sabarimala
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాలు కేరళలో ఉన్నాయి. కానీ అన్నింటిలో శబరిమల అయ్యప్ప ఆలయం ఎంతో ప్రత్యేకమైంది. కేరలలో ఈ ఆలయం కంటే ఎక్కువ ప్రసిద్ది చెందిన మరొక ఆలయం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలోని గొప్ప తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడే శబరిమల అయ్యప్ప ఆలయానికి ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. కేరళలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో శబరిమల ఒకటి. ఈ ఆలయం గురించి మనలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం పదండి.
1. బ్రహ్మచర్యాన్ని ఆచరించే దేవుడు
శబరిమలలో కొలువుదీరిన అయ్యప్పస్వామి బ్రహ్మచారి అన్న విషయం ఎంతమందికి తెలుసు? అలాగే ఈ అయ్యప్ప ఆలయం బ్రహ్మచర్య నియమాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే 10 నుంచి 50 ఏండ్ల లోపున్న మహిళలకు ఆలయంలోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఈ నియమం ప్రస్తుతం లేదు. అయితే ఈ ఆచారం 1500 సంవత్సరాలుగా ఆలయంలో కొనసాగుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆడవాళ్లకు ఈ గడికి ప్రవేశం ఉంది.
2. నెంబరు 18
శబరిమల ఆలయానికి, 18 నెంబర్ కు సంబంధం ఉంది. ఎందుకంటే శబరిమల అయ్యప్ప ఆలయం చుట్టూ 18 కొండలు ఉన్నాయి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే 18 మెట్లను ఎక్కాలి. ఈ 18 దశల కు ఉన్న అర్థాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మొదటి ఐదు దశలు పంచేంద్రియాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మిగతా ఎనిమిది దశలు కామం, కోపంతో సహా ఎనిమిది చెడు లక్షణాలను సూచిస్తాయి. తర్వాతి మూడు దశలు మూడు గుణాలను సూచిస్తాయి. చివరి రెండు దశలు జ్ఞానానికి, అజ్ఞానానికి చిహ్నాలు. ఈ 18 మెట్లు ఎక్కడం ద్వారా భక్తులు ప్రాపంచిక వాంఛల నుంచి విముక్తి పొందొచ్చని చెప్తారు.
3. అయ్యప్పస్వామి, వావర్ స్వామి మధ్య స్నేహం
శబరిమల ఆలయానికి దగ్గర్లో ఒక సూఫీ మందిరం ఉంటుంది. అయితే శబరిమలకు వెళితే మీరు ముందు ఈ సూఫీ మందిరాన్ని సందర్శించి ఆ తర్వాతే శబరిమల ఆలయాన్ని సందర్శించాలని చెప్తుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఎందుకంటే ఈ రెండు పుణ్యక్షేత్రాల మధ్య అనుబంధం ఉంది. అరేబియా నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వావర్ ఒక సముద్రపు దొంగ. ఇతను కేరళలో చాలా చోట్ల దొంగతనాలు చేసేవాడు. దీన్ని అడ్డుకునేందుకు అయ్యప్ప స్వామి యుద్ధం చేయమని వావర్ కు సవాల్ విసిరారు. ఈ యుద్దంలో అయ్యప్ప స్వామి వావర్ ను ఓడించాడు. కానీ వావర్ అయ్యప్ప స్వామి పట్ల ఎంతగానో ఆకర్షితుడై అయ్యప్ప భక్తుడిగా మారాడు. మహిషి అని పిలువబడే రాక్షసుడిని ఓడించడానికి వావర్ అయ్యప్ప స్వామికి సహాయం చేస్తాడు. అయ్యప్పస్వామి శబరిమలకు వెళ్లినప్పుడు.. వావర్ ను ఆలయ సమీపంలోనే ఉండాలని కోరుతాడు. అప్పటి నుంచి అయ్యప్ప భక్తులు ముందుగా వావర్ స్వామి ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.
4. రామాయణ గాథతో సంబంధం
శబరిమల ఆలయం రామాయణంలోని కథతో సంబంధాన్ని కలిగి ఉంటుందంటారు. ఎందుకంటే ఇక్కడ 18 కొండల మధ్య శబరి నివసించేదని చెప్తారు. శబరి శ్రీరాముని భక్తురాలు. ఆమె భక్తికి ముగ్ధుడై రాముడు ఆమెకు దర్శనమిచ్చాడు. శబరిమల ఆలయానికి శబరి అని పిలువబడే ఈ గొప్ప రామ భక్తురాలి పేరు పెట్టారు.
5. 41 రోజుల ఉపవాసం, కఠిన నియమాలు
శబరిమల ఆలయానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కాగా శబరిమల ఆలయాన్ని భక్తులు సందర్శించడానికి ముందు 41 రోజులు కఠినమైన ఉపవాసం ఉండాలి. ఈ 41 రోజులు సాధారణంగా నవంబర్ 15న ప్రారంభమై డిసెంబర్ 24 వరకు ఉంటాయి. ఈ 41 రోజుల ఉపవాసాన్ని వ్రతం అని కూడా అంటారు. ఆచారాలు ఎంతో కఠినంగా ఉంటాయి. అయినా భక్తులు ఈ ఆచారాలను ఖచ్చితంగా పాటించాలి. అంటే వీళ్లు శాఖాహారం మాత్రమే తినాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైనే పడుకోవాలి. జుట్టును, గోర్లను కట్ చేయకూడదు. అలాగే నీలం లేదా నలుపు రంగు దుస్తులనే ధరించాలి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు మాంసం, మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి. అయ్యప్ప స్వాములు రోజుకు రెండుసార్లు చల్లటి నీటితోనే స్నానం చేయాలి. బూతు పదాలను, అసభ్యకర మాటలను మాట్లాడకూడదు.
6.. నెయ్యాభిషేకం
శబరిమల అయ్యప్ప ఆలయంలో ఇప్పటికీ కూడా నెయ్యాభిషేకం ఆచారాన్ని పాటిస్తారు. అంటే అయ్యప్ప స్వామి విగ్రహానికి నెయ్యితోనే అభిషేకిస్తారు.
7. దక్షిణ కోట్లలో
శబరిమల అయ్యప్ప ఆలయానికి ప్రతి సంవత్సరం ఎంతో మంది భక్తులు వెలుతుంటారు. కాగా ఈ అయ్యప్ప ఆలయం భారతదేశంలోని సంపన్న దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ ఆలయ సంపద ఎంత అపారమైంది. అంటే ఈ సంపదను లెక్కించలేమన్న మాట. పూజారుల 'దక్షిణ' ఒక్కటే కొన్ని కోట్ల భారతీయ రూపాయలకు సమానమట.
8. ప్రసాదం
శబరిమల అయ్యప్ప స్వామికి సమర్పించే నైవేద్యం ఎంతో ప్రత్యేమైంది. ఈ ప్రసాదాన్ని ఇక్కడకు వచ్చిన భక్తులకు పంచుతారు. మిగిలిన ప్రసాదాన్ని కేరళలోని స్థానిక దుకాణాలు, విక్రేతలకు పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదం కేరళలో ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకంగా పరిగణించబడుతుంది.