MAA polls: చిరంజీవికి ఎదురుదెబ్బ, సవాల్ చేసి గెలిచిన మంచు విష్ణు

First Published | Oct 11, 2021, 9:12 AM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు విజయం సాధించగా...సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ పరాజయం పాలయ్యారు. ఇది ఒకరకంగా చిరంజీవికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా హోరాహోరీ జరిగాయి. సినీ నటీనటులు రెండు వర్గాలుగా చీలిపోయి ఎన్నికల్లో తలపడ్డాయి. తీవ్రమైన విమర్శలకు, ప్రతివిమర్శలకు దిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించగా, ప్రకాశ్ రాజ్ పరాజయం పాలయ్యారు. ఇది ఒకరకంగా చిరంజీవికి ఎదురు దెబ్బనే.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇచ్చారు. ఆయన Prakash raj ప్యానెల్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినా వెనక నుంచి మద్దతు ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ కు Chiranjeevi మద్దతు ఉందని ఆయన సోదరుడు నాగబాబు పదే పదే ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనను బట్టి ఆయనకు చిరంజీవి మద్దతు ఉందని భావించడానికి వీలుంది.

Latest Videos


MAA ఫలితాలను జీర్ణం చేసుకోలేని చిరంజీవి చిన్న పదవి కోసం లోకువ అవుతారా అని ప్రశ్నించారు. మా ఎన్నికల ఫలితాలను ఆ రకంగా ఆయన తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. వివాదాలతో చులకన కావద్దని ఆయన సలహా ఇచ్చారు. అల్లర్లతో తమ పరువు తీయవద్దని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద చిరంజీవికి ఈ ఎన్నికల తీరు, ఫలితాలు మింగుడు పడలేదని భావించవచ్చు. 

మా ఎన్నికలు మరో విషయాన్ని కూడా బహిర్గతం చేశాయి. తెలుగు సినీ పరిశ్రమ ఒకటి కాలేదని అర్థమవుతోంది. రెండుగానే చీలిపోయి ఉందని స్ప,ష్టం చేసింది. లెజెండ్ వివాదంతో చిరంజీవి, మోహన్ బాబు మధ్య వివాదం అందరికీ తెలిసిందే. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టమవుతోంది. Mohan babu పని కట్టుకుని రంగంలోకి దిగడం ఈ విషయాన్నే తెలియజేస్తోంది. మంచు విష్ణు కోసం మెహన్ బాబు పూర్తిగా రంగంలోకి దిగి పనిచేశారు. పోలింగ్ రోజు కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. 

నిజానికి, పోలింగుకు ముందే చాలా మందికి ఫలితాలపై ఓ స్పష్టత వచ్చినట్లు కనిపించింది. మంచు విష్ణుకు మద్దతుగా నరేశ్ దూకుడు, మోహన్ బాబు హడావిడి, మంచు విష్ణు చేసిన పోల్ మేనేజ్ మెంట్ ఆయన విషయాన్ని పట్టిచ్చింది. అందుకే బహుశా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ ఎన్నికల ప్రాధాన్యతను తగ్గించే విధంగా మాట్లాడారు. వేయి ఓటర్లు కూడా లేని ఈ ఎన్నికలకు ఇంత హంగామా అవసరం లేదనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. 

చిరంజీవి సోదరుడు నాగబాబు మాటల తీరు కూడా ఓటర్లకు నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మద్దతు ఇచ్చిన Naga babu ఎదురు పక్షంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కోట శ్రీనివాస రావు వంటి సీనియర్ నటుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎదురు తిరిగినట్లు భావిస్తున్నారు. పైగా, ఫలితాల తర్వాత ఆయన మా సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని కూడా తప్పు పడుతున్నారు. తాము గెలిస్తే ఉంటారు, ఓడిపోతే వెళ్లిపోతారా అనే ప్రశ్నను సంధిస్తున్నారు. 

తను ఈ గడ్డమీద పుట్టినవాడినని, ఈ మట్టిబిడ్డనని, తాను సేవ చేయడానికే పోటీ చేస్తున్నానని మంచు విష్ణు చెప్పారు. తద్వారా స్థానికేతరులను ఓడించాలనే పిలుపు ఇచ్చినట్లయింది. ఎంత లేదన్నా, ఎవరు కాదన్నా ప్రకాశ్ రాజ్ ను స్థానికేతరుడిగానే చూసినట్లు భావించాల్సి ఉంటుంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో నుంచి పోటీ చేసిన శ్రీకాంత్ ను ఓటర్లు గెలిపించారు. దీన్ని శ్రీకాంత్ వ్యక్తిగత విజయంగానే చూడాల్సి ఉంటుంది. 

జీవితా రాజశేఖర్ ఓడిపోవడం మెగా ఫ్యామిలీకి మరో ఎదురు దెబ్బ. ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ భార్య ఆమె. Jeevitha Rajashekhar ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న క్రమంలోనే రాజశేఖర్ మోహన్ బాబును కలిశారు. రాజశేఖర్ కు, చిరంజీవికి మధ్య కూడా చాలాకాలంగా విభేదాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రకాశ్ రాజ్ విమర్శించడంపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. 

మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, పవన్ కల్యాణ్ ను దేవుడిగా భావించే బండ్ల గణేష్ జీవిత రాజశేఖర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఆమెపై పోటీ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే, చివరి నిమిషంలో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు ప్యానెల్ లోని రఘుబాబు గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్యానెల్ ఖరారు విషయంలో కూడా ప్రకాశ్ రాజ్ ఏకపక్షంగా వ్యవహరించినట్లు, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన బండ్ల గణేష్ వంటివారిని కూడా పట్టించుకోలేదని అర్థమవుతోంది. 

click me!