కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశానికి హెచ్ డి కుమారస్వామి నాయకత్వంలో జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి ఆహ్వానం అందలేదు. ఈ విషయాన్ని కుమారస్వామి ధ్రువీకరించారు కూడా. ప్రతిపక్షాలు తమను ఎప్పుడు కూడా వారిలో భాగంగా చూడలేదని ఆయన చెప్పారు. రేపు మంగళవారం జరిగే ఎన్డీఎ సమవేశానికి కూడా ఆహ్వానం అందలేదని ఆయన చెప్పారు. అయితే, బిజెపితో జత కట్టడానికి సిద్ధపడినట్లు మాత్రం ప్రచారం జరుగుతోంది.
కుమారస్వామిని నమ్మలేమని కాంగ్రెస్ పార్టీ అంటోంది. బిజెపి సాగడానికి జెడి (ఎస్) మొగ్గు చూపుతోందని, గతంతో కూడా బిజెపితో జత కట్టిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బిజెపితో కలిసి పనిచేసే విషయంపై మీడియా ప్రతినిధులు సంప్రదించగా తాము ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని కుమారస్వామి అన్నారు. లోకసభ ఎన్నికల నాటికి ఎవరితో కలిసి నడవాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే, కర్ణాటకలో తాము అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా కుమారస్వామిని దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
KCR, BRS, Telangana
ఇదిలావుంటే, కుమారస్వామిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దెబ్బ పడిందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి సిద్ధపడినట్లు చెప్పిన కేసిఆర్ టిఆర్ఎస్ ను కాస్తా బిఆర్ఎస్ గా మార్చారు. ఈ క్రమంలో కేసిఆర్ తో కలిసి కుమారస్వామి నడిచారు. కేసిఆర్ ను ప్రతిపక్షాలు బిజెపి బీ టీమ్ గా భావిస్తున్నాయి. దాంతో కుమారస్వామిని కూడా ప్రతిపక్షాలు బిజెపి మిత్రుడిగానే భావిస్తుందని చెప్పవచ్చు. దాంతోనే తమ సమావేశానికి ప్రతిపక్షాలు కుమారస్వామిని అహ్వానించలేదని చెబుతున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మీద కూడా ప్రతిపక్షాలు అదే వైఖరిని తీసుకున్నాయి. జగన్ ను ప్రతిపక్షాలు బిజెపి మిత్రుడిగానే భావిస్తున్నాయి. కేంద్రానికి జగన్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. కేసుల నుంచి బయట పడడానికి బిజెపికి జగన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టిడిపి విమర్శిస్తోంది. అయితే, తనపై సిబిఐ దాడులు చేయించి, తనను జైలులో పెట్టించిదనే ఆగ్రహం కాంగ్రెస్ మీద జగన్ కు ఉంది. దాంతో కూడా జగన్ బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుకోవాలి.
Daggubati Purandeswari
బిజెపికి రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాదు. తమకు కేంద్రంలో మద్దతు ఇచ్చే పార్టీ కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాలేమనే విషయం బిజెపి అగ్రనేతలకు తెలుసు. అయితే, బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు. బిజెపి నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబును పక్కకు తోసి తాము ఆ స్థానాన్ని ఆక్రమించాలనేది బిజెపి ఎత్తుగడ. అందుకే, బిజెపి ఓ వైపు పవన్ కల్యాణ్ తో స్నేహం చేస్తూ మరో వైపు జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తోంది.
మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద కూడా ప్రతిపక్షాలు కేసిఆర్ పట్ల వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తున్నాయి. తమ సమావేశానికి ప్రతిపక్షాలు ఆయనను ఆహ్వానించలేదు. బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు నటిస్తూనే అసదుద్దీన్ ఓవైసీ బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నాయి. బీహార్, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా మజ్లీస్ బిజెపికి ఉపయోగపడ్డారని భావిస్తున్నాయి. ఎన్డీఎ సమావేశానికి కూడా ఆయనకు ఆహ్వానం అందలేదు. జగన్, కేసీఆర్, ఓవైసీలు బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది.