Gukesh Dommaraju
Gukesh Dommaraju : గుకేష్ దొమ్మరాజు... ఈ పేరు గుర్తుపెట్టుకొండి... ప్రపంచవ్యాప్తంగా గట్టిగా వినబడే తెలుగబ్బాయి పేరిది. ఇప్పటికే చెస్ లో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ యువకెరటం నూనుగు మీసాల వయసులోనే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ లో చైనాకు చెందిన డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ కు చుక్కలు చూపించాడు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో లిరెన్ ను మట్టికరిపించి చెస్ ఛాంపియన్ గా నిలిచాడు ఈ పద్దెనిమిదేళ్ల కుర్రాడు.
చెస్ యోధుడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచిన రెండో భారతీయుడు గుకేష్. అదికూడా కేవలం 18 ఏళ్ల వయసులోనే. ఇప్పటివరకు వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన అతి చిన్నవయస్కుడు కూడా గుకేషే. అంతకుముందు 1985లో రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోస్ 22 ఏళ్ల వయసులో ఈ టైటిల్ గెలిచాడు. తాజాగా అతడి రికార్డును మన గుకేష్ బద్దలుగొట్టాడు.
Gukesh Dommaraju
ఎవరీ గుకేష్ దొమ్మరాజు :
గుకేష్... ఈ పేరు వినగానే ఎవరో నార్త్ ఇండియన్ అయివుంటాడని అనిపిస్తుంది. కానీ ఇంటిపేరును జోడిస్తే అర్థమవుతుంది మన తెలుగోడేనని. గుకేష్ దొమ్మరాజు మన తెలుగబ్బాయే... కానీ వృత్తిరిత్యా తల్లిదండ్రులు తమిళనాడులో నివాసం వుంటున్నారు. గుకేష్ పుట్టిపెరిగింది చెన్నైలోనే అయినా అతడి మూలాలన్ని ఆంధ్ర ప్రదేశ్ లోనే వున్నాయి.
గుకేష్ తండ్రి రజనీకాంత్ ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినవాడు. అక్కడే పెరిగిన ఆయన ENT(చెవి,ముక్కు, గొంతు) డాక్టర్. ఈయన భార్య పద్మ మైక్రోబయాలజిస్ట్. ఈ దంపతులు వృత్తిరిత్యా తమిళనాడు రాజధాని చెన్నైలో స్థిరపడ్డారు. వీరి కొడుకే గుకేష్.
రజనీకాంత్-పద్మ దంపతులకు 2006, మే 29న గుకేష్ జన్మించాడు. తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు కావడంతో కొడుకుపై చిన్నప్పటినుండి చాలా పద్దతిగా పెంచారు. మెజారిటీ పేరెంట్స్ లా తమ కొడుకుపై చదువును రుద్దాలని చూడలేదు ... అతడు దేనిపై ఆసక్తి చూపిస్తున్నాడో గమనించారు. ఏడేళ్ల వయసులోని గుకేష్ చెస్ పై ఆసక్తి పెంచుకోవడంతో ఆ దిశగానే ప్రోత్సహించారు. ఇలా పేరెంట్స్ ప్రోద్భలంతో గుకేష్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ స్థాయికి ఎదిగాడు.
Gukesh Dommaraju
18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్ ... గుకేష్ సక్సెస్ సీక్రెట్ ఇదే?
చిన్నతనంలోనే చెస్ పై ఇష్టాన్ని పెంచుకున్న గుకేష్ ను తల్లిదండ్రులు చెన్నైలోని వేలమ్మాల్ స్కూల్లో వేసారు. ఈ స్కూల్లో చెస్ ను బాగా ప్రోత్సహిస్తారు. దీంతో అతడిలోని ప్రతిభకు మరింత మెరుగు పట్టడంతో అతి చిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. కేవలం 12 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు.
చదరంగం అనేది మైండ్ గేమ్. కాబట్టి మైండ్ ఎంత షార్ప్ గా వుంటేనే విజయం సాధ్యం. ఇందుకోసం నిరంతరం సాధన అవసరం. గుకేష్ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. అతడు చిన్న వయసులోని రోజూ గంటల తరబడి సాధన చేసేవాడు. తనకు తెలియని విషయాలను తండ్రిని, కోచ్ లను అడిగి తెలుసుకునేవారు. ఇలా నిరంతర సాధనతో చెస్ లో ప్రావిణ్యం సాధించాడు.
ఇక ఈ చెస్ ను తన కెరీర్ గా ఎంచుకున్న తర్వత గుకేష్ సాధన మరింత పెరిగింది. ఎదుటివారి మైండ్ ను అర్థం చేసుకుని ఏ ఎత్తు వేస్తారు... అందుకు పైఎత్తు తాను ఎలా వేయాలి అనేది ముందుగానే ఆలోచించేవాడు. ప్రత్యర్థిని తన ఎత్తులతో ఎలా బోల్తా కొట్టించాలో మెళకువలు నేర్చుకున్నాడు. నిత్యం ఏదోఒక టోర్నమెంట్ లో పాల్గొంటూ తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకున్నాడు గుకేష్. ఇలా నిరంతర సాధనే గుకేష్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిపింది.
Gukesh Dommaraju
గుకేష్ విజయాలు :
కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే గుకేష్ ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్ షిప్ అండర్ 12 విభాగంలో ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ఇక 2018లో అండర్ 12 విభాగంలో ఆసియా యూత్ ఛాంపియన్ షిప్ లో ఐదు స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు.
ఇలా అనేక విజయాలు సాధించినా రాని గుర్తింపు గతేడాది 2023 లో గుకేష్ కు వచ్చింది. గతేడాది ఆగస్ట్ లో విడుదలచేసిన రేటింగ్ లిస్ట్ లో గుకేష్ 2750 పాయింట్లకు చేరుకుని చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ను వెనక్కినెట్టాడు. ఇలా భారత్ లోనే టాప్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. 37 ఏళ్ల తర్వాత ఆనంద్ కాకుండా మరో ఆటగాడు టాప్ ర్యాంకులోకి చేరడం జరింగింది. దీంతో గుకేష్ పేరు పాపులర్ అయ్యింది.
ఇక తాజాగా ప్రపంచ చెస్ ఛాంపియన్ విజయంతో గుకేష్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా యావత్ దేశం అతడికి అభినందనలు తెలియజేస్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా వేదికన గుకేష్ ను అభినందించారు. ఇలా ప్రపంచ విజేతగా నిలిచిన గుకేష్ తెలుగుబిడ్డ కావడతో తెలుగురాష్ట్రాల్లో అతడిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.
Gukesh Dommaraju
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో గుకేష్ విజయప్రయాణం :
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. అప్పటినుండి డిసెంబర్ 11 వరకు గుకేష్, డింగ్ లిరెన్ మధ్య 13 గేమ్స్ జరిగాయి. ఇందులో ఇద్దరూ 6.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే నిర్ణయాత్మక 14వ గేమ్ లో లిరెన్ పై గుకేష్ ఆధిపత్యం ప్రదర్శించాడు.దీంతో 7.5 పాయింట్లతో గుకేష్ విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు.