తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోవడంతో తమ పార్టీకి మైనస్‌గా మారిందని ఆ పార్టీ నేతలే కామెంట్ చేస్తున్న పరిస్థితి. కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకటేనని ప్రజలు భావిస్తారని సైతం వాపోతున్నారు.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో కూడా దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే బీజేపీలో చేరికలు స్లో అయ్యాయి. అంతేకాకుండా పార్టీ నేతలు అసంతృప్తి గళాలు వినిపించడంతో.. బీజేపీ కేంద్ర నాయకత్వం బరిలో దిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిని నియమించింది. అంతేకాకుండా టీ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఇన్‌ఛార్జ్‌గా ఈటల రాజేందర్‌ను అపాయింట్ చేసింది.
అయితే బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై పార్టీలోని కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బీజేపీ నాయకత్వం.. తెలంగాణలో బీసీ మంత్రం జపించడం ప్రారంభించింది.
తెలంగాణలో 50కి పైగా స్థానాల్లో యాదవులు, ముదిరాజ్ వర్గాలు నిర్ణయాత్మక అంశమని బీజేపీ లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పదుల సంఖ్యలో నియోజక వర్గాల్లో కూడా ఈ రెండు వర్గాలకు పట్టున్నట్లు అంచనాకు వచ్చినట్టుగా సమాచారం.
ఈ క్రమంలోనే బీసీల ఆదరణ పొందేందుకు ఈటల రాజేందర్ ద్వారా ప్రణాళికలను అమలు చేయిస్తుంది. ఆ ప్రణాళికకు తుది మెరుగులు దిద్దుతూ ముదిరాజ్, యాదవ్, మున్నూరు కాపు, పద్మశాలి, గంగపుత్ర సంఘం నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముదిరాజ్ కమ్యూనిటీతో పలుకుబడి ఉన్న ఈటల ముదిరాజ్, యాదవ వర్గాల మధ్య సమన్వయం సాధించేందుకు సిద్ధమయ్యారు. కులాల నేతలతో చర్చలు జరిపి జనాభా నిష్పత్తి ప్రకారం రెండు వర్గాలకు టికెట్లు ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పద్మశాలి నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు.
బీసీ మంత్రం పఠిస్తున్నప్పటికీ.. సాధారణంగా బీజేపీలో ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కూడా.. బీసీ అభ్యర్థినే సీఎం చేస్తామని ప్రకటించే అవకాశాలు కూడా లేవు. ఈ క్రమంలోనే బీసీ వర్గాలను ఆకర్షించే విధంగా ఆ వర్గాల నుంచే సీఎం అభ్యర్థి ఎంపిక ఉంటుందనే సంకేతాలు కూడా పంపే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది.
ఇక, కులాల వారీగా బహిరంగ సభలు నిర్వహించి.. ఆ తర్వాత పెద్ద మొత్తంలో బీసీ గర్జన నిర్వహించాలని, అందుకు బీజేపీ అగ్రనాయకులను ఆహ్వానించి బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా పలువురు బీసీ నేతలను పార్టీలోకి తీసుకొచ్చేలా బీజేపీ తెరవెనక ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.