dussehra 2023: దసరా పండుగను విజయదశమి అని కూడా అంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజు శ్రీరాముడు లంక రాజు రావణుడిని వధించి విజయం సాధించాడని నమ్ముతారు. అందుకే చెడు ఓటమికి చిహ్నంగా ప్రతి ఏడాది విజయదశమి నాడు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసే సంప్రదాయం ఉంది. కానీ భారతదేశంలో కొన్ని చోట్ల రావణుడి దిష్టిబొమ్మను అస్సలు దహనం చేయరు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలేంటో.. దీనివెనకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మందసౌర్, మధ్యప్రదేశ్
రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మందసౌర్ అని అంటారు. అందుకే ఇక్కడి వాళ్లు రావణుడిని తమ అల్లుడిగా భావిస్తారు. అందుకే అల్లుడి మరణం వాళ్లకు ఆనందాన్నివ్వదు. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడి దహనం చేయరు. అక్కడ రావణుని మరణానికి విజయదశమి నాడు సంతాపం తెలుపుతారు. అంతేకాదు ఇక్కడ 35 అడుగుల ఎత్తైన రావణుడి విగ్రహం కూడా ఉంది.
ravan 04
బిస్రాఖ్, ఉత్తర ప్రదేశ్
ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న బిస్రాఖ్ గ్రామంలో రావణుడు జన్మించాడని గట్టి నమ్మకం ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని తమ పూర్వీకుడిగా భావిస్తారు. అందుకే దసరా రోజు అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తారు. రావణుని తండ్రి విశ్రవ మహర్షి, తల్లి కైకేశి. రావణుని తండ్రి విశ్రవుడు ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడని కూడా నమ్ముతారు. దీనికి గౌరవార్థం ఈ ప్రదేశానికి బిస్రాఖ్ అని పేరు పెట్టారు. ఇక్కడి వారు రావణుడిని మహా బ్రాహ్మణుడిగా భావిస్తారు.
కాంగ్రా, ఉత్తరాఖండ్
కాంగ్రాలోని లంకాపతి శివుని కోసం కఠిన తపస్సు చేసి.. పరమేశ్వరుడికి ఆశీస్సులు పొందాడని ఇక్కడి ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని మహాదేవుని అతి పెద్ద భక్తుడిగా భావిస్తారు. గౌరవిస్తారు. అందువలన ఇక్కడ కూడా రావణ దహనం జరగదు.
మండోర్, రాజస్థాన్
ఈ ప్రదేశం మండోదరి తండ్రికి రాజధానిగా ఉండేదని నమ్ముతారు. రావణుడు మండోదరిని ఇక్కడే వివాహం చేసుకున్నాడని కూడా నమ్ముతారు. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని తమ అల్లుడిగా భావిస్తారు. గౌరవిస్తారు. అందుకే విజయదశమి నాడు ఇక్కడ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.
గడ్చిరోలి, మహారాష్ట్ర
ఈ ప్రదేశంలో గోండు తెగకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. వీరు తమను తాము రావణుడికి వారసులుగా భావిస్తారు. వీళ్లు రావణుడిని పూజిస్తారు. కొందరి అభిప్రాయం ప్రకారం.. తులసీదాస్ రామాయణం మాత్రమే రావణుడిని చెడ్డదిగా చూపిస్తుందట. అందుకే ఈ ప్రదేశంలో కూడా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.