ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విషయాలకు కొదవ ఉండదు. ఏ రోజుకారోజు నూతన వివాదం ఒకటి తెర మీదకు వస్తూనే ఉంటుంది. మూడు రాజధానుల అంశం మంచి కాక మీద ఉంది అనగానే పొలిటికల్ హీట్ ని మరింత పెంచుతూ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అని కోర్టులు తేల్చాల్సినప్పటికీ.... రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో మాత్రం ఈ అంశం రాజకీయంగా విస్తృతమైన చర్చకు దారి తీసింది.
ఇక ఈ అంశాన్ని గనుక మనం గమనిస్తే... ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో తొలుత న్యాయదేవతపై నిఘా అనే ఒక వ్యాసం ప్రచురితమైంది. ఇక ఆ తరువాత దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇక ఈ తతంగం ప్రారంభమవగానే చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు.
ఫోన్ ట్యాపింగ్ విషయానికి చంద్రబాబు నాయుడుకి అవినాభావ సంబంధం ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు నాయుడు వాయిస్ అంటూ క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. రేవంత్ రెడ్డి ఏకంగా జైలుకే వెళ్ళాడు కూడా.
కానీ ఈ కేసులో చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ... ఆయన మాత్రం రివర్స్ లో కేసీఆర్ పైన్నే ఫోన్ ట్యాపింగ్ అంటూ విరుచుకుపడ్డాడు. ఫోన్ ని ఎలా టాప్ చేస్తారంటూ ఆయన వాదించడంతో , ఆ విషయాన్నీ ఒప్పుకోలేక, చేశామని బయటపడలేక తెరాస ప్రభుత్వం సతమతమయ్యింది.
ఒకరకంగా ఆ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కవడంతో వాస్తవంగా డిఫెన్సె లో ఉండాల్సింది చంద్రబాబు. కానీ ఆయన ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి త్ర ప్రభుత్వాన్నే డిఫెన్స్ లోకి నెట్టేశారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని భుజానికెత్తుకున్నట్టుగా కనబడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. మనుషుల ప్రాథమిక హక్కులను హరించివేయడమే. అందులో సంశయం లేదు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైగౌరవ హైకోర్టు పరిధిలో విచారణ జరుగుతుంది. ఇందులో నిజానిజాలను కోర్టు నిగ్గు తెలుస్తుంది. ఇక చంద్రబాబు ఈ విషయంలో చేసిన ఆరోపణలను పరిశీలిస్తే... ఆయన మరోసారి ఈ ట్యాపింగ్ అంశాన్ని జగన్ సర్కార్ పై గురిపెట్టినట్టుగా అర్థమవుతుంది. ఆయన ప్రధానికి లేఖాస్త్రాన్నిసాధించడంలో ఆంతర్యంకూడా ఇదే.
ఓటుకునోటు సమయంలోకోర్టుల్లో అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు వేసి కేసీఆర్ సర్కారునే వెనక్కి తోసేసి డిఫెన్సులోకి నెట్టారు. ఇప్పుడు రాజకీయంగా అమరావతి అంశం కూడా కోర్టు పరిధిలో ఉన్న తరుణంలో ఆయనకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే నూతన అస్త్రం దొరికినట్లయింది.
జగన్ మోహన్ రెడ్డి సంక్షేమపథకాలతో దూసుకుపోతున్నవేళ, పార్టీలోని నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు పార్టీలో పొలిటికల్ జోష్ నుసజీవంగా నిలుపుకోవడానికి ఇదొక చక్కని అవకాశం.
అమరావతి విషయంలో టీడీపీ ఉద్యమించినా విశాఖ ప్రాంత టీడీపీ నేతలు విశాఖకు రాజధాని తరలించొద్దు అని అనలేక సతమతమవుతున్నారు. వారు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా... వారి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం ముందుకు రావడంతో దాన్నిప్పుడు గురి పెట్టాలనే యోచనలో ఉన్నాడు.వేచి చూడాలి ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో..!