జగన్ తో భేటీ: జూ. ఎన్టీఆర్ చివరి నిమిషంలో డుమ్మాకు కారణం ఇదే...

First Published | Feb 11, 2022, 1:13 PM IST

తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు గురువారం మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో ఓ టాలీవుడ్ బృందం ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యింది. అయితే ఈ భేటీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనాల్సి వుండగా చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు టాలీవుడ్ లో టాక్.

తెలుగు సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీపై అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.  గురువారం మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, నారాయణమూర్తి వంటి ప్రముఖులతో కలిసి జగన్ తో చిరంజీవి సమావేశమయ్యారు. చిరంజీవితో పాటు మహేష్ బాబు తదితర సినీ ప్రముఖులు హైదరాబాదు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లిన విషయం తెలిసిందే. 

జగన్ తో జరిగిన సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున పాల్గొనకపోవడంపై చర్చ జరుగుతోంది. జగన్ ను కలిసేవారి జాబితాలో వారిద్దరి పేర్లు కూడా ఉన్నాయి. అయితే, చివరి నిమిషంలో వారు గైర్హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దాంతో వారేందుకు తప్పుకున్నారనే విషయంపై చర్చ సాగుతోంది. నిజానికి, నాగార్జునకు తప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. గతంలో ఆయన జగన్ ను కలిశారు కూడా. 

Latest Videos


అక్కినేని నాగార్జున వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు కూడా. అయితే, ఆయన సతీమణి అమలకు కరోనా పాజిటివ్ వచ్చిందని, దాంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారని, అందుకే జగన్ తో భేటీకి రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ గైర్జాజరుకు కాకరణాలేమిటనే స్పష్టంగా తెలియదు. కానీ ఊహించడానికి కొంత అవకాశం ఉంది. రాజకీయ కారణాల వల్లనే ఆయన గైర్హాజరై ఉంటారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా అయిన నందమూరి హీరో బాలకృష్ణకు బహుశా ఆహ్వానం ఉండకపోవచ్చు. సినీ రంగానికి చెందిన రాజకీయ తటస్థులకు మాత్రమే ఆహ్వానాలున్నట్లు భావిస్తున్నారు. అందుకే బాలకృష్ణకు ఆహ్వానం అందలేదని చెబుతున్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయనను కూడా కలుపుకుని వెళ్లాలని భావించి ఉంటారు. సినీ పరిశ్రమకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమైనవారు కూడా. మహేష్ బాబు, ప్రభాస్ లతో పాటు ఆయనకు ఆహ్వానం ఉంది ఉంటుంది. 

అయితే, తాను జగన్ తో సమావేశమైతే తన అభిమానులకు, టీడీపీ అభిమానులకు, నందమూరి హీరోల అభిమానలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతే జూనియర్ ఎన్టీఆర్ తప్పుకుని ఉండవచ్చునని అంటున్నారు. జగన్ తో భేటీకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ తీవ్రమైన విమర్శలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. దానికి తోడు, తన బాబాయ్ బాలకృష్ణను, మామ చంద్రబాబును వ్యతిరేకించినట్లు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ వారితో మరిన్ని విభేదాలను కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరని, అందుకే ఆయన చివరి నిమిషంలో తాడేపల్లి పర్యటన నుంచి తప్పుకున్నట్లు భావిస్తన్నారు. 

click me!