Revanth reddy , sharmila
తమ పార్టీలో వైఎస్ షర్మిలకు చెందిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసుకునే ప్రతిపాదనను తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీని విలీనం చేసుకుంటే మొదటికే మోసం రావచ్చునని ఆయన అభిమతంగా తెలుస్తోంది.
గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న చేదు అనుభవాన్ని ఆయన గుర్తు చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబుపై ఉన్న తెలంగాణ వ్యతిరేక ముద్ర తమ పార్టీకి నష్టం చేసిందని కాంగ్రెస్ నాయకులు అప్పట్లో ఓ అంచనాకు వచ్చారు. షర్మిలను పార్టీలో చేర్చుకుంటే అదే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది.
Renuka Chowdhury
వైఎస్ షర్మిల తెలంగాణ కోడలే అయినప్పటికీ ఆమెపై ఆంధ్ర ముద్ర ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానం అనేది ప్రజల్లో ప్రస్తుతం లేదని అంటున్నారు. అందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానం అనేది పార్టీకి కలిసి వచ్చే అవకాశమే లేదని అంటున్నారు. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా ఉంది. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే పార్టీపై వ్యతిరేక ప్రభావం పడుతుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు కూడా.
కాగా, వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే అన్నారు. ఇదే అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడా వ్యక్తం చేశారు. షర్మిల ఇమేజ్ కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
YS Sharmila
షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో చేరితే మరో అధికార కేంద్ర ఏర్పడుతుందని భావించేవారు కూడా పార్టీలో ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. షర్మిల ప్రవేశిస్తే మరో తలనొప్పి కూడా తయారవుతుందని భావిస్తున్నారు. పైగా, ఆమె తక్కువేమీ ఆశించడం లేదని అంటున్నారు. షర్మిల విషయాన్ని ఖమ్మంలో జరిగే బహిరంగ సభ తర్వాత పార్టీ అధిష్టానం తేల్చే అవకాశాలున్నాయి. జులై 2వ తేదీన ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు.
అయితే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పనిచేయడానికి సుముఖంగా లేరు. అక్కడు తన సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో విభేదాలు ఉన్నప్పటికీ ఆమె అందుకు సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించడానికి ఆమె మొదటి నుంచి విముఖంగానే ఉన్నారు. తన తుది శ్వాసవరకు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తానని ఆమె ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.