తిరుపతి దగ్గర్లో 2,600 ఏళ్ల క్రితం కట్టిన ప్రపంచంలోనే మొదటి శివాలయం మీరు చూశారా?

First Published | Aug 5, 2024, 8:04 AM IST

గుడి మల్లం శివాలయం. దేశంలో ఏ శివాలయాలకు లేని ప్రత్యేక ఈ ఆలయానికి ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందిన ఈ శివాలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. 

గుడి మల్లం.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గ్రామం. ఇది తిరుపతికి 20 కిలోమీటర్లు ఉంటుంది. రేణిగుంట విమానాశ్రయం నుంచి అయితే సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో ఉన్న స్వామివారు అత్యంత పురాతన శివలింగంగా పేరొందారు. ఇక్కడి శివుడు పరశు రామేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నారు. 

Gudi Mallam Temple

గుడి మల్లం శివ లింగానికి ఎంతో విశిష్టత ఉంది. పరశు రామేశ్వరుని ఆలయంలో గర్భాలయం అంతరాలయం, ముఖ మండపాల కంటే లోతులో ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం లింగ రూపంలో కనిపించదు. మానవ రూపంలో మహావీరుడైన వేటగాడిలా దర్శనమిస్తుంది. 

Latest Videos


Gudi Mallam ParasuRameshwara Swamy

5 అడుగుల మనుష రూప శివలింగం...

గుడి మల్లంలో శివలింగం ముదురు కాఫీ రంగులో దర్శనమిస్తుంది. సుమారు 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పుతో ఉంటుంది. లింగంపై ముందువైపు ఉబ్బెత్తుగా బయటకు పొడుచుకొని వచ్చినట్లు యక్షుని భుజాలపై నిలబడి శివుడు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి రెండు చేతులతో ఉండగా... కుడిచేతితో ఒక పొట్టేలు (గొర్రెపోతు), ఎడమచేతిలో చిన్నగిన్నెను పట్టుకొని దర్శనమిస్తున్నాడు. ఎడమ భుజానికి గండ్రగొడ్డలి తగిలించుకొన్నట్లు ఉన్నాడు. స్వామివారి జటలు (జుట్టు) అన్నీ పైన ముడివేసినట్లు, చెవులకు రింగులు, ఇతర ఆభరణాలు కనిపిస్తాయి. అలాగే, నడుం చుట్టూ చుట్టి మధ్యలో కిందకు వేలాడుతున్నట్లు మోకాళ్ల వరకూ వస్త్రం ఉంటుంది. అయితే, ఇక్కడ స్వామివారి శరీర భాగాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. స్వామికి యగ్నోపవీతం ఉండదు. లింగం పైభాగం, కింద పొడవైన స్తంభ భాగాలను విడదీస్తున్నట్లుగా ఓ లోతైన పల్లం పడిన గీత స్పష్టం కనిపిస్తుంది. లింగం మొత్తం పురుషాంగాన్ని పోలి ఉంటుంది. 

gudi mallam

క్రీస్తుపూర్వం 2వ శతాబ్దపు కాలం నాటిది...

గుడి మల్లం శివలింగం అతిప్రాచీనమైందిగా గుర్తింపు దక్కించుకుంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కాలపు శైవారాధనకు ఇదో ఉదాహరణగా పేర్కొంటున్నారు. కాగా, గుడిమల్లం 2009 వరకు వురావస్తు శాఖ అధీనంలో ఉంది. అప్పట్లో పూజలు జరగకపోవడంతో భక్తులు పెద్దగా రాలేదు. అప్పుడప్పుడూ వచ్చే భక్తులు, సందర్శకులకు పురావస్తు శాఖ ఉద్యోగి ఒకరు శివలింగాన్ని చూపించేవారు. గుడి మల్లం గ్రామానికి వెళ్లలేని వారి కోసం ఇక్కడి ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాలా పోలిన విగ్రహాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శనశాలలో ఏర్పాటు చేశారు. 

gudi mallam

రుద్రుని ప్రతిరూపం...

పురాతన శాస్త్రవేత్త గోపీనాథరావు 1911లో ఏడాది పాటు పరిశోధించి గుడిమల్లం శివలింగం ఉనికిని గుర్తించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే శివ లింగం ఇక్కడ ఉందని చాటిచెప్పారు. యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపం... తలపాగా, దోవతి ధరించిన ఈ వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని అంచనా. 

క్రీస్తు శకం 2వ శతాబ్దపు అవశేషాలు..

గుడి మల్లం శివాలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది. ఆలయంలో దొరికిన శాసనాల్లో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాల్లో క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన అవశేషాలు వెలుగు చూశాయి. 

పూజలు ఆగిపోయాయి...

చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన గుడి మల్లం శ్రీ పరశు రామేశ్వరుని ఆలయాన్ని 1954లో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. నాటి నుంచి ఆలయంలో పూజలు నిర్వహించలేదు. చాలా విగ్రహాలను దొంగిలించుకుపోయారు. 

గ్రామస్థుల పోరాటం...

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న గుడి మల్లం ఆలయంలోని శివలింగం గురించి ఆర్కియాలజీ వెబ్‌సైట్‌లో కనీస సమాచారం లేదని.. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆర్కియాలిజీ డిపార్ట్‌మెంట్‌తో పోరాటం చేశారు. ఇంతటి ప్రముఖ ఆలయానికి సంబంధించిన ఆస్తులు, సాహిత్యానికి సంబంధించిన సమాచారం కూడా ఆర్కియాలజీ శాఖ వద్ద లేదని తేల్చారు. గ్రామస్థుల పోరాట ఫలితంగా 2009లో ఆలయంలో పూజలు నిర్వహించేందుకు గ్రామస్తులకు అనుమతి లభించింది. 

ఉజ్జయినిలో రాగి నాణేలపై... 

గుడి మల్లంలో కొలువై ఉన్న శివలింగాన్ని పోలిన బొమ్మ ఉజ్జయినిలో దొరికిన రాగి నాణేలపై ఉంది. మధుర మ్యూజియంలోనూ ఇలాంటి శిల్పం ఉంది. పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం, డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ అనే రెండు పుస్తకాలు, కొన్ని శిల్ప, కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా గుడి మల్లం ఆలయ విశిష్టత తెలియజేసే ఏ సమాచారమూ లేదు. 

గుడి మల్లం చరిత్ర.. పురాణాలు ఏం చెబుతున్నాయి?

పురాణాల్లోని కథల ఆధారంగా గుడి మల్లం చరిత్ర ఇలా ఉంది. తండ్రి ప్రోద్బలంతో తల్లి శిరఛ్చేదం చేసేందుకు పరశురాముడు సిద్ధమవుతాడు. ఆ ఆవేదన నుంచి బయట పడేందుకు శివలింగాన్ని వెతికి పూజించమని రుషులు పరశురాముడికి సెలవిస్తారు. శోధించగా శోధించగా అడవి మధ్యలో ఒక లింగాన్ని పరశురాముడు గుర్తించి... అటుపై ఆలయ సమీపంలోని ఒక చెరువు తవ్వి.. అక్కడే పూజించడం ప్రారంభిస్తాడు. ఆ చెరువులో ప్రతిరోజూ ఓ పుష్పం పూస్తుంది. దాంతో పరశురాముడు శివుని పూజించేవాడు. ఆ పువ్వుని అడవి జంతువుల బారి నుండి రక్షించేందుకు ఒక యక్షుడిని కాపలా పెడతాడు. ఓ రోజు పరశురాముడు లేని సమయంలో యక్షుడు స్వయంగా ఆ పుష్పంతో శివుడిని పూజిస్తాడు. తీరా పరశురాముడు పూజకు వచ్చే సమయానికి పుష్పం లేకపోవడంతో కోపోద్రిక్తుడై యక్షునిపై దండెత్తుతాడు. ఆ యుద్ధం 14 ఏళ్లపాటు సాగింది. దీంతో అక్కడ పెద్ద గొయ్యి లేదా పల్లం ఏర్పడింది. ఆ ప్రదేశాన్నే గుడిపల్లం అని పిలిచేవారు. నిర్విరామంగా సాగుతున్న ఆ యుద్ధాన్ని ఆపేందుకు సాక్షాత్తూ పరమశివుడే ప్రత్యక్ష్యమై ఇద్దరినీ శాంతింపజేశాడు. పరశురాముడు, యక్షుడి భక్తికి మెచ్చి శివుడే రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు. అలా, శివలింగం ఒక ఆకారం పరశురాముడు ఒక చేతిలో వేటాడిన మృగంతో, రెండో చేతిలో కల్లుకుండ ఉన్నట్లు కనిపిస్తుంది.

ప్రతి 60 ఏళ్లకోసారి వరదలు..

అలాగే, గుడి మల్లం ఆలయానికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ ప్రధాన గది లోపల ప్రతి 60 ఏళ్లకోసారి వరదలు వచ్చి.. పూర్తిగా నీటితో మునిగిపోతుందని ప్రచారం ఉంది. అయితే, ఒక చిన్న భూగర్భ తొట్టి, దానికి అనుసంధానంగా ఒక వాహిక శివలింగం పక్కన నేటికీ కనిపిస్తోంది. వరద నీరు అకస్మాత్తుగా శివలింగం పైభాగాన్ని తాకి ఒక్కసారిగా కిందకు ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఈ భూగర్భ ట్యాంక్ పూర్తిగా ఎండిపోతుంది. ఇలా 2005 డిసెంబరు 4న జరిగినట్లు ఆలయ సర్వే రిపోర్టులో పేర్కొన్నారు. కొందరు గ్రామస్థులు కూడా దీన్ని చూసినట్లు ప్రచారం ఉంది. 

click me!