పొత్తు కోసం పవన్ కళ్యాణ్ ఎత్తులు ... జనసేనాని తెర వెనుక వ్యూహం మామూలుగా లేదుగా

First Published | Jun 10, 2022, 2:22 PM IST

అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల గడువు ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పొత్తులపై ఇప్పుడు రాజకీయం మొదలైంది. కొత్త సమీకరణాల కోసం ప్రయత్నాలు, పార్టీల మైండ్ గేమ్ మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు ఆప్షనలతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ప్రతిపక్షాల శిబిరంలో వచ్చే ఎన్నికల కోసం వాదనలు జోరందుకున్నాయి.
 

pawan kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2024 ఎన్నికలు జరుగుతాయి. సుమారు మరో రెండేళ్ల సమయం ఉన్నా.. పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. ప్రస్తుత రాజకీయాలను ఓ సారి పరిశీలిస్తే.. అధికార వైసీపీ పార్టీకి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా.. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఓట్లు.. ప్రభుత్వ సమర్థకుల ఓట్లూ వెంటే ఉంటాయి. ప్రతిపక్షాల్లో బలమైన పార్టీ టీడీపీ అనేది నిస్సందేహం. గత ఎన్నికల్లో కంటే జనసేన ఇప్పుడు బలపడిందనేది కూడా కాదనలేని సత్యం. క్షేత్రస్థాయిలో బీజేపీ కంటే కూడా జనసేనకే పట్టు, క్యాడర్ అభివృద్ధి జరిగిందనేది కూడా రాజకీయ విశ్లేషకుల అంచనాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే ప్రతిపక్షాల ప్రధాన బలం ప్రభుత్వ వ్యతిరేకతే. ఈ నేపథ్యంలోనే వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంతేకాదు, రెండేళ్ల ముందు నుంచే పొత్తులకు తెర తీశారు.

రాజకీయాల్లో నిర్ణయాలు మారుతూ ఉంటాయి, అవి దీర్ఘకాలంలో పార్టీకి, ప్రజలకు మేలు చేస్తాయి. పవన్ తీసుకున్న బీజీపీతో పొత్తు నిర్ణయం కూడా అలాంటిదే అన్నాడు. బీజీపీతోనే దేశాభివృద్ధి, ఏపీ అభివృద్ధి అన్నాడు.

వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగడానికి రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిందిగా బీజేపీని కోరిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొంత స్వతంత్రంగా అటు బీజేపీకి, ఇటు టీడీపీకి ప్రశ్నలు వేసి వైఖరి తేల్చేయాల్సిందిగా అల్టిమేటం విధించారు. ఈ రెండు పార్టీలకు తనదైన శైలిలో ఆప్షన్లు ఇచ్చారు. జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఒకటి బీజేపీతో కలిసి బరిలోకి దిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రెండోది బీజేపీ, టీడీపీతో కలిసి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇక మూడోది ఒంటరిగా జనసేన రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ మూడు ఆప్షన్లు అటు బీజేపీ, ఇటు టీడీపికి ఇచ్చారు. అయితే, ఈ రెండు పార్టీలకు ఆప్షన్లు ఇవ్వడంతోపాటు జనసేన అధినేత సొంత కుంపటి కోసం కూడా భారీగా వ్యూహం వేసినట్టు తెలుస్తున్నది.

Latest Videos


ఇంకా టైం ఉందిగా..!
ప్రస్తుత ప్రతిపక్షాల పరిస్థితులను గమనిస్తే.. మహానాడు సక్సెస్‌తో టీడీపీలో ఆత్మస్థైర్యం పెరిగింది. సొంతంగానైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న ధీమా ఏర్పడింది. అంతమాత్రానా. పొత్తులకు స్వస్తి పలుకలేదు. కానీ, వ్యూహాత్మక మౌనాన్ని వహిస్తున్నది. జనసేనతో కలిసి పోటీ చేయాలనే ఆలోచనలోనూ టీడీపీ ఉన్నది. కానీ, ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున ఇప్పుడే పొత్తులపై ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

బీజేపీకి పొత్తు తప్పదా..?
కాగా, బీజేపీ అయినా, జనసేన అయినా ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు ఆంధ్రప్రదేశ్‌లో లేవు. గతంలో కంటే ఇప్పుడు జనసేన వేగంగా తన క్యాడర్‌ను డెవలప్ చేసుకున్నది. కానీ, బీజేపీకి ఈ పరిస్థితి లేదు. అందుకే బీజేపీ ఇప్పటికీ జనసేనతో కలిసి నడవడానికి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది.

కండీషన్స్ అప్లై..
ఇక్కడ మరో విషయం చర్చించాలి. జనసేన అధినేత కేవలం ఆప్షన్లే కాదు.. కండీషన్లు కూడా పెట్టారు. గతంలో అంటే 2014లో, 2019 ఎన్నికల్లో తాము తగ్గామని, ఇప్పుడు ఎదుటి వారు తగ్గాలనే అభిప్రాయాన్ని పేర్కొన్నారు. అంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పొత్తుకు సై అనడమే కాదు.. పదవులనూ జనసేన పార్టీకి త్యాగం చేయాలనే డిమాండ్ ఇందులో ఉన్నది.

రాష్ట్రంలో పెద్దగా క్షేత్రస్థాయిలో క్యాడర్ లేని బీజేపీ సీఎం సీటునైనా జనసేనకు ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నదనే అభిప్రాయాలు వచ్చాయి. కానీ, దీనిపై పార్టీ నేతలు అధికారిక ప్రకటన చేయడానికి నోరు మెదపడం లేదు. ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు, పొత్తులపై ఇతర నేతలు మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా సూచించారు. అంటే.. టీడీపీ నుంచి స్పందన వచ్చిన తర్వాతే బీజేపీ ప్రకటించాలనే ఉద్దేశంలో ఉండొచ్చు.

కానీ, బీజేపీతో పోలిస్తే టీడీపీ పరిస్థితి వేరు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నది. అందునా సీఎం సీటును వదిలే అవకాశం అస్సలే లేదనేది తెలుస్తూనే ఉన్నది. కొందరు టీడీపీ నేతలైతే అసలు జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదనే వాదనలూ చేస్తున్నారు.
 

జనసేన బలోపేతం:
ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఏది జరిగినా.. అంటే.. ఒక వేళ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పొడిచి లేదా జనసేన, టీడీపీ పొత్తు కుదిరి అధికారంలోకి వచ్చినా జనసేన బలోపేతం ఖాయంగానే కనిపిస్తున్నది. ఏ పార్టీతో అధికారాన్ని పంచుకున్నా.. మరో అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగా డీకొనడానికి పవన్ కళ్యాణ్ ఎంతమాత్రం సంకోచించబోదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జనసేన ఒంటరిగా పోటీ చేసినా.. గతంలో కంటే మెరుగైన ఫలితాలనే రాబడుతుందనే మాట కూడా వినిపిస్తున్నది. కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీఎం సీటును పవన్ అధిరోహించాలని భావించడం సాహసోపేత ఆలోచన అని కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ సీట్ల పంపకపైనా పేచీ నెలకొననుంది. టీడీపీతో పొత్తులో జనసేన సుమారు 40 సీట్ల వరకు ఆశిస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ, టీడీపీ మాత్రం 20 నుంచి 25 సీట్లకు మించి ఇవ్వబోమనే నిర్ణయాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా.

జనసేన కింగ్ మేకర్?
బీజేపీకి, జనసేన కలిసి ఉంటున్నా.. వారి మధ్య కొన్ని పొరపొచ్చాలు వచ్చినట్టు తెలుస్తున్నది. అటు జనసేన కోసం అటు టీడీపీ, బీజేపీ కలవడం కూడా కొంత  కష్టమైన పనిగా కనిపిస్తున్నది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా రక్షించుకోవడంలో భాగంగా ఈ  మూడు పార్టీలు కలిస్తే లేదా కనీసం జనసేన, టీడీపీ కలిసినా వైసీపీకి బలమైన పోటీ ఇవ్వడం లేదా.. అధికారాన్నే చేజిక్కించుకోవడం జరగవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒక వేళ ఈ పొత్తులేవీ కుదరకుండా జనసేన ఒంటరిగా ఎన్నికల్లోకి దిగినా.. ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటి జరిగి ప్రభుత్వ ఏర్పాటుకు మూడో పార్టీ అవసరం వస్తే.. ఆ మూడో పార్టీగా జనసేననే ఉంటుందనేది మరికొందరి వాదన. కర్ణాటకలో జరిగినట్టుగా సీఎం సీటు జనసేనకు అప్పగించి మరీ జనసేనతో పొత్తు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయనీ వాదిస్తున్నారు.

click me!