చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పొత్తు: వైఎస్ జగన్ కు సవాల్

First Published | Sep 15, 2023, 10:43 AM IST

సీట్ల పంపకంలో పవన్ కల్యాణ్ పైచేయి సాధించి బిజెపి పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను పెట్టకపోతే మూడు పార్టీలు కలిసి జగన్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లే అనుకోవాలి.

నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. టిడిపి, జనసేన కూటమిని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ కానుంది. ఆ కూటమిని ఎదుర్కోవడం ఆయన కష్టమైన పనే కావచ్చు. జనసేన, టిడిపి ఓట్లు కలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు కోసం చాలా కష్టపడాల్సి రావచ్చు

పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉన్నారు. బిజెపి నాయకత్వంలోని ఎన్డీఎలో కొనసాగుతున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుని ఆయన బిజెపితో తెగదెంపులు చేసుకుంటారా అనే విషయంపై స్పష్టత లేదు. బిజెపితో పొత్తులో కొనసాగుతూనే ఆయన టిడిపితో కలిసి పోటీ చేస్తే జగన్ కు అది మరింత కష్టం కావచ్చు. సీట్ల పంపకంలో పవన్ కల్యాణ్ పైచేయి సాధించి బిజెపి పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను పెట్టకపోతే మూడు పార్టీలు కలిసి జగన్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లే అనుకోవాలి


బిజెపి తనతో కలిసి రావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకోవాలని ఆయన బిజెపి అగ్ర నాయకత్వానికి కూడా సూచించారు. ఈ నేపథ్యంలోని బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారా అనే సందేహాలు కలుగుతున్నాయి. పురంధేశ్వరి చంద్రబాబుతో గత వ్యక్తిగత వైరాన్ని వీడినట్లే కనిపిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగానే వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య అవగాహన కోసమే బిజెపి అగ్రనాయకత్వం పురంధేశ్వరిని బిజెపి అధ్యక్షురాలిగా నియమించి ఉండవచ్చునని అనుకోవచ్చు

చంద్రబాబు బయటకు రాకుండా కేసుల మీద కేసులు బనాయిస్తున్నారు. ఈ స్థితిలో పవన్ కల్యాణ్ ఇరు పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన మోసే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే బాలక్రిష్ణ కూడా ప్రధానమైన పాత్ర పోషించనున్నారు. పూర్తి స్థాయిలో ఆయన రంగంలోకి దిగుతారు. వైఎస్ జగన్ ను ఓడించడానికి వారిద్దరు ఇప్పటికే చేతులు కలిపారు. 

వైఎస్ జగన్ ను ఎదుర్కోవడం టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక్కడి వల్ల కాదనే విషయం అందరికీ తెలిసిందే. పైగా, చంద్రబాబుపై పెట్టిన కేసులను ఆయన చూసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆయనకు తోడ్పాటు అందిస్తారు. నారా లోకేష్ తో పాటు భువనేశ్వరి కూడా పార్టీ వ్యవహారాల్లో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం టిడిపి శ్రేణుల మానసిక స్థైర్యాన్ని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు

Latest Videos

click me!