చంద్రబాబు ట్రాప్ లో పవన్ కల్యాణ్?: తప్పిదాలపై తప్పిదాలు, అపరిపక్వతే

First Published | Jul 18, 2023, 11:59 AM IST

నిర్దిష్టంగా, స్పష్టంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా టిడిపితో పొత్తు పెట్టుకోవాలని బిజెపి వద్ద ప్రతిపాదన పెట్టారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత నారా చంద్రబాబు నాయుడి ట్రాప్ లో పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, టిడిపి బీ టీమ్ గా జనసేన పనిచేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా ఆ ముద్రను తొలగించుకోలేకపోతున్నారు. మనవాళ్లు కూడా తనను నమ్మడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. టిడిపి బీ టీమ్ గా జనసేన పనిచేస్తోందనే వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా అన్నారు. దాన్నిబట్టి ఆ ముద్ర ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ ముద్రను తొలగించుకోవడానికి పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవడానికి ఆయన తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ అపరిపక్వతతో మాట్లాడడమేనని అనిపిస్తోంది. ఆయన చాలా వరకు గాలివాటం వ్యాఖ్యలు చేస్తున్నారు. నిర్దిష్టంగా, స్పష్టంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా టిడిపితో పొత్తు పెట్టుకోవాలని బిజెపి వద్ద ప్రతిపాదన పెట్టారు.

Latest Videos


జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేయాలనే పవన్ కల్యాణ్ ప్రతిపాదనను తప్పు పట్టడానికి ఏమీ లేదు. అలా జత కట్టడం తప్పు కూడా కాదు. అయితే, జనసేన తనంత తాను అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. బిజెపితో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా ఈ రెండు పార్టీల ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. చంద్రబాబు నాయకత్వంలోని టిడిపియే బలంగా ఉందని అంగీకరించకతప్పదు. మూడు పార్టీలు కలిస్తే బిజెపి, జనసేన కూటమిలో మైనర్ భాగస్వాములే అవుతాయి. టిడిపి అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయి.

 కూటమి గెలిస్తే వైఎస్ జగన్ ను గద్దె దించాలనే పవన్ కల్యాణ్ లక్ష్యం నెరవేరే అవకాశాలున్నాయి. అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయే తప్ప పవన్ కల్యాణ్ అయ్యే అవకాశాలు లేవు. పవన్ కల్యాణ్ గానీ, బిజెపి గానీ అధిక సీట్లను డిమాండ్ చేసే అవకాశం కూడా సీట్ల పంపకంలో ఉండదు. సీట్ల పంపకాలను చంద్రబాబు నిర్ణయించే పరిస్థితే ఉంటుంది. దాంతో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పవన్ కల్యాణ్ తాపత్రపడుతున్నారనే వైసిపి విమర్శలకు బలం చేకూరుతోంది. 

ఇకపోతే, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా పరిపక్వత సాధించిన నాయకుడి వ్యాఖ్యల్లా లేవు. తాట తీస్తా, బజారుకీడ్చి కొడుతా లాంటి వ్యాఖ్యల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం ఆయన గమనించడం లేదు. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎదురు తిరుగుతున్నాయి. వాలంటీర్లు మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే గాలివాటం విమర్శ చేశారు. ఏ వ్యవస్థలోనైన మంచీచెడు రెండూ ఉంటాయి. అంతేకాకుండా, వాలంటీర్లందరూ గంపగుత్తగా చెడ్డవాళ్లో, నేరస్థులో కాలేరు.అక్కడక్కడ వాలంటీర్లు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. అంత మాత్రాన మొత్తం వ్యవస్థను తప్పు పట్టలేం. 

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా ఇంటింటికీ చేరవేయడానికి జగన్ ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థలో తమ పార్టీ సానుభూతిపరులనే ఎక్కువగా ఎంపిక చేసుకుని నియమించుకునే అవకాశం జగన్ కు ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే పనిచేస్తుంది. గతంలో వివిధ గ్రామ స్థాయి కమిటీల్లో చంద్రబాబు కూడా అదే పనిచేశారు. అయితే, గ్రామ వాలంటీర్లు వచ్చే ఎన్నికల్లో వైసిపికి పోల్ మేనేజ్ మెంట్ కార్యకర్తలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో ఆ వ్యవస్థ వైసిపికి ఉపయోగపడుతుంది. 

వాలంటీర్ల వ్యవస్థను తప్పు పట్టలేని స్థితిలో చంద్రబాబు వ్యూహాత్మక ప్రకటన చేశారు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత చంద్రబాబు ఆ ప్రకటన చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, లోపాలను సరిదిద్దుతామని ఆయన చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థపై తన వ్యాఖ్యల ద్వారా పవన్ కల్యాణ్ చర్చకు తీసుకువచ్చి చంద్రబాబుకు ఉపయోగపడ్డారనే మాట వినిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ వ్యాఖ్యల ద్వారా ప్రజాభిప్రాయమేమిటో తెలిసిపోయింది. దాన్ని గమనించి చంద్రబాబు చాలా తెలివిగా ప్రకటన చేశారు.


కాపు సామాజిక వర్గంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకే ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. కాపులు రెండుగానో మూడుగానో చీలిపోయిన తీరు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తనపై ఉన్న కాపు ముద్రను తొలగించుకోలేకపోగా కాపులను ఏకం చేసే శక్తిగా కూడా ముందుకు రాలేకపోతున్నారు. మాజీ మంత్రి హరిరామజోగయ్య ఆయనకు మద్దతు ఇస్తుండగా, ఏ పార్టీ అనుబంధం లేని ముద్రగడ పద్మనాభం ఆయనను వ్యతిరేకిస్తున్నారు. పైగా, వైసిపిలోని కాపు నాయకులు ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. వైసిపి చేసే విమర్శలకు దీటుగా జవాబు ఇచ్చే వ్యవస్థ పవన్ కల్యాణ్ కు లేకపోవడం, దాన్ని ఆయన తయారు చేసుకోలేకపోవడం పెద్ద లోపం.

click me!