నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గమాత తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తాం. అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉంటుంటారు. ఇప్పటికే నవరాత్రుల్లో ఏడు రోజులు గడిచిపోయాయి. నవరాత్రులలో ఎనిమిదో రోజున దుర్గామాత మరో రూపమైన మహాగౌరీ అమ్మవారిని పూజిస్తాం. నవరాత్రులలో ఈ అష్టమి తేదీని మహాష్టమి లేదా దుర్గ అష్టమి అని కూడా అంటారు. ఈ సందర్భంగా ఎనిమిదో అవతారమైన మహాగౌరీ దేవి ఉపవాస కథను ఇప్పుడు తెలుసుకుందాం..
మహాగౌరీ వ్రత కథ
పురాణాల ప్రకారం.. పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడానికి ఎన్నో వేల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తుంది. ఈ సమయంలో పార్వతీదేవి ఆహారాన్నే కాదు పచ్చి మంచి నీళ్లను కూడా ముట్టుకోదు. దీని వల్ల ఆమె శరీరమంతా నల్లగా మారుతుంది.
శివుడు పార్వతీదేవి కఠోర తపస్సు చూసి సంతోషించి ఆమెను తన భార్యగా అంగీకరిస్తాడు. శరీరం నల్లబడటం వల్ల శివుడు అతన్ని గంగా నీటితో శుద్ధి చేస్తాడు. తర్వాత పార్వతీదేవి శరీరం తిరిగి ప్రకాశవంతంగా మారుతుంది. ఈ సమయంలో పార్వతీ మాత శరీర రంగు తెల్లగా మారుతుంది. అందుకే పార్వతీదేవిని మహాగౌరి అని పిలిచేవారు.
మహాగౌరీ దేవిని పూజించడం వల్ల భక్తుల పాపాలన్నీ నశించిపోతాయట. అలాగే అక్షయ పుణ్యాన్ని పొందుతాడని నమ్ముతారు. అందుకే నవరాత్రుల్లో మహాగౌరి ఆరాధన సమయంలో అమ్మవారి మంత్రాలను పఠించండి. దీంతో మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు నెలకొంటాయి. వైవాహిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.