కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల పార్టీ విలీనం!.. కేసీఆర్ చేతికి అస్త్రం..!!

First Published | Aug 12, 2023, 5:44 PM IST

వైఎస్ షర్మిల తన నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే రానున్న అసెంబ్లీ  ఎన్నికల్లో ఈ పరిణామాలు తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్త్రంగా మారే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. 

వైఎస్ షర్మిల తన నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ముహుర్తం కూడా ఖరారు అయినట్టుగా చెబుతున్నారు. అయితే రానున్న అసెంబ్లీ  ఎన్నికల్లో.. ఈ పరిణామాలు తెలంగాణ  ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అస్త్రంగా మారే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. 
 

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత వైఎస్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైంది. వైఎస్ జగన్‌ కూడా తన వైసీపీని ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేశారు. షర్మిల కూడా  వైసీపీలో కొనసాగుతూ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం కోసం కృషి చేశారు. ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. వైఎస్ షర్మిల తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. 

Latest Videos


అయితే ఆంధ్ర మూలాలు  ఉన్న షర్మిలకు తెలంగాణలో ఏం పని? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాను తెలంగాణ  కోడలు అని షర్మిల చెప్పుకున్నప్పటికీ.. వైఎస్ రాజశేఖరరెడ్డితో సహా ఆమె కుటుంబానికి ఆంధ్ర అనే ముద్ర ఉంది. 2009లో ఎన్నికల సమయంలో రాయలసీమ  ప్రాంతంలో వైఎస్సార్ మాట్లాడుతూ.. తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలట అనే  కామెంట్ చేశారు. ఇప్పటికీ ఈ కామెంట్స్‌ను బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తూనే ఉన్నారు. 
 

అయితే ఇలాంటి నేపథ్యమున్న షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి.. ఆమె పార్టీని విలీనం చేసుకోవడంపై పలువురు టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కోమటిరెడ్డి  వెంకట్‌రెడ్డి మాత్రం షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయించుందుకు పట్టుబడుతున్నారు. అయితే రేవంత్‌తో సహా పలువురు నాయకులు దీనిని వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం. 

అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయంగా ఎదిగారు. ఉమ్మడి నల్గొండ  నుంచి ఉన్న పాల్వాయి గోవర్దన్ రెడ్డి, పురుషోత్తమ రెడ్డిలను పక్కకు పెట్టి వీరికి వైఎస్సార్ అవకాశాలు కల్పించారు. ఈ క్రమంలోనే  వైఎస్ కుటుంబంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విధేయతను చాటుకుంటూ ఉంటారు. 
 

ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లో చేరి.. తెలంగాణలో పార్టీ తరఫున పనిచేస్తే 2018 సీన్‌ రిపీట్ అవుతుందేమోనని పలువురు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలు కూటమిగా పోటీ చేశాయి. ఇది కేసీఆర్‌కు అస్త్రంగా మారింది. చంద్రబాబును బూచిగా చూపించి.. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించడంలో కేసీఆర్ సక్సెస్‌ అయ్యారు. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఎన్నికల ఫలితాల  తర్వాత ఇరు పార్టీల మధ్య మళ్లీ దూరం పెరిగింది. 

అయితే ఇప్పుడు మళ్లీ  షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపితే.. అది రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు అస్త్రంగా మారుతుందని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. మరోసారి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
 

 షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే..  4 ఓట్లు వచ్చినా.. 400ఓట్లు వచ్చినా లాభమేనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్న కొందరు నాయకులు.. లాభం సంగతి  పక్కన ఉంచి అసలుకే ఎసరు వస్తుందేమోన్న అంటున్నారు. ఇదే విషయాన్ని వారు పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా సమాచారం.

click me!