chiranjeevi jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నట్లు కనిపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కౌంటర్ చేయడానికి ఆయన అన్నయ్య చిరంజీవిని వైఎస్ జగన్ వాడుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై చిరంజీవికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఇందులో భాగమేనని అంటున్నారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా చిరంజీవి వ్యవహరించడానికి తగిన ప్రాతిపదికను కూడా జగన్ సిద్ధం చేసినట్లు అనిపిస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను పక్కన పెట్టి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించి సినీ పరిశ్రమ సమస్యలపై జగన్ చర్చించారు
జగన్ తో కలిసి మధ్యాహ్న భోజనం చేసి సినీ పరిశ్రమ సమస్యలపై చిరింజీవి చర్చించారు. పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలపై జగన్ కు వివరించినట్లు చిరంజీవి చెప్పారు. జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి మాట్లాడిన తీరు చూస్తుంటే సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి జగన్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి ద్వారా ఆ పని జరగాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. జగన్ సమస్యలను పరిష్కరిస్తారనే భరోసాను చిరంజీవి సినీ పరిశ్రమకు అంతటికీ ఇచ్చారు. ఆ విషయం చెబుతున్నప్పుడు చిరంజీవీలో కూడా ఆ విశ్వాసం కనిపించింది. గతంలో నాగార్జున కూడా జగన్ ను కలిశారు. నాగార్జున ఆ విషయంపై అంత విశ్వాసాన్ని వ్యక్తం చేయలేదు.
తన న్యాయవాది నిరంజన్ రెడ్డి కారణంగానే చిరంజీవిని జగన్ చర్చలకు ఆహ్వానించారని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు అంటున్నారు. ప్రతి కేసులో నిరంజన్ జగన్ కు చేదోడువాదోడుగా ఉంటున్నారని ఆయన చెప్పారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి అని, దాంతో నిరంజన్ రెడ్డి జగన్ తో చిరంజీవి భేటీకి ఏర్పాట్లు చేశారని ఆయన అన్నారు. నిరంజన్ రెడ్డి చెప్పడం వల్లనే జగన్ చిరంజీవిని చర్చలకు ఆహ్వానించారని పూర్తిగా అనుకోలేం. రాష్ట్రంలోని భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని జగన్ చిరంజీవి ప్రాధాన్యం ఇచ్చారని అనుకోవాలి.
చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అంతేకాకుండా చంద్రబాబుతో పొత్తుకు కూడా పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు రాష్ట్రంలో 20 నుంచి 25 శాతం వరకు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లనే వైసీపీ ఓటమి పాలైందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన ఒంటరిగా పోటీ చేయడం కూడా జగన్ కు కలిసి వచ్చింది. ఈ దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి జగన్ వ్యూహరచన చేసినట్లు భావించాల్సి ఉంటుంది.
chirnjeevi -jagan
కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నేతలు సీబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, బిజెపికి చెందిన కన్నా లక్ష్మినారాయణ, తదితరులు హైదరాబాదులో సమావేశమై వచ్చే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. అయితే, దాన్ని కాపు సామాజిక వర్గానికి పెద్గగా భావించే మాజీ మంత్రి హరిరామజోగయ్య వ్యతిరేకించారు. తమకు జనసేన ఉండగా, మరో పార్టీ అవసరం లేదని చెప్పారు. కాపు సామాజిక వర్గాన్ని జనసేనకు అనుకూలంగా పూర్తి స్థాయిలో మలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోవాలి. ఈ స్థితిలో కాపు సామాజికవర్గంలో అత్యంత ప్రభావశీలి అయిన చిరంజీవిని జగన్ తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. అందువల్లనే చిరంజీవి జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషకుల భావన.
గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి అధికారంలోకి రాకపోయినప్పటికీ గణనీయమైన ప్రభావమే చూపించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని ఆయన కాంగ్రెసులో విలీనం చేశారు. కాంగ్రెసు తరఫున రాజ్యసభకు ఎంపికై కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈ కాలంలో ఆయన తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. రాష్ట్ర విభజన అంశం ఆయనను ఆ ఒత్తిడికి గురి చేసింది. దీంతో రాజకీయాల పట్ల చిరంజీవి వైముఖ్యం ప్రదర్శించారు. పారేసుకున్నదగ్గరే వెతుక్కోవాలనే ఉద్దేశంతో తిరిగి సినిమాల్లోకి ప్రవేశించి, పూర్తి స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. కాగా, చిరంజీవిని రాజ్యసభకు పంపించడానికి జగన్ చూస్తున్నట్లు, ఆ మేరకు చిరంజీవికి ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. భవిష్యత్తు ఎటు వైపు మళ్లుతుందో వేచి చూడాల్సిందే.