ఆచార్య చాణక్యుడు భారతదేశపు గొప్ప పండితులలో ఒకరు. ఆయన తెలివితేటలు అపారమైనవి. ఆయన నీతి సూత్రాలు పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. శతాబ్దాల క్రితమే మనిషి సక్రమంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, క్రమశిక్షణతో ఎలా జీవించాలో తన నీతి సూత్రాల ద్వారా వివరించారు.
అతను చెప్పిన సూత్రాలు ఈ కాలంలో కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆయన తెలిపిన జీవిత సూత్రాలను మన జీవితంలోకి అన్వయించుకుంటే అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన నీతి సూత్రాల్లో 3 పనులపై డబ్బును ఎంతైనా ఖర్చు పెట్టమని చెప్పారు. ఈ పనుల్లో ఖర్చు చేసిన డబ్బు రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఆ 3 పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సమాజ సేవ కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేయండి
ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం సమాజ సేవ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు డబ్బును తక్కువ ఖర్చు చేయాలని ఆలోచించకూడదు. అక్కడ అవసరానికి తగ్గట్టుగా ఖర్చు చేయాలి తప్ప అంత ఖర్చు పెట్టే స్థాయి మన దగ్గర లేదని అనుకోకూడదు. మంచి పని చేయాలని సంకల్పిస్తే ఆటోమెటిక్ గా డబ్బు వివిధ దారుల్లో వచ్చి చేరుతుంది. చెట్లు నాటడం, రోడ్లు నిర్మించడం, చెరువులు తవ్వించడం, ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పనుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి. సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెండింతలై మళ్లీ ఆ వ్యక్తి వద్దకే వస్తుంది.
ధర్మ కార్యాల కోసం డబ్బు ఖర్చు చేయండి
ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం ధర్మంగా ఆచరించే పనుల కోసం డబ్బును ఎంతైనా ఖర్చు చేయాలి. మంచి పని చేసేటప్పుడు వెనక్కి తగ్గకూడదు. మీ శక్తి మేరకు డబ్బు ఇవ్వాలి. ధార్మిక కార్యాలలో ఖర్చు చేసిన డబ్బు పరలోకంలో మీకు సహాయపడుతుందని ధర్మ గ్రంథాలలో ఉందని చాణక్యుడు బోధించారు. సమాజంలో ధర్మం నిలబడటానికి అవసరమైన పనులు జరుగుతుంటే అంటే ఆలయాలు కట్టడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అన్నదానాలు చేయడం ఇలాంటి ధర్మాచరణ పనులకు తప్పకుండా డబ్బు ఇవ్వాలి.
పేదలకు సహాయం చేయండి
ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం మీ ముందు ఎవరైనా పేద వ్యక్తి సహాయం కోసం వస్తే, వారికి మీకు తోచిన సాయం చేయండి. సాయం అంటే ధన రూపంలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ శక్తి మేరకు ఆహారం, వస్తువులు ఇలా ఏదైనా ఇవ్వొచ్చు. ఇలా చేయడం వల్ల మీ మనసుకు శాంతి కలుగుతుంది. మీకు రెట్టింపు ఆనందం లభిస్తుంది. పేదలకు చేసిన సహాయం మాత్రమే మీ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. అపాత్ర దానం పనికి రాదు. అంటే అవసరం లేని వారికి ఎంత దానం చేసినా ఉపయోగం ఉండదు.