తమ్ముడికి అండగా అన్న.. జగన్‌ సర్కార్‌కు చిరంజీవి కౌంటర్!.. రూట్ మారుస్తున్నారా?

First Published | Aug 8, 2023, 11:38 AM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ నేతలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దం సాగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది వైసీపీ నేతలు.. చిరంజీవిని పొగుడుతూ పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ పరిణామాలు చిరంజీవికి కూడా తెలుసు. 

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరనే చెప్పాలి. సినిమాల్లో స్టార్ హోదాను సంపాదించుకున్న  చిరంజీవి.. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించి.. ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అనుకున్న స్థాయిలో ఫలితం కనిపించకపోవడంతో.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం కూడా చేశారు. ఈ క్రమంలోనే యూపీఏ-2 హయంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2014 తర్వాత చిరంజీవి యాక్టివ్ పొలిటిక్స్‌కు దూరంగా జరిగారు. అంతేకాకుండా నెమ్మదిగా కాంగ్రెస్‌కు కూడా దూరంగా జరిగి.. తిరిగి సినిమాలకే పరిమితమయ్యారు. 

మరోవైపు అదే సమయంలో చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ తన పార్టీని ఎన్నికల బరిలో నిలపలేదు. 2019 మాత్రం ఆ రెండు పార్టీలకు దూరంగా జరిగారు. అయితే ఆ ఎన్నికల్లో వామపక్షాలను కలుపుకుని పోటీ చేసిన పవన్‌కు చేదు అనుభవమే ఎదురైంది. ఆ తర్వాత కొంతకాలానికే పవన్.. బీజేపీతో పొత్తులోకి వెళ్లి ఏన్డీయేలో భాగస్వామిగా మారారు. 
 

Latest Videos


jagan, Pawan Kalyan

అయితే పవన్ కల్యాణ్‌కు, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ నేతలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దం సాగుతున్న సంగతి తెలిసిందే. జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఆయన కూడా ఇదే విషయాన్ని పలు వేదికలపై నుంచి స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఇందుకు వైసీపీ నుంచి గట్టిగానే ప్రతిస్పందన వస్తుంది. అయితే ఇక్కడే చాలా మంది వైసీపీ నేతలు.. చిరంజీవిని పొగుడుతూ పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. 

అయితే ఈ విషయాలు చిరంజీవికి తెలియకుండా ఏమి లేవు. ఇదిలా ఉంటే, గతంలో సినిమా టికెట్ల రేట్లు, ఇతర అంశాల విషయంలో.. టాలీవుడ్‌తో వైసీపీ వైఖరి సరిగా లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ సమస్యల విషయంలో సీఎం జగన్‌ను కలవడానికి వచ్చిన చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్‌లతో కూడిన బృందాన్ని ఆయన అవమానించారనే ఆరోపణలు కూడా వినిపించాయి. 

అయితే చిరంజీవి మాత్రం ఈ వివాదాలపై, రాజకీయాలపై పెద్దగా మాట్లాడింది లేదు. తన పొలిటికల్ ఎంట్రీ‌పై జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. అయితే తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తుంది. 

ఇటీవల సాయి తేజ్ హీరోగా, పవన్ కల్యాణ్ ముఖ్య పాత్రలో నటించిన బ్రో చిత్రంపై వివాదం  చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర ద్వారా తనను అవమానించారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి  రాంబాబు మండిపడ్డారు. ఆ చిత్రం డిజాస్టర్ అంటూ కూడా సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంతేకాకుండా ఆ చిత్రం నిర్మాత ద్వారా పవన్‌కు టీడీపీ ప్యాకేజ్ అందించిందని ఆరోపణలు చేయడమే కాకుండా.. సినిమా కలెక్షన్లు కూడా చెప్పేశారు. పవన్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. 
 

అయితే ఇందుకు మెగా అభిమానుల నుంచి కౌంటర్‌లు భారీగానే వచ్చాయి. ఒక ఇరిగేషన్ మినిష్టర్ అయి ఉండి ప్రజల గురించి, ఏపీ గురించి, పోలవరం లెక్కల గురించి మాట్లాడకుండా ఇలా ఒక సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందనే విమర్శలు వచ్చాయి. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్  ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్న హైపర్ ఆది.. అంబటి రాంబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 

‘‘ఎలక్షన్స్ గురించి మాట్లాడిల్సిన వాళ్ళు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో... భోళా శంకర్ నిర్మాతలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంత వచ్చాయనేది వాళ్ళు చెబుతారు. మొన్న కలెక్షన్స్ తక్కువ వచ్చాయట.. అవును, వాళ్లు వెనక వేసుకున్న కలెక్షన్స్ తో పోలిస్తే మన కలెక్షన్స్ తక్కువే’’ అంటూ అంబటిపై ఆది చెలరేగిపోయారు. 

అంతేకాకుండా అన్నయ్యను పొడిగి.. తమ్ముడిని తిడితే సంతోషపడే వ్యక్తి చిరంజీవి కాదని కూడా ఆది అన్నారు. ‘‘భోళా శంకర్ సెట్‌లో ఒక పొలిటికల్ మ్యాటర్ మాట్లాడుతుంటే.. తాను ఈ మధ్య పొలిటికల్ న్యూస్ చూడటం లేదు అని  చిరంజీవి అన్నారు. ఎందుకని అడిగితే.. తన తమ్ముడిని ఎవరూ పడితే వాళ్లు తిడుతున్నారు. అవి చూసి తాను సహించలేక పోతున్నాను అని చెప్పారు. అది తమ్ముడిపై అన్నయ్యకు ఉన్న ప్రమే’’ అని తెలిపారు. చిరంజీవి సమక్షంలోనే హైపర్ ఆది.. ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిపై, వైసీపీ నాయకులపై పరోక్షంగా ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉండగానే.. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి కూడా నటీనటుల రెమ్యూనరేషన్ విషయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచేలానే ఉన్నాయి. అంబటి రాంబాబు చేసిన కామెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన చిరంజీవి.. నటీనటుల రెమ్యూనరేషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయని ప్రశ్నించారు. డిమాండ్, ఆదరణ ఉన్నప్పుడు నటీనటులకు రెమ్యూనరేషన్లు ఎక్కువే ఉంటాయని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. 

‘‘ఎంతసేపు చిత్ర పరిశ్రమ గురించి కాదని.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు గురించి, పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించాలి. వాటి గురించి విశ్వప్రయత్నాలు చేయాలి’’ అని చిరంజీవి సుత్తిమెత్తగా చురకలు అంటించారు. 

అయితే పవన్‌కు అండగానే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. చాలాకాలంగా పవన్‌‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించిన చిరంజీవి.. ఇప్పుడు మాట్లాడటం వెనక కూడా లాజిక్‌‌ ఉందని అంటున్నారు. ఈ సందర్భంలో.. చిత్ర పరిశ్రమ గురించి, రెమ్యూనరేషన్ గురించి మంత్రి అంబటి వ్యాఖ్యలకు కౌంటర్‌గానే తాను మాట్లాడినట్టుగా చిరంజీవి చెప్పుకునే వీలు ఉంటుంది. 

అయితే ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, పెద్ద పెద్ద ప్రాజెక్టల గురించి ప్రయత్నం చేయాలంటూ.. చిరంజీవి కామెంట్ చేయడం చూస్తే జగన్‌ సర్కార్‌కు చిరంజీవి తన రూట్ మార్చుకుంటున్నారా?, భవిష్యత్తులో పవన్‌పై చేసే విమర్శలకు కూడా స్పందిస్తారా? అనేది చూడాల్సి ఉంటుంది. ఇక, చిరంజీవి కామెంట్స్‌తో జనసైనికుల్లో జోష్ నెలకొంది. 

click me!