్ కౌర్‌ నాయకత్వంలో జట్టు సమిష్టిగా రాణించి చరిత్ర సృష్టించింది. షెఫాలి వర్మ, దీప్తి శర్మల ఆల్‌రౌండ్‌ ప్రతిభతో భారత్‌ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం భారత మహిళా క్రీడాకారిణుల కలను సాకారం చేసింది. ఈ విజయంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. దీప్తి శర్మ, షెఫాలీ వర్మలు భారత్ కు హీరోలుగా నిలిచారు.

Read more Photos on
click me!

Recommended Stories