`సలార్‌`, `కల్కి`, `పుష్ప`.. సగం సగం కథలతో మేకర్స్ కక్కుర్తి ప్రయోగాలు?.. జనం ఎమోషన్స్ తో ఆటలా?

First Published | Jun 28, 2024, 3:11 PM IST

సినిమాల్లో టూ పార్ట్స్ ట్రెండ్‌ ఊపందుకుంది. అది పీక్‌లోకి వెళ్తుంది. అదే సమయంలో ఇప్పుడు దీనిపై విమర్శలు వస్తున్నాయి. సగం సగం కథలతో ఈ కక్కుర్తి పనులేంటి? అంటున్నారు ఆడియెన్స్. 
 

ప్రస్తుతం భారీ సినిమాలకు సంబంధించిన ఓ ట్రెండ్‌ నడుస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2ల ట్రెండ్‌ ఊపందుకుంది. `బాహుబలి` చిత్రంతో ప్రారంభమైన ఈ ట్రెండ్‌ ఇప్పుడు పీక్‌లో నడుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే `కేజీఎఫ్‌`, `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాలు వచ్చాయి. `కేజీఎఫ్‌` సక్సెస్‌ అయ్యింది. `పొన్నియిన్‌` విఫలమైంది. అయినా ఇప్పుడు తెలుగులో మాత్రం ఈ ట్రెండ్‌ గట్టిగా నడుస్తుంది. `పుష్ప`, `సలార్‌`, ఇప్పుడొచ్చిన `కల్కి2898ఏడీ` చిత్రాలు రెండు భాగాలుగానే రాబోతున్నాయి. మొదటి పార్ట్ ల్లో సగం కథలు చెప్పి, రెండో పార్ట్ కోసం వెయిట్‌ చేయిస్తున్నారు. ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు.
 

Pushpa 2

అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` సినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది. మొదటి పార్ట్ లో సగం కథే చెప్పడంతో రెండో పార్ట్ పై ఆసక్తి ఏర్పడింది. రెండో పార్ట్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.  ఇదిగో అదుగో అంటూ నాన్చుతూ వస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. ఈ సమ్మర్‌లో రావాల్సిన ఈమూవీ ఆగస్ట్ కి వెళ్లింది. ఆ తర్వాత ఇప్పుడు డిసెంబర్‌లోకి షిఫ్ట్ అయ్యింది. డిసెంబర్‌లోనైనా వస్తుందా? మళ్లీ వాయిదా పడుతుందా? అనేది కూడా సస్పెన్స్. `పుష్ప`లో హీరో విలన్‌కి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? హీరో, విలన్ల మధ్య ఎలాంటి ఫైట్‌ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అందుకే `పుష్ప2` కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కానీ మేకర్స్ త్వరగా ఫినిష్‌ చేయకుండా ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు.

Latest Videos


`సలార్‌` కూడా అంతే. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లో వచ్చింది. వెంటనే `సలార్‌ 2` ని తెరకెక్కిస్తారని, ఆల్‌రెడీ సగానికిపైగా షూటింగ్‌ చేశారని, ఈ సమ్మర్‌లో పార్ట్ 2 షూటింగ్‌ స్టార్ట్ చేస్తామన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మూవీ ప్రారంభానికి రెండేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. ఈ లోపుజనం దీన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంది. `సలార్‌`లోనూ సగం కథే చెప్పాడు ప్రశాంత్‌ నీల్‌. నిజం చెప్పాలంటే ఆయన ఇంటర్వెల్‌ పార్ట్ వరకే చూపించిన ఫీలింగ్‌ కలుగుతుంది. క్లైమాక్స్ లో ప్రభాస్‌ అసలు ఎవరు? శౌర్యంగవంశం కథేంటి? వరధతో గొడవేంటి? అనేది సస్పెన్స్ లో పెట్టి ఫస్ట్ పార్ట్ ని ముగించారు. దీంతో రెండో పార్ట్ కోసం ఆడియెన్స్ చాలా రోజులుగా ఈగర్‌గా వెయిట్‌ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది షూటింగ్‌ జరుపుకుని రిలీజ్‌కి రావడానికి రెండు మూడేళ్లు పడే ఛాన్స్ ఉంది. ఇది కూడా ఆడియెన్స్ సహనానికి పరీక్షనే అవుతుంది.
 

మరోవైపు ఇప్పుడు వచ్చిన `కల్కి2898ఏడీ` విషయంలోనూ అదే జరిగింది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. సినిమాకి చాలా వరకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. క్లైమాక్స్ అదిరిపోయిందని, విజువల్‌ గా ట్రీట్‌లా ఉందని, ఒక అసాధారణమైన స్టోరీ టెల్లింగ్‌ అని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా భారీ స్థాయిలోనే వసూళ్లని రాబట్టే అవకాశం ఉంది. ఇక ఇది ఏ స్థాయి విజయం అనేది మున్ముందు తేలనుంది. కాకపోతే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఆ స్థాయి ఊపు కనిపించడం లేదని ట్రేడ్‌ పండితుల నుంచి వినిపిస్తున్న మాట. దీనిపై క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వెయిట్‌ చేయాల్సిందే. 

ఇదిలా ఉంటే `కల్కి`లో అసలు కథనే లేదు. కేవలం పాత్రలను పరిచయం చేయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు. సెకండాఫ్‌లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. మెయిన్‌ కథలోకే వెళ్లే  క్రమంలోనే, అసలు గేమ్‌ స్టార్ట్ అయ్యే టైమ్‌లోనే సినిమాకి ఎండ్‌ కార్డ్ పడుతుంది. దీంతో కథ పరంగా ఒకింత అసంతృప్తితోనే ఆడియెన్స్ బయటకు వస్తారు. ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో ఆడియెన్స్ బయటకు వస్తారు. కథగా చూసినప్పుడు ఇది జస్ట్ ఇంట్రడక్షన్‌ మాత్రమే. అసలు కథ రెండో పార్ట్ లో ఉంటుంది. అంటే కేవలం పాత్రలను పరిచయం చేస్తూ మెయిన్‌ స్టోరీలోకి వెళ్లడానికే ఓ సినిమా తీశారు. మిగిలిన దానికి మరో ఒకటి రెండు పార్ట్ లు తీయబోతున్నారు. 
 

మేకర్స్ ఆడియెన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో సక్సెస్‌ అయ్యారు, కానీ సగం కథ చెప్పడమే ఇప్పుడు డిజప్పాయింట్‌ చేస్తుంది. రెండో పార్ట్ కోసం ఇంకెంత కాలం వెయిట్‌ చేయాలి అనే ఆవేదన కూడా ఆడియెన్స్ లో వినిపిస్తుంది. రెండు పార్ట్‌ ల కోసం కథని సాగదీసి డిజప్పాయింట్‌ చేస్తున్నారనే కామెంట్‌ కూడా ఇప్పుడు ఊపందుకుంది. ఎందుకంటే `కల్కి` మొదటి పార్ట్ లో అసలు కథే లేదు, ఫస్టాఫ్‌లో ఏ సీన్‌ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు, సెకండాఫ్‌లోగానీ క్లారిటీ వస్తుంది. అర్థమయ్యే లోపు సినిమా పూర్తయ్యింది. దీంతో ఇంటర్వెల్‌ వరకు సినిమా చూసిన ఫీలింగే కలుగుతుంది. చాలా మంది ఆడియెన్స్ ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. 
 

అంతేకాదు ఇప్పుడు తీవ్ర స్థాయిలో దీనిపై చర్చ ప్రారంభమైంది. ఒకే సినిమాలో కథ చెప్పకుండా ఎందుకీ సగం సగం కక్కుర్తి పనులు అంటూ పెదవి విరుస్తున్నారు ఆడియెన్స్. `బాహుబలి`, `కేజీఎఫ్‌`లో చాలా పెద్ద కథ ఉంది. ఒకటిగా చెబితే సరిపోదు. నిడివి చాలా పెద్దగా వస్తుంది. అందుకే రెండు పార్ట్ లు చేశారు. అందులో ఓ అర్థం ఉంది. కానీ `సలార్‌`, `పుష్ప`, ఇప్పుడు `కల్కి` చిత్రాల విషయంలో రెండు పార్ట్ లు చేయడంలో అర్థం కనిపించడం లేదు. సగం కథలే కనిపిస్తున్నాయి. పైగా రెండు పార్ట్ లు తీయాలనే ఉద్దేశ్యంతో సినిమాలను సీన్లని సాగదీసినట్టుగానే అనిపిస్తున్నాయి. ఇలా సగం సగం కథలు చెప్పి ఆడియెన్స్  ఎమోషన్స్ తో మేకర్స్ ఆడుకుంటున్నారని అంటున్నారు విశ్లేషకులు. అవసరంలేని సినిమాలు కూడా రెండు పార్ట్ లతో కాలయాపన చేస్తున్నారని, సక్సెస్‌ని క్యాష్‌ చేసుకునేందుకు, కాసుల కోసం కక్కుర్తి పనులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు క్రిటిక్‌. 
 

రెండు పార్ట్‌ ల వెనుక అసలు ప్లానేంటి?
ఇటీవల రెండు పార్ట్ లు రావడానికి కారణం ఓ కథని ఒక సినిమాలో చెప్పలేకపోవడమే అంటున్నారు. గతంలో ఏ సినిమాని రెండుగా చేశారు?. పౌరాణికాలు ఎన్నో వచ్చాయి.  రెండు పార్ట్ లు రాలేదు. ఒకే సినిమాగా చెప్పారు. కానీ ఇప్పుడు రావడం వెనుక కమర్షియల్ యాంగిల్‌ కూడా ఉంది. సినిమాకి భారీ బడ్జెట్‌ పెడుతున్నారు. మూడు, నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ బడ్జెట్‌ రికవరీ కోసం, భారీ లాభాల కోసం కూడా మేకర్స్ ఈ ప్లాన్‌ చేస్తుండటం గమనార్హం, కథపై కాన్ఫిడెన్స్ లేకపోవడం కారణంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు క్రిటిక్స్. ఎందుకంటే సింగిల్‌గా వచ్చిన `ఆర్‌ఆర్‌ఆర్‌`, `యానిమల్‌`, `పఠాన్‌`, `జైలర్‌`, `జవాన్‌` చిత్రాలు బాక్సాఫీసు వద్ద దుమ్ములేపాయి. సినిమాలో విషయం ఉంటే జనం ఆదరిస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు.
 

బలమైన కథ ఉన్నప్పుడు రెండుగా చెప్పడంలో తప్పులేదు, కానీ అవసరం లేని, పెద్ద కథలేని సినిమాల విషయంలోనూ అదే ఫార్మూలాని వాడటమే ఇప్పుడు అందరి అసంతృప్తికి కారణమవుతుంది. ఇదే కాదు ప్రస్తుతం ఎన్టీఆర్‌ `దేవర` కూడా రెండు భాగాలుగా రాబోతుంది. అలాగే రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` కూడా రెండుగా వస్తుందని అంటున్నారు. మరోవైపు `భారతీయుడు 2` కూడా రెండు భాగాలుగా రానుంది. `పుష్ప`, `సలార్‌`, `కల్కి 2898ఏడీ` మాదిరిగానే అవి కూడా ఉంటాయా? ఇలానే జనం ఎమోషన్స్ తో ఆడుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మేకర్స్ ఇకపైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తీసిన వెంట వెంటనే వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అలా కాదని ఏళ్లకు ఏళ్లు తీసుకుని ఆడియెన్స్ ఎమోషన్స్ తో గేమ్స్ ఆడితే అది మొదటికే మోసం వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి మేకర్స్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.  
 

click me!