India vs Pakistan : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కొలంబో లో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్ ఉత్కంఠను పెంచుతోంది. ఈ పోరులో ఐదు కీలక వ్యక్తిగత పోరాటాలపై అందరి దృష్టి నెలకొంది. బుమ్రా vs ఫర్హాన్, బాబర్ vs కుల్దీప్ వంటి ఆసక్తికర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మహా సంగ్రామం ప్రారంభం కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సాయంత్రం 7 గంటలకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు, ఇద్దరు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే పరువు ప్రతిష్ఠల పోరాటం. గణాంకాలు చూస్తుంటే ఈసారి మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది. ఈ ఉత్కంఠభరిత పోరులో ఐదు ప్రధాన వ్యక్తిగత పోరాటాలు మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది. వాటిలో..
26
సాహిబ్జాదా ఫర్హాన్ vs జస్ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుస ఇన్నింగ్స్‌లతో అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, అతనికి ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కఠినమైన పరీక్ష ఎదురుకానుంది. గతంలో టీ20 ఇంటర్నేషనల్స్‌లో వీరిద్దరూ తలపడినప్పుడు, ఫర్హాన్ ఒకే మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి ఫర్హాన్ బుమ్రా వేసిన 34 బంతులను ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే బుమ్రా అతడిని ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన పదునైన యార్కర్లతో ఫర్హాన్‌ను ఎలా కట్టడి చేస్తాడో చూడాలి.
36
బాబర్ ఆజం vs కుల్దీప్ యాదవ్
పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం, భారత్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటివరకు టీ20లలో కుల్దీప్ బాబర్‌కు బౌలింగ్ చేయనప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో మాత్రం కుల్దీప్‌దే పైచేయిగా ఉంది. మూడు వన్డే మ్యాచ్‌ల్లో కుల్దీప్ రెండుసార్లు బాబర్‌ను పెవిలియన్ పంపాడు. ఆ సమయంలో బాబర్ 52 బంతుల్లో కేవలం 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2026 టీ20 వరల్డ్ కప్ ప్రస్తుత మ్యాచుల్లో కుల్దీప్ తుది జట్టులో లేకపోయినప్పటికీ, కొలంబో స్పిన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
పాకిస్థాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ తన విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ ద్వారా చర్చనీయాంశమయ్యాడు. అతని బౌలింగ్‌లో ఉండే చిన్న బ్రేక్ బ్యాటర్లను గందరగోళానికి గురిచేస్తుంది. మిడిల్ ఓవర్లలో (7 నుండి 16 ఓవర్ల మధ్య) తారిక్ బౌలింగ్‌కు వస్తే, అతడిని ఎదుర్కోవడంలో హార్దిక్ పాండ్యా పాత్ర చాలా కీలకం. హార్దిక్ అటాకింగ్ గేమ్ తారిక్ అంతుచిక్కని బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడటం అభిమానులకు కనువిందుగా ఉంటుంది. హార్దిక్ క్రీజులో నిలదొక్కుకుంటే పాక్ బౌలింగ్ లైనప్‌ను ఒత్తిడిలోకి నెట్టవచ్చు.
56
ఇషాన్ - అభిషేక్ vs షాహీన్ షా అఫ్రిదీ
టీమ్ ఇండియా తరపున ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగుతున్నారు. ఈ యంగ్ జోడీకి పాక్ స్పీడ్ గన్ షాహీన్ షా అఫ్రిదీ నుండి గట్టి సవాలు ఎదురుకానుంది. ఇషాన్, అభిషేక్ ఇద్దరూ దూకుడుగా ఆడే బ్యాటర్లు. వారు షాహీన్ వేసే కొత్త బంతిపై ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్‌ను ఇబ్బంది పెట్టేందుకు షాహీన్ షార్ట్ బాల్ అస్త్రాన్ని ప్రయోగిస్తాడా లేదా అన్నది ఆసక్తికరం. ఆరంభ ఓవర్లలో షాహీన్‌ను వికెట్ ఇవ్వకుండా ఆడితే భారత్‌కు భారీ స్కోరు ఖాయం.
66
శివమ్ దూబే vs అబ్రార్ అహ్మద్
స్పిన్నర్ల పాలిట యముడిగా పేరు తెచ్చుకున్న శివమ్ దూబేకు, పాక్ రిస్ట్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ మధ్య యుద్ధం జరగనుంది. 2025 టీ20 సీజన్‌లో దూబే స్పిన్నర్లపై విరుచుకుపడి పరుగులు సాధించాడు. స్లో బౌలర్ల మీద అతను 193 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఒకవేళ దూబే క్రీజులో సెట్ అయితే, అబ్రార్ అహ్మద్‌తో పాటు షాదాబ్ ఖాన్‌కు కూడా చుక్కలు కనిపించడం ఖాయం. పాకిస్థాన్ స్పిన్ విభాగానికి దూబే అతిపెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.