దీపావళి పండగ అంటే అందరికీ ఇష్టమే. ఈ పండగ రోజున ఇంటిని అందంగా అలంకరించుకొని, సాయంత్రం టపాసులు కాల్చుకుంటాం. అంతేనా, రకరకాల పిండి వంటలు వండుకొని కమ్మగా ఆరగిస్తాం. పండగను అందరం ఆనందంగానే జరుపుకుంటున్నాం. కానీ, అసలు ఈ పండగ ఎప్పుడు మొదలైంది..? అసలు మనం ఈ పండగను ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం మీకు తెలుసా? దీపావళి వెనక ఉన్న కథలేంటో మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
దీపావళి జరుపుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథను చెబుతూ ఉంటారు. అయితే, ఎక్కువగా రామాయణ, మహాభారతాల్లో మాత్రం రెండు కథలు వినపడుతూ ఉంటాయి. వాటిలో ఒకటి. శ్రీరాముడి తన అరణ్యవాసం ముగించుకొని అయోధ్య చేరిన రోజు. తండ్రి కోరిక మేరకు అడవులకు శ్రీరాముడు వెళతాడు. అక్కడ సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోతాడు. రావణాసురిడిని ఓడించి, సీతమ్మ తల్లిని అతని చెర నుంచి విడిపించిన తర్వాత, భార్య సమేతంగా అయోధ్య చేరతాడు. ఆ సమయంలో రాముడు తిరిగి వచ్చాడనే ఆనందంతో అయోధ్య ప్రజలు టపాసులు కాలుస్తూ, ఆనందం పంచుకున్నారు. అయోధ్య నగరాన్ని దీపాలతో అలంకరించారు. అందుకే, ఆ రోజు నుంచి రాముడు అయోధ్య చేరిన రోజుని దీపావళి జరుపుకుంటూ వస్తున్నారని చాలా మంది నమ్ముతారు.
భారతంలో మరో కథ కూడా ఉంది. ప్రాగ్జ్యోతిష పురాన్ని పరిపాలించేవాడు నరకాసురుడు. రాక్షసులకు రాజు. అతడు భూమి పుత్రుడు. ఇతను దేవతలను బాగా పీడించేవాడు. ఇంద్రుని సింహాసనాన్ని లాక్కున్నాడు. స్త్రీలను చెరపట్టడం లాటి అసభ్యకరమైన పనులు చేసేవాడు. ఆ బాధలనుంచి తమని కాపాడమని దేవతలు శ్రీకృష్ణుని వేడుకొనగా శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై యుద్ధానికి వెడతాడు. శ్రీకృష్ణడు ఆ యుద్ధంలో మూర్చ వచ్చి పడిపోతాడు. ఆ సమయంలో సత్యభామ యుద్ధం చేసి విజయం సాధించింది. నరకుని పీడ వదిలినందుకు దేవతలు, మానవులు అంతా సంతోషించి దీపాలు వెలిగించారు. ఆరోజునుంచి ఈ పండుగ అమలులోకి వచ్చింది. నరకాసురుడు తెల్లవారుజామున చంపబడడం చేత ఆ పీడ వదిలినందుకు ఆ సమయంలో తలంటుకోవడం, అభ్యంగన స్నానాదులు చేయడం అలవాటుగా మారింది.
ఈ కథలు పక్కన పెడితే, ఈ రోజుల్లో మనమంతా దీపావళి పండగను ఒక రోజుకి కుదించేశాం. కానీ, ఈ పండగను నిజానికి ఐదు రోజుల పాటు జరుపుకుంటారట. ఆ ఐదు రోజులకు కూడా ప్రత్యేకత ఉంటుందట. మరి, ఏ రోజుకి ఏం ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం..
Image: freepik.com
1 - ధన్వంతరీ త్రయోదశి - వాడుకలో ధన త్రయోదశి అని పిలుస్తారు. ఈ రోజున చాలా మంది బంగారం కొనాలని ఆశ పడుతుంటారు.కానీ, ఈ రోజున లక్ష్మీదేవి, కుభేరుడులను పూజించాలి. అంతేకాకుండా, ఈ రోజున "ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన "ధన్వంతరీభగవాన్" జయంతి కూడా. పాల సముద్రం చిలికిన సమయంలో అమృత భాండముతో అవతరించాడు.
2 - నరకచతుర్దశి - నరక యాతనల నుండి రక్షించమని, యముడి ప్రీతి కొరకు, పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు. ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము)ను పాలించే 'నరకుడు' నరరూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు. కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అద్భుతశక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. అతను ప్రతీ అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చేవాడు, కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు (రాచకన్యలు) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ(భూదేవీ అవతారం)తో కలసి గరుఢారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున ఇది 'నరక చతుర్దశి'.
3. దీపావళీ - రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్భంగా దీపావళి జరుపు కోవటం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము.
4. బలిపాఢ్యమి - వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి, "ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై" అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం.
5. యమద్వితీయ - సూర్య భగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు. యమున అనే ఒక పుత్రిక . యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు . అయితే, యముడు తనపని అంటే, జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ల లేదట. అయితే, ఓ రోజు యమున తన సోదరుడు యముడుని తన ఇంటికి భోజనానికి రమ్మని బతిమిలాడిందట. కార్తీక శుద్ఘ విదియ, మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు. అయితే, ఆ సమయంలో యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగిందట. ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు. అందుకే, ఈ రోజు చాలా మంది తమ సోదరి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళుతూ ఉంటారు.