కేసీఆర్ సీక్రెట్ సర్వే.. ఆందోళనలో టికెట్లు పొందిన అభ్యర్థులు.. ఆ స్థానాల్లో మార్పులు?

First Published Aug 29, 2023, 4:35 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మంది బీఆర్ఎస్‌ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొన్నిచోట్ల సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించడంతో వారు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్దమయ్యారు. మరోవైపు పలు నియోజకవర్గాల్లో ఆశావహులు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 

దీంతో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.అయితే చాలా వరకు సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లపై ప్రజల్లో, పార్టీ నాయకుల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు టికెట్ రాదని డిక్లేర్ చేస్తే వారు వేరే దారి చూసుకునేందుకు అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందని కేసీఆర్ భావించినట్టుగా తెలుస్తోంది.  ఇది ఆయా నియోజకవర్గాల్లో పార్టీని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలోనే తొలి జాబితాలో ఏడుగురు  సిట్టింగ్‌లకు మాత్రమే కేసీఆర్ నిరాశను మిగిల్చారు. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గత  కొన్ని రోజులుగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న సంగతి  తెలిసిందే. కేసీఆర్ ఎన్నికల నాటికి ప్రకటించిన జాబితాలో సగం మందికి టికెట్లు ఇవ్వని బండి  సంజయ్ చెప్పుకొస్తున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పలువురు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని.. దానిని అడ్డుకునేందుకు హడావిడిగా వారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. 

ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కూడా అలానే ఉంది. కేసీఆర్ ప్రకటించిన జాబితాలోని దాదాపు 20 మంది అభ్యర్థులకు బీఫామ్ కష్టమేనని చెబుతున్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన రోజే.. ఏవైనా తీవ్ర పరిణామాలు  చోటుచేసుకుంటే ఎన్నికల సమయంలో ఒకటి రెండు చోట్లు అభ్యర్థుల మార్పు జరిగే అవకాశం ఉంటుందని కూడా కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అలాంటి పరిస్థితి రాకుండా అభ్యర్థులు కృషి చేయాలని సూచించారు.

అయితే వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న కేసీఆర్.. టికెట్లు  ప్రకటించిన నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలను అంచనా వేయడానికి, గుర్తించడానికి సర్వే బృందాలను రంగంలోకి దిగారు. దాదాపు 20కి పైగా సర్వే బృందాలను కేసీఆర్ నియమించినట్టుగా తెలుస్తోంది. 

కేంద్ర ఎన్నికల కమిషన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేవరకు ప్రతి వారం ఈ సర్వే నివేదికలు కేసీఆర్‌కు చేరనున్నట్టుగా సమాచారం. దీని ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యే నాటికి మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వారం వారం అందే సర్వే నివేదికల ఆధారంగా.. రెడ్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులను కూడా హెచ్చరించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 
 

టికెట్లు ప్రకటించిన కేసీఆర్.. చివరి నిమిషంలో మార్పులకు అవకాశం ఉందని చెప్పడం, ఇప్పుడు సర్వేలు చేయించడంతో టికెట్ దక్కించుకున్నా కొందరు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. అయితే కేసీఆర్ ప్రకటించిన జాబితాలో పలువురిని మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడని ప్రచారం సాగుతుంది. తనకు కావాల్సిన వారికి కొందరికి టికెట్లు దక్కలేదని కూడా కేటీఆర్ భావిస్తున్నారట. దీంతో ఎన్నికల సమయం నాటికి.. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఏ విధమైన మార్పులు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి. 

ప్రస్తుతం బీఆర్ఎస్‌తో పాటు సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నాగార్జున సాగర్, ఉప్పల్, అసిఫాబాద్, మహబూబాబాద్, బెల్లంపల్లి, మంథని, కొత్తగూడెం, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, కల్వకుర్తి, పెద్దపల్లి, రామగుండం, కోదాడ, ఇల్లందు, మానకొండూర్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా సర్వేల్లో తేలింది. 

అయితే కేసీఆర్ మరింత లోతుగా సర్వేలు  చేయించాలని భావిస్తున్నారని సమాచారం. భవిష్యత్ నివేదికల్లో ఎలాంటి మెరుగుదల లేని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నాక.. ఆయన టీమ్స్‌ కూడా క్షేత స్థాయి పరిస్థితులపై రిపోర్టు సిద్దం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటన్నింటిని క్రోడికరించుకున్న తర్వాత.. ఎన్నికల నాటికి కొన్ని మార్పులు తప్పకపోవచ్చని అంటున్నారు. అయితే ఇది ఏ మేరకు వాస్తవ రూపం దాల్చుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

click me!