మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఏమీ లేదనే చాలా మంది అనుకుంటున్నారు. Chiranjeevi మద్దతు ప్రకాశ్ రాజ్ కు ఉందని నాగబాబు చెబుతూనే ఉన్నాడు. అయితే, చిరంజీవి ఎక్కడ కూడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు.. కానీ పరోక్షంగా ఆయన Prakash Raj కోసం పనిచేశారని తాజాగా బయపడింది. MAA అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు అసలు విషయం చెప్పేశారు.
ప్రకాశ్ రాజ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి పోటీ నుంచి తప్పుకోవాలని చిరంజీవి తనను కోరారని Manch Vishnu చెప్పారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు. మంచు విష్ణు మాటలను బట్టి చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోలేదని అర్థమవుతోంది.
మా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చిరంజీవి పెళ్లి సందD సినిమా వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఇరు వర్గాల మధ్య తేడాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తాయి. చిన్న పదవుల కోసం పరువు తీసుకోవద్దని చిరంజీవి వ్యాఖ్యానించారు. తనను ఎన్నిసార్లు వారు రెచ్చగొట్టారనేది పెద్ద విషయం కాదని, తాను హుందాగా మౌనం పాటిస్తూ వస్తున్నానని, అయితే తన మౌనం అసమర్థత కాదని మోహన్ బాబు అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎవరు పెద్ద దిక్కుగా మారాలనే వివాదం కూడా కొనసాగుతోందని అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో చిరంజీవి చొరవ తీసుకుంటూ సినీ పరిశ్రమ సమస్యలపై ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోనూ భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు మాదిరిగా పెద్ద దిక్కుగా మారాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే మాను కూడా తన నీడ కిందికి తెచ్చుకోవాలని ప్రయత్నించినట్లు చెబుతున్నారు.
అది మోహన్ బాబుకు గానీ మరికొంత మందికి నచ్చలేదని అంటున్నారు. ఆ విభేదాలే మా ఎన్నికల వెనక పనిచేశాయని, అందుకే అంతగా రచ్చ జరిగిందని భావిస్తున్నారు. పట్టుమని వేయి మంది సభ్యులు లేని మాలో ఇంతగా రచ్చ జరగడం వెనక సినీ పరిశ్రమపై ఆధిపత్యం సాధించాలనే ప్రయత్నాలు కూడా కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.