మోహన్ బాబు వర్సెస్ చిరు: లోలోపలే బాలకృష్ణ, దెబ్బ తీసిన పవన్ వ్యాఖ్యలు

First Published Oct 12, 2021, 10:21 AM IST

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఎన్నికలు మోహన్ బాబు వర్సెస్ చిరంజీవిగా జరిగినా గెలుపోటములపై బాలకృష్ణ,పవన్ కల్యాణ్ ప్రభావం కూడా పడింది. 

మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ (మా) ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమ లేదా టాలీవుడ్ లోని రెండు వర్గాలు ఎత్తుకు పైయెత్తు సాధించాలనే ఉద్దేశం వల్లనే వివాదంగా మారాయనే విమర్శ వినిపిస్తోంది. తాను ఓడిపోయిన తర్వాత మా సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రకాశ్ రాజ్ ఓ మాట అన్నారు. అప్పుడే అయిపోలేదని, ఇప్పుడే అసలు కథ మొదలైందని అన్నారు. అదే సమయంలో మోహన్ బాబు మా అధ్యక్షుడిగా ఎన్నికైన తన కుమారుడు మంచు విష్ణుకు ఓ సలహా ఇచ్చారు. కొంత మంది వ్యక్తులు సమస్యలు సృష్టిస్తారని, అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. 

Prakash raj వ్యాఖ్యలకు, మోహన్ బాబు సలహాకు మధ్య ఓ లింక్ ఉంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైనప్పటికీ వివాదం ముగిసిపోలేదని ఇరువురి మాటల్లోని సాపత్యంగా కనిపిస్తుంది. MAA ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే చిరంజీవి సోదరుడు నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. ఇలా ఓ వర్గానికి చెందినవారు రాజీనామాలు చేస్తూ పోతే మా బలహీనపడుతుందని, తద్వారా అది అస్తిత్వాన్ని కోల్పోతోందని ఓ వర్గం బహుశా భావించి ఉండవచ్చు. ఏమైనా, మాను ముందుకు నడిపించడం మంచు విష్ణుకు పెద్ద సవాల్ అవుతుందని చెప్పవచ్చు. 

కాగా, మా ఎన్నికల్లో 2007లో Mohan babuకు, Chiranjeeviకి మధ్య తలెత్తిన వివాదం మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలోని ఇరు సామాజిక వర్గాల మధ్య పోరు కూడా కారణమనే మాట వినిపిస్తోంది. చిరంజీవి Tollywoodను తన గుప్పిట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. ఈ స్థితిలో మరో వర్గం అప్రమత్తమై మా ఎన్నికలను వేదికగా చేసుకుందని భావిస్తున్నారు. 

2007 జనవరి 28వ తేదీన తెలుగు సినీ పరిశ్రమ 75వ వార్షికోత్సవాలు జరిగాయి. ఈ వార్షికోత్సవాల్లో చిరంజీవిని లెజెండ్ అవార్డుతోనూ మోహన్ బాబు సెలిబ్రిటీ అవార్డుతోనూ నిర్వహాకులు సత్కరించారు. అయితే, చిరంజీవికి లెజెండ్ అవార్డు ఇవ్వడంపై మోహన్ బాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని లెజెండ్ గా, తనను సెలబ్రిటీగా ఎంపిక చేయడంలో అర్థం ఏమిటని మోహన్ బాబు ప్రశ్నించారు. ఈ సమయంలో చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి.

ఆ తర్వాత ఇరువురు సఖ్యతతో మెలిగినట్లు కనిపించినప్పటికీ లోలోన విభేదాలు రగులుతూనే ఉన్నాయని చెప్పడానికి మా ఎన్నికలను ఉదాహరణగా చెప్పవచ్చు. చిరంజీవికి వ్యతిరేకంగా ఓ వర్గం బలంగా మా ఎన్నికల్లో పనిచేసింది. నందమూరి హీరో బాలకృష్ణకు చిరంజీవి అంటే గిట్టదు. కానీ ఆయన మౌనంగానే ఉంటూ వస్తున్నారు. దాంతో మా ఎన్నికల్లో తన పాత్రను మంచు విష్ణుకు అనుకూలంగా గట్టిగానే నిర్వహించారని అంటున్నారు. మొత్తంగా రెండు వర్గాలుగా విడిపోయిన సినీ పరిశ్రమ చిరంజీవి పథకాన్ని దె్బబ తీశారనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది.

చిరంజీవితో గతంలో గొడవ పడిన హీరో Rajasekhar సతీమణి జీవితా రాజశేఖర్ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయారు. తమకు అనుకూలంగా బలాలను సమకూర్చుకోవడంలో భాగంగా చిరంజీవి వర్గం జీవితా రాజశేఖర్ ను ప్యానెల్ లో పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పవన్ కల్యాణ్ ను దేవుడిగా భావించే బండ్ల గణేష్ ను పక్కన పెట్టి జీవితా రాజశేఖర్ ను ప్యానెల్ లో చేర్చారు. అది ఒక రకంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు వ్యతిరేకంగానే పనిచేసిందని చెప్పవచ్చు.

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజింగ్ ఈవెంట్ లో జనసేన అధినేత, చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రకాశ్ రాజ్ కు ప్రతికూలంగా ఫలితం రావడానికి ఓ కారణంగా చెబుతున్నారు. చిరంజీవి సినీ పరిశ్రమకు దాసరి నారాయణ రావు తర్వాత పెద్ద దిక్కుగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారని అంటున్నారు.

జగన్ ను చిరంజీవి కలవడంపై Pawan Kalyan తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బతిమాలాడడం వల్ల ఫలితం ఉండదని ఆయన చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో వైఎస్ జగన్ అనుకూలం వర్గం ఒక్కటైనట్లుగా కూడా భావిస్తున్నారు. మోహన్ బాబు కుటుంబానికి YS Jagan కుటుంబంతో బంధువత్వం ఉంది. ప్రభుత్వ సహకారం లేకుండా ముందుకు పోలేమని భావించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా పనిచేశారని అంటున్నారు.

click me!