Karthika Pournami 2023: హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున ప్రజలు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమిని నవంబర్ 27వ తేదీ అంటే సోమవారం నాడు జరుపుకోబోతున్నాం. ఈ రోజున ఉపవాసం ఉండేవారికి అక్షయ పుణ్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. దీంతో మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.
కార్తీక పౌర్ణమి తేదీ
పౌర్ణమి తిథి ప్రారంభం - నవంబర్ 26 - 03:53
పౌర్ణమి తేదీ - నవంబర్ 27 - 02:45
కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత
ఈ కార్తీక పౌర్ణమి అత్యంత ముఖ్యమైన పౌర్ణమిగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున ప్రజలు ఉపవాసం ఉంటారు. అలాగే సత్యనారాయణ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పూజిస్తారు. అలాగే ఈ రోజున గంగానదిలో స్నానం కూడా చేస్తారు. ఈ రోజు గంగాస్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఈ రోజు ప్రజలు వివిధ మత, ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహిస్తారు. అలాగే నిరుపేదలకు దాన ధర్మాలు కూడా చేస్తారు.
కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాలు
కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం.. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించాలి. యజ్ఞం, దానం, వ్రతం, సత్యనారాయణ వ్రతం వంటి ధార్మిక కార్యాలు చేయాలి. మహావిష్ణువు ఆలయానికి వెళ్లి నియమాల ప్రకారం పూజించాలి. ఈ పవిత్రమైన రోజున దేవాలయాలలో దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చంద్రుడిని పూజించడం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు.