పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్: చంద్రబాబుకు మింగుడు పడని పొత్తుల ప్లాన్

First Published | Jun 5, 2022, 8:42 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పొత్తుల విషయంలో తమ ముందు మూడు ఆప్షన్స్ వున్నాయంటూనే ఈసారి తాము వెనక్కి తగ్గబోమన్న వ్యాఖ్యలు చంద్రబాబును ఆందోళనకు గురిచేసేలా  కనిపిస్తున్నాయి.

Pawan kalyan, chandrababu

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. తాజా ఆయన పొత్తుల కోసం చేసిన ప్రతిపాదన ఆ విషయాన్ని పట్టిస్తోంది. పొత్తుల కోసం ఆయన మూడు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించారు. బిజెపి కోసం కాకుండా తెలుగుదేశం పార్టీ (టిడిపి) చీఫ్ నారా చంద్రబాబు నాయుడి కోసం పవన్ కల్యాణ్ ఆ ప్రతిపాదనలు చేశారని 
అర్థం చేసుకోవచ్చు. పవన్ కల్యాణ్ జనసేన బిజెపితో పొత్తులోనే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి టిడిపి కూడా కలిసి రావాల్సి ఉంటుంది. 

pawan kalyan

నిజానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అందరికన్నా చంద్రబాబుకు ఎక్కువ అవసరం. పొత్తుల ప్రత్యామ్నాయాలను పవన్ కల్యాణ్ దాన్ని మనసులో పెట్టుకునే చేసినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్రాన్ని గెలిపించడానికి తాను తగ్గానని ఆయన చెప్పారు. 2014లో ఓసారి, 2019లో మరోసారి తగ్గినట్లు ఆయన తెలిపారు. ఈసారి ఇతరులు తగ్గాలని ఆయన ఆయన సూచించారు. పొత్తుల గురించి చంద్రబాబు వైఖరి తెలిసిన తర్వాతనే మాట్లాడుదామని కూడా చెప్పారు. ఆ రకంగా చంద్రబాబు త్యాగం చేయాలని పవన్ కల్యాణ్ పరోక్షంగా సూచించారు. అధికారం చేపట్టడానికి జనసేనకు అవకాశం కల్పించాలనేది ఆయన ఆంతర్యంగా కనిపిస్తోంది. తద్వారా ఆయన చంద్రబాబు మైదానంలోకి బంతిని నెట్టారు.

Latest Videos


pawan kalyan, somu verraju, chandrababu

పవన్ కల్యాణ్ సూచించిన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే కూడా అదే విషయం అర్థమవుతుంది. జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒకటి కాగా, జనసేన, బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మరోటి, జనసేన, బిజెపి, టిడిపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇంకో ప్రత్యామ్నాయం. వీటిని చూసినప్పుడు జనసేన ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయాలనే ఆయన సూచిస్తున్నారు. అంటే, తన షరతులకు చంద్రబాబు అంగీకరించాలని పవన్ కల్యాణ్ ఆంతర్యంగా కనిపిస్తోంది. 

pawan kalyan, chandrababu

వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఓడించడం చంద్రబాబుకే ఎక్కువ అవసరం. దీన్ని గమనించే చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఒత్తిడి పెంచుతున్నట్లు భావించవచ్చు. చంద్రబాబు త్యాగానికి సిద్ధపడుతారా అనేది పెద్ద సందేహం. నిజానికి జనసేన, బిజెపిల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి బలంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపికి క్యాడర్ ఉంది. ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయాల్సి వస్తే చంద్రబాబు కూటమిలో తానే ప్రధాన పాత్ర పోషించాలని అనుకుంటారు. పవన్ కల్యాణ్ ప్రతిపాదనలకు చంద్రబాబు అంగీకరించడానికి సిద్ధంగా ఉండబోరని ప్రస్తుత పరిస్థితిని బట్టి చెప్పవచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ తగ్గి తనతో కలిసి రావాలని అనుకుంటారు.

Chandrababu, pawan kalyan

కాగా, బిజెపి తమ కూటమి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించలేమనే అభిప్రాయం బలంగా ఉంది. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు మరింతగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల 33 సీట్లను టిడిపి కోల్పోయింది చంద్రబాబే స్వయంగా చెప్పారు. చంద్రబాబు పవన్ కల్యాణ్ షరతులను అంగీకరించకపోతే, అంటే జనసేనకు అధిక ప్రాధాన్యం ఇవ్వకపోతే జగన్ తిరిగి అధికారంలోకి రావడానికే ఎక్కువ అవకాశాలుంటాయనే అంచనా సాగుతోంది. అలా జరిగితే చంద్రబాబు ఆ భారాన్ని పూర్తిగా మోయాల్సి వస్తుంది.  

click me!