
మార్చి 28న బెంగళూరులో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (ఐపీఎల్)కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్యాంప్‌లో కెప్టెన్సీ లెక్కలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు అధికారిక కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంఎస్ ధోనీ మార్గదర్శకత్వం, అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ రాక, యువ సంచలనం ఆయుష్ మాత్రే ఎదుగుదల జట్టులో బ్యాలెన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గత వైభవానికి, ప్రస్తుత అవసరాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు మధ్య సీఎస్కే ఒక క్లిష్టమైన దశలో ఉంది.
2024లో ఎంఎస్ ధోనీ వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టారు. ఫ్రాంచైజీ అతనిపై నమ్మకం ఉంచి, రాబోయే 2026 సీజన్‌కు కూడా అతనే కెప్టెన్‌గా ఉంటాడని ధృవీకరించింది. అయితే, గత రెండు సీజన్లు రుతురాజ్ సారథ్యంలో జట్టుకు అంతగా కలిసిరాలేదు. 2024లో నెట్ రన్ రేట్ కారణంగా ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ అవకాశాన్ని తృటిలో కోల్పోగా, 2025లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ సీజన్‌లో సీఎస్కే పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పడిపోయింది. చరిత్రలో వరుసగా రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం సీఎస్కేకు ఇదే తొలిసారి. గత సీజన్ మధ్యలో రుతురాజ్ గాయపడటంతో ధోనీ తిరిగి పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ, బ్యాటర్‌గా రుతురాజ్ రికార్డు సృష్టించారు. లక్నోపై 108 పరుగులు చేసి, సెంచరీ సాధించిన తొలి సీఎస్కే కెప్టెన్‌గా నిలిచారు.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, ఎంఎస్ ధోనీ ప్రభావం సీఎస్కేపై చెక్కుచెదరకుండా ఉంది. ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గైక్వాడ్‌కు ధోనీ వెన్నంటి ఉండి సలహాలు ఇస్తున్నారు. 44 ఏళ్ల వయసులోనూ ధోనీ తన బ్యాటింగ్ పవర్‌ను చాటుకుంటున్నారు. 2024 సీజన్‌లో ఆయన 220.54 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపించారు. 2008లో 1.5 మిలియన్ డాలర్లతో ప్రారంభమైన ధోనీ ప్రయాణం, సీఎస్కేను 5 ఐపీఎల్ టైటిళ్లు, 2 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలబెట్టింది. మైదానంలోనే కాకుండా, వాణిజ్యపరంగా కూడా ధోనీ సీఎస్కేకు పెద్ద ఆస్తి. అతని వల్ల ప్రతి సీజన్ బ్రాండ్ విలువ ₹100–150 కోట్లు పెరుగుతుందని అంచనా.
ఐపీఎల్ 2025లో రుతురాజ్ గాయపడినప్పుడు రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన ఆయుష్ మాత్రే అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగారు. ముంబై ఇండియన్స్‌పై అరంగేట్రంలోనే 15 బంతుల్లో 32 పరుగులు చేసిన ఆయుష్, ఆ తర్వాత ఆర్సీబీపై 48 బంతుల్లో 94 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లో 188.98 స్ట్రైక్ రేట్‌తో 240 పరుగులు చేయడంతో, సీఎస్కే అతన్ని ₹30 లక్షలకు రిటైన్ చేసుకుంది. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా, ఫిబ్రవరి 2026లో భారత్‌ను అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ఆయుష్‌కు మంచి గుర్తింపు ఉంది. భవిష్యత్తులో సీఎస్కే పగ్గాలు చేపట్టే సత్తా ఆయుష్‌కు ఉందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ప్రస్తుతం సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లో రుతురాజ్ (ప్రస్తుత కెప్టెన్), ధోనీ (మెంటర్/మాజీ కెప్టెన్), సంజూ శాంసన్ (రాజస్థాన్ మాజీ కెప్టెన్), ఆయుష్ మాత్రే (అండర్-19 కెప్టెన్) వంటి నలుగురు నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. ఈ పరిస్థితి జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందా లేదా అయోమయాన్ని సృష్టిస్తుందా అనేది వేచి చూడాలి. ఐపీఎల్ 2026 సీజన్ సీఎస్కే భవిష్యత్తు దిశను నిర్ణయించనుంది. జట్టు ఈసారి కొత్త బ్యాటింగ్ ఆర్డర్‌ను ప్లాన్ చేస్తోంది. ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉండగా, గైక్వాడ్ మూడో స్థానంలో వచ్చే అవకాశం ఉంది.
ఈ సీజన్‌లో సీఎస్కేకు బౌలింగ్ విభాగం కొంత ఆందోళన కలిగిస్తోంది. రవీంద్ర జడేజా, సామ్ కరన్ వంటి కీలక ఆల్‌రౌండర్ల దూరం కావడంతో లోయర్ మిడిల్ ఆర్డర్‌లో లోటు కనిపిస్తోంది. నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్ బౌలింగ్‌ను నడిపించనున్నారు. అయితే, చెపాక్ వంటి స్పిన్ అనుకూల పిచ్‌లపై నూర్ అహ్మద్, రాహుల్ చాహర్ ప్రభావం చూపే అవకాశం ఉంది. వీరితో పాటు సౌతాఫ్రికా హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్, భారీ ధరకు కొనుగోలు చేసిన యువ ఆటగాళ్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లపై ఫ్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. మార్చి 30న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో సీఎస్కే తన వేటను ప్రారంభించనుంది.