
T20 World Cup 2026 Final : టీమిండియా ఇప్పటికే రెండు టీ20 వరల్డ్ కప్స్ గెలుచుకుంది... ఇప్పుడు ఇంకో ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచింది. అయితే గత వరల్డ్ కప్స్ కంటే ఇది చాలా ప్రత్యేకమైనది... ఎందుకంటే స్వదేశంలో, సొంత ప్రేక్షకుల మధ్య ట్రోఫీని అందుకోవడం కంటే గొప్పదనం ఇంకేముంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం (మార్చి 8న) జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తుచేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా... ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది.
అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుండటం టీమిండియా అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఈ స్టేడియం భారత జట్టుకు పెద్దగా అచ్చిరాలేదు. ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఇదే స్టేడియంలో జరిగింది.. టోర్నీ మొత్తం ఓటమన్నదే లేకుండా ఫైనల్ కు చేరింది భారత జట్టు... కానీ ఈ మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడి ఓడింది. దీంతో మరో వన్డే వరల్డ్ కప్ ఆశలు ఆవిరయ్యాయి.
ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడింది... అదీ ఈ అహ్మదాబాద్ స్టేడియంలోనే. గ్రూప్-8 స్టేజ్ లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియాకు సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మారాయి... ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండిస్ ను ఓడించి సెమీస్ కు చేరింది.
నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా ఓటముల నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఎలా ఉటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సెంటిమెంట్ ను భారత జట్టు మారుస్తుందా.. లేక కొనసాగిస్తుందా? అన్నది రేపు (ఆదివారం) తేలనుంది. మరి ఈ మోదీ స్టేడియం పిచ్ ఎలా ఉంటుంది..? ఎవరికి సహకరిస్తుంది..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగితే ఆ జట్టుకు అనుకూలంగా ఉండే పిచ్ ను రూపొందిస్తారు. మరి టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో... అదీ ఫైనల్ మ్యాచ్ అంటే పూర్తిగా వన్ సైడ్ మ్యాచ్ జరిగేలా పిచ్ రూపొందిస్తారని చాలామంది భావిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇప్పటికే మోదీ స్టేడియంలో టీమిండియాకు అనుకూలమైన పిచ్ తయారుచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ఇండియా-న్యూజిలాండ్ మధ్య నువ్వానేనా అన్నట్లు ఉత్కంఠ పోరు సాగేలా పిచ్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
సెమీఫైనల్లో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య వాంఖడే స్టేడియంలో ఎలాంటి ఉత్కంఠ మ్యాచ్ జరిగిందో అందరం చూశాం... సేమ్ అలాంటి పిచ్ నే అహ్మదాబాద్ లో రెడీ చేస్తున్నారట. అయితే పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట... ఇందుకోసమే రెడ్, బ్లాక్ సాయిల్ తో పిచ్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పిచ్ కోసం 70 శాతం రెడ్ సాయిల్, 30 శాతం బ్లాక్ సాయిల్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది... ఈ మిక్సుడ్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. రెడ్ సాయిల్ బంతి మంచి వేగం, బౌన్స్ అందిస్తుంది... బ్లాక్ సాయిల్ మాత్రం బంతిని స్లో చేస్తుంది... కానీ పగుళ్లు కలిగివుండి స్పిన్ కు అనుకూలిస్తుంది. ఈ సమతుల్యమైన పిచ్ కారణంగా ఫైనల్లో 200 లోపే స్కోరు నమోదవుతుందని... ఇరుజట్ల మధ్య పోటాపోటీగా మ్యాచ్ సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ వరల్డ్ కప్ 2026 లో అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ రెండు మ్యాచులు ఆడింది. నెదర్లాండ్ పై గెలిచింది కానీ సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. అయితే న్యూజిలాండ్ ఈ స్టేడియంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది... ఇందులోనూ ఓడిపోయింది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ స్టేడియంలో ఇటు ఇండియా, అటు న్యూజిలాండ్ రెండింటిని ఓడించింది సౌతాఫ్రికానే.
సాధారణంగా అహ్మదాబాద్ లో రెడ్ సాయిల్ లేదంటే బ్లాక్ సాయిల్ తో పిచ్ ను రూపొందిస్తారు. అందుకే మ్యాచ్ వన్ సైడ్ సాగుతుంది... అయితే బౌలర్లకు లేదంటే బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ రెండిట్లోనూ స్ట్రాంగ్ గా ఉంది... అందుకే మిక్సుడ్ పిచ్ తయారుచేసింది. ఈ పిచ్ న్యూజిలాండ్ టీం ఆటకు కూడా సరిపోతుంది. కాబట్టి రేపు అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీస్ లాంటి ఉత్కంఠ ఉంటుంది... అంతేగానీ న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరిగినట్లు వన్ సైడ్ మ్యాచ్ ఉండదు.
నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ చాలా కీలకం. ఇప్పటివరకు ఇక్కడ 16 టీ20 మ్యాచ్ లు జరిగితే అందులో 11సార్లు ముందు బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి... కేవలం ఐదుసార్లు మాత్రమే చేజింగ్ సాధ్యమయ్యింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో కూడా టీమిండియా చేజింగ్ చేయలేక ఓడిపోయింది. కాబట్టి ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుంది... ఆ టీంకే విజయావకాశాలు ఎక్కువని ఈ స్టేడియం హిస్టరీ చెబుతోంది. అంటే అహ్మదాబాద్ లో టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే అన్నమాట.
కేవలం సంవత్సరంలోపే ఇండియా-న్యూజిలాండ్ రెండోసారి ఐసిసి మెగా టోర్నీ ఫైనల్లో తలపడుతున్నాయి. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ ను ఓడించింది. ఇప్పుడు ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2026 లో మళ్లీ అవే జట్లు ఫైనల్ కు చేరాయి.. మరి అదే రిజల్ట్ ను టీమిండియా రిపీట్ చేస్తుందా..? లేక న్యూజిలాండ్ చరిత్ర తిరగరాస్తుందా..? చూడాలి.