పవన్ కల్యాణ్ చిచ్చు: 'మా' ఎన్నికలపై జగన్ నీడ, చిరంజీవికి చిక్కులు

First Published | Sep 28, 2021, 10:00 AM IST

వివాదం ముగిసి మోహన్ బాబు, చిరంజీవి కలిసిపోయారని భావిస్తున్న తరుణంలో మా ఎన్నికలు ఇరువురి మధ్య విభేదాలకు కారణమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆ విభేదాలను మరింతగా పెంచారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చిచ్చు పెట్టారు. మూవీ ఆర్టీస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పటికే పరిశ్రమను రెండుగా చీల్చాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆ విభేదాలను మరింతగా పెంచాయి. మోహన్ బాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చిచ్చు పెట్టినట్లే. ముఖ్యమంత్రి జగన్ ను వ్యతిరేకించడానికి పవన్ కల్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వేదికగా చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

లెజెండ్ వివాదం ముగిసి మోహన్ బాబు, చిరంజీవి కలిసిపోయారని భావిస్తున్న తరుణంలో మా ఎన్నికలు ఇరువురి మధ్య విభేదాలకు కారణమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆ విభేదాలను మరింతగా పెంచారు. మోహన్ బాబుపై పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, మోహన్ బాబు కుటుంబానికి మధ్య సంబంధాలను ఎత్తిచూపుతూ వ్యాఖ్యలు చేశారు.

Latest Videos


pawan kalyan, posani

తమకు జగన్ బంధువు అని చెబుకుంటారని మోహన్ బాబు అంటూ సినీ పరిశ్రమ సమస్యలను జగన్ తో మాట్లాడి పరిష్కరించాలని అన్నారు. తద్వారా మా ఎన్నికలపై జగన్ నీడ పడినట్లు అయింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో జగన్ వ్యతిరేక, అనుకూల వర్గాలు మరింతగా చీలిపోయాయి. ఒక రకంగా అవి బహిర్గతమయ్యాయి. నటుడు, సినీ రచయిత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మోహన్ బాబు మాత్రం హుందా ప్రతిస్పందించారు. ఈ నెల 10వ తేదీ తర్వాత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడుతానని చెప్పారు. అంటే, మా ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మాట్లాడదలుచుకున్నట్లు మనకు అర్థమవుతోంది. మరో వైపు, జగన్ కు సన్నిహితుడైన పృథ్వీ మంచు విష్ణు ప్యానెల్ లో ఉన్నారు. ఈ రకంగా మంచు విష్ణు ప్యానెల్ జగన్ అండదండలతో ముందుకు వచ్చిందని అనుకోవాలనే సంకేతాలను పవన్ కల్యాణ్ ఇచ్చినట్లయింది. 

మరో వైపు, అన్నయ్య చిరంజీవిని కూడా పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉంటూ సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి చిరంజీవి ఓ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన వైఎస్ జగన్ ను కూడా కలిశారు. ఈ స్థితిలో చిరంజీవి బతిమాలాడుకుంటున్నారని, బతిమిలాడితే పనులు జరగవని పవన్ కల్యాణ్ మాట్లాడారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చిరంజీవి మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో చిరంజీవి తటస్థ పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బంది కలిగించాయనే చెప్పవచ్చు. 

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పవన్ కల్యాణ్ తన సొంత రాజకీయాలకు వాడుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. జగన్ ను వ్యతిరేకించడానికి ఆయన ఆ వేదికను వాడుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు, ఆయన చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నట్లు కూడా భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చి, చంద్రబాబు హయాంలో విమర్శలు చేసినవారు ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని అడిగారు. దీంతో చంద్రబాబుకు ఆయన మద్దతుగా నిలుస్తున్నారనే విమర్శలు వైసీపీ నాయకుల నుంచి వస్తోంది.

సినీ పరిశ్రమను మొత్తాన్ని జగన్ కు వ్యతిరేకంగా నిలపాలని ఆయన అనుకుంటున్నట్లు భావించవచ్చు. తనపై కోపాన్ని జగన్ సినీ పరిశ్రమ మీద చూపిస్తున్నారని ఆయన అన్నారు. తనపై కోపం ఉంటే తన సమస్యలను అడ్డుకోవాలని, మిగతా సినిమాలను అడ్డుకోవద్దని ఆయన అన్నారు. అందువల్లనే తెలుగు సినిమాల ఛేంబర్ ఆఫ్ కామర్స్ వెంటనే ప్రతిస్పందించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని ప్రకటించింది. నిజానికి, కొద్ది మంది సినీ పెద్దలు తప్ప సినీ పరిశ్రమ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడవాలని అనుకోవడం లేదు. 

అదే సమయంలో సినీ పరిశ్రమ విషయంలో పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గానీ, కేంద్ర ప్రభుత్వంపై గానీ పవన్ కల్యాణ్ అంత దూకుడుగా వ్యవహరించగలరా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. పవన్ కల్యాణ్ నిజానికి చాలా జగన్ మీద, వైసీపీ నేతలపై, మంత్రులపై చాలా కటువైన పదాలు వాడారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ పోరాటం చేయాలని ఆయన చెప్పారు. ఆ పోరాటం ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఆయన తేల్చి చెప్పలేదు. మొత్తంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలోని చీలకలను అగాధాల స్థాయికి పెంచారు.  

click me!