Finn Allen Century: టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో ఫిన్ అలెన్ విధ్వంసకర సెంచరీతో దక్షిణాఫ్రికాను చిత్తు చేశాడు. అలెన్ తుపాను సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సిక్సర్ల మోత మోగింది. టీ20 ప్రపంచకప్ 2026 మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ అరాచకం సృష్టించాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అలెన్ కేవలం తన బ్యాట్‌తోనే కాకుండా, ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేస్తూ, టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ఫిన్ అలెన్ వీరవిహారంతో న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి 173 పరుగులు చేసి, 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
25
ఆరంభం నుంచే అటాకింగ్ గేర్
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ మొదటి ఓవర్ నుంచే ఎదురుదాడి ప్రారంభించారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ కేవలం 19 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది ఈ ప్రపంచకప్‌లో ఉమ్మడి వేగవంతమైన హాఫ్ సెంచరీగా నమోదైంది. మరోవైపు టిమ్ సీఫెర్ట్ కూడా దూకుడుగా ఆడుతూ 33 బంతుల్లో 58 పరుగులు చేసి రాబడ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్ విజయానికి బలమైన పునాది వేశారు. ఈ సెమీఫైనల్ పోరులో వీరి భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ తీసింది.
35
రికార్డుల వేటలో కివీస్ ఓపెనర్లు
ఈ మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్లు పలు రికార్డులను తిరగరాశారు. పవర్ ప్లే ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు కావడం విశేషం. అలాగే, ఫిన్ అలెన్ - టిమ్ సీఫెర్ట్ జోడీ ఈ ప్రపంచకప్‌లో మొత్తం 463 పరుగులు జోడించి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక భాగస్వామ్య పరుగులు చేసిన జోడీగా ఇబ్రహీం జద్రాన్ - రహ్మానుల్లా గుర్బాజ్ (446 పరుగులు) రికార్డును అధిగమించారు. ఫిన్ అలెన్ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నా, ఏమాత్రం తగ్గకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు.
తడబడిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. జాన్సెన్ ఒంటరి పోరాటం
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ప్రోటీస్ జట్టును మార్కో జాన్సెన్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. జాన్సెన్ కేవలం 30 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ (29) చక్కని సహకారం అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో రాచిన్ రవీంద్ర (2/29), మాట్ హెన్రీ (2/34), కోల్ మెకన్కీ (2/9) కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు.
55
ఫైనల్ కు చేరిన బ్లాక్ క్యాప్స్
ఈ భారీ విజయం ద్వారా న్యూజిలాండ్ అహ్మదాబాద్‌లో ఆదివారం జరగనున్న ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించి కివీస్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మార్కో జాన్సెన్ వేసిన 13వ ఓవర్లో ఫిన్ అలెన్ వరుసగా 4, 6, 6, 4 బాది మ్యాచ్‌ను ముగించడంతో పాటు తన రికార్డు సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఫిన్ అలెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దక్షిణాఫ్రికా మరోసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేక టోర్నీ నుంచి అవుట్ అయింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో ఫిన్ అలెన్ మెరుపులే కనిపించాయి.