kartika purnima 2023: కార్తీక మాసంలో పౌర్ణమి నాడు జరుపుకునే పండగే కార్తీక పౌర్ణమి. ఈ పండుగ విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ కార్తీక పౌర్ణమి శివుడి కుమారుడు కార్తికేయుడు జన్మించిన రోజును కూడా సూచిస్తుంది. ఈ రోజున మహావీరుడు నిర్వాణం పొందినందున జైన భక్తులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు పవిత్ర నదుల్లో స్నానమాచరించి విష్ణుమూర్తిని పూజిస్తారు. ఆయన అనుగ్రహం కూడా ప్రార్థిస్తారు.
కార్తీక పౌర్ణమి తేదీ, తిథి
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 27న రానుంది. పూర్ణిమ తిథి నవంబర్ 26 న 15:55 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ 27న 14:47 గంటలకు ముగుస్తుంది.
కార్తీక పౌర్ణమి వ్రత కథ: కార్తీక పౌర్ణమి పర్వదినాన భక్తులు నిష్టగా ఉపవాసం ఉంటారు. అలాగే వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు.
ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు తనకున్న అపారమైన శక్తితో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ఈ రాక్షసుడిని దేవతలు కూడా ఓడించలేకపోతారు. దీంతో దేవతలందరూ శివుడి దగ్గరకు వెళ్లి రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించమని వేడుకుంటారు. శివునికి జన్మించిన కుమారుడు మాత్రమే తారకాసురుడిని జయించగలడని శివుడు వారికి తెలియజేస్తాడు. అయితే శివుడు ధ్యానంలో ఉంటాడు. అలాగే పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు.
అప్పుడు దేవతలు సహాయం కోసం విష్ణువును ఆశ్రయిస్తారు. శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరకు వెళ్తాడు. శివుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు. ఇతనే రాక్షసుడు తారకాసురుడిని ఓడిస్తాడు. కార్తికేయుడు తారకాసురునిపై సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు కార్తీక పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరిచడం మొదలు పెట్టారు. ఈ వ్రతాన్ని చిత్తశుద్ధితో, భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేస్తారు. ఆ తర్వాత శివుడికి, విష్ణుమూర్తికి పూజ చేస్తారు. ఆ తర్వాత దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూజ చంద్రుడికి పూజలు చేసి ఉపవాసాన్ని విరమిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షాన్ని పొందుతారని, జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.