వరలక్ష్మీ వ్రతాన్ని వరలక్ష్మీ పూజగా కూడా పిలుస్తారు. ఈ పండుగలో శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. వరలక్ష్మీ అంటే వరాన్ని ప్రసాదించేవారు అని అర్థం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెళ్లైన ఆడవారు ఈ రోజు ఉపవాసం ఉంటారు. ప్రతి ఏడాది వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి లేదా పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు జరుపుకుంటారు. పెళ్లైన ఆడవారు లక్ష్మీదేవీ అనుగ్రహం పొందడానికి ఈ వ్రతాన్ని చేస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీదేవిని పూజించడం సంపద, భూమి, విద్య, కీర్తి, ప్రేమ, శాంతి, ఆనందం, బలం ఎనిమిది దేవతలైన అష్టలక్ష్మీ (లక్ష్మీదేవి 8 రూపాలు)ని ప్రార్థించడంతో సమానం. ఇక ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఈ రోజు అంటే ఆగస్టు 25 న జరుపుకుంటున్నాం.