కాంగ్రెస్‌లో విలీనం: షర్మిల బాణం వైఎస్ జగన్ మీదికే...!

First Published Aug 31, 2023, 10:08 AM IST

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ‌ విలీనానికి రంగం సిద్దమైంది. 

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ‌ విలీనానికి రంగం సిద్దమైంది. గత కొంతకాలంగా  కాంగ్రెస్ హైకమాండ్-షర్మిల మధ్య చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఎటువంటి భద్రత సిబ్బంది లేకుండా కేవలం తన భర్త అనిల్‌తో కలిసి షర్మిల బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. 

షర్మిల ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో వైఎస్ షర్మిల  భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై పూర్తి స్పష్టత రానున్నట్టుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి (సెప్టెంబర్ 2) లోపే విలీనంపై స్పష్టత రానున్నట్టుగా షర్మిల భావిస్తున్నారు. 

అయితే వైఎస్ షర్మిలకు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు  అప్పగించాలనేది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. తొలుత తెలంగాణలో షర్మిల సేవలు వినియోగించుకోవాలని భావించినా.. ఏపీలో అయితేనే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనే  నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్టుగా సమాచారం. 

ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌ మరణం తర్వాత ఆయన కుటుంబం కాంగ్రెస్‌కు దూరమైంది. షర్మిల సోదరుడు వైఎస్ జగన్ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత వైఎస్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైంది. వైఎస్ జగన్‌ కూడా తన వైసీపీని ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేశారు. షర్మిల కూడా  వైసీపీలో కొనసాగుతూ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం కోసం కృషి చేశారు. ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. వైఎస్ షర్మిల తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. 
 

అయితే ఆంధ్ర మూలాలు  ఉన్న షర్మిలకు తెలంగాణలో ఏం పని? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాను తెలంగాణ  కోడలు అని షర్మిల చెప్పుకున్నప్పటికీ.. వైఎస్ రాజశేఖరరెడ్డితో సహా ఆమె కుటుంబానికి ఆంధ్ర అనే ముద్ర ఉంది. 2009లో ఎన్నికల సమయంలో రాయలసీమ  ప్రాంతంలో వైఎస్సార్ మాట్లాడుతూ.. తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలట అనే  కామెంట్ చేశారు. ఇప్పటికీ ఈ కామెంట్స్‌ను బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తూనే ఉన్నారు. 
 

అయితే ఇలాంటి నేపథ్యమున్న షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి.. ఆమె పార్టీని విలీనం చేసుకోవడంపై పలువురు టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కోమటిరెడ్డి  వెంకట్‌రెడ్డి వంటి నేతలు మాత్రం షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయించుందుకు పట్టుబడుతున్నారు. అయితే రేవంత్‌తో సహా పలువురు నాయకులు దీనిని వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం. 

ys sharmila

అయితే ఏది ఏమైనా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ద్వారా ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వైఎస్సార్ ఆత్మగా పేరు  తెచ్చుకున్న కేవీపీ కూడా తన వంతు ప్రయత్నాలు చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది. గత కొంతకాలంగా షర్మిల వ్యవహార శైలి కూడా ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారానికి బలం చేకూర్చింది. మొత్తంగా కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. 
 

అయితే పార్టీ నేతలు అభిప్రాయాలు, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలని  నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, షర్మిల గతంలో తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ బలపడాలంటే.. జగనన్న వదిలిన బాణాన్ని జగన్‌పైనే ప్రయోగించాలనేది కాంగ్రెస్ వ్యుహమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

click me!