
Makar Sankranti 2024: దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ మకర సంక్రాంతి నాడే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి బయటకు వచ్చి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని సూర్యుని ఉత్తరం వైపు కదలిక అంటారు. ఈ రోజున సూర్యుడిని పూజించడం, ఆరాధించడం ద్వారా భక్తులు సకల బాధలు తొలగిపోయి, సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని మతవిశ్వాసం ఉంది.
ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే సకల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తారు. ఈ సమయంలో సూర్యుడు ఉత్తరాయణుడు అవుతాడు కాబట్టి సూర్యుడికి ఈ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పూజా ఫలాలు కూడా పెరుగుతాయి.
ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15 న మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది మనం జనవరి 15 మకర సంక్రాంతిని జరుపుకోబోతున్నాం. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున దానం, స్నానానికి విశేష ప్రాముఖ్యత ఉంది.
మకర సంక్రాంతి నాడు స్నానం ప్రాముఖ్యత
మకర సంక్రాంతి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున గంగా లేదా మరేదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే పవిత్ర నదిలో స్నానమాచరించడం వల్ల పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోయి చెడు కర్మల నుంచి విముక్తి లభిస్తుందట. మకర సంక్రాంతి నాడు గంగానదిలో స్నానం చేసే వారికి ఎన్నో త్యాగాలకు సమానమైన ఫలం లభిస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది.
అలాగే ఇది వేయి ఆవుల దానంతో సమానమైన ఫలాన్ని కూడా ఇస్తుందని చెప్తారు. ఈ కారణంగా మకర సంక్రాంతి స్నానం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. మకర సంక్రాంతి నాడు బ్రహ్మ ముహూర్తంలో నదిలో స్నానం చేస్తే అది మరింత ఫలప్రదంగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది.
మకర సంక్రాంతి సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల శరీరంతో పాటు ఆత్మ కూడా శుద్ధి అవుతుందని, మనస్సు స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు. ఈ రోజున స్నానం చేసే శుభ సమయాన్ని సాధారణంగా సూర్యోదయానికి ముందు సమయంగా భావిస్తారు.
మకర సంక్రాంతి నాడు గంగా, యమున, గోదావరి, నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానమాచరించి ఆత్మ శుద్ధి చేసుకుంటారు. నదిలో స్నానం చేయలేకపోతే ఇంట్లోని స్నానపు నీటిలో కొన్ని చుక్కల గంగాజలాన్ని కలిపి స్నానం చేసినా పుణ్య ఫలాలు పొందుతారని పండితులు చెప్తారు. మకర సంక్రాంతి నాడు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. కాబట్టి స్నానం కూడా సూర్యభగవానుడి ఆరాధన రూపంగా పరిగణించబడుతుంది.
మకర సంక్రాంతి రోజున దానం ప్రాముఖ్యత
మకర సంక్రాంతి సమయంలో దానం చేయడం వల్ల ఒక వ్యక్తి ప్రతికూల కర్మను వదిలించుకుంటాడు. అలాగే సానుకూలతను ఆకర్షించడానికి దానం సహాయపడుతుందని నమ్ముతారు. నిస్వార్థ దాతృత్వం,దాతృత్వంలో పాల్గొనడానికి ఇది సరైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ఆహార ధాన్యాలను దానం చేయడం, బట్టలు దానం చేయడం, పేదలకు ఆహారం అందించడం ఒక సాధారణ దానం మార్గం. ఈ రోజున చేసే దానం వంద జన్మల దానంతో సమానంగా భావిస్తారు.
మకర సంక్రాంతి నాడు బట్టలు, దుప్పట్లు దానం చేస్తే కూడా మంచిదని జ్యోతిష్యులు చెప్తారు. ఈ రోజున పేదలకు అన్నం పెట్టడం వల్ల అనేక పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ పండుగ చలికాలంలో వస్తుంది కాబట్టి అవసరమైన వారికి వెచ్చని దుస్తులు లేదా దుప్పట్లను ఇవ్వడం ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ఈ రోజున నల్ల నువ్వుల దానం, కిచిడీ దానం, బెల్లం దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వీటిని దానం చేయడం శుభ ఫలితాలు పొందుతారని చెప్తారు. మకర సంక్రాంతి రోజున ఆహారం, నువ్వులు, బెల్లం, వెచ్చని దుస్తులు, దుప్పట్లు దానం చేయడం వల్ల శని, సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. మకర సంక్రాంతి నాడు స్నానం, దానం కలయిక అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.