పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీ నామా అడిగిన ప్రశ్న.. ఇప్పుడు కేసీఆర్‌కు చిక్కులు తెచ్చిందా..!!

First Published Aug 1, 2023, 11:10 AM IST

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికర చర్చ సాగుతుంది. లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు గతంలో చేసిన ప్రసంగం ఇప్పుడు  ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను చిక్కులో పడేసింది.

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికర చర్చ సాగుతుంది. లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు గతంలో చేసిన ప్రసంగం ఇప్పుడు  ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను చిక్కులో పడేసింది. దీంతో పార్లమెంట్ కేసీఆర్‌ గురించి గొప్పగా మాట్లాడి ఆయన నుంచి ప్రశంసలు పొందాలనుకున్న నామా ప్రయత్నం.. ఇప్పుడు రివర్స్ అయిందనే టాక్ వినిపిస్తుంది. 

వివరాలు.. 2021 నవంబర్ 20న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన ఉత్తర భారతదేశానికి చెందిన 750 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. దీంతో కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణలోని విపక్షాల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ హామీని కేసీఆర్ అమలు చేయలేదని, కౌలు రైతుల గురించి పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల్లోని రైతులను తెలంగాణ ప్రజల సొమ్మును దానం చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. 

అయితే కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి రైతుల కుటుంబాలకు చెక్కులు కూడా పంపిణీ చేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ దిశగా అడుగులు వేశారనే విశ్లేషణలు ఆ సమయంలో వినిపించాయి. అయితే గతేడాది మాత్రమే కేసీఆర్.. టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు.

అయితే ఆ సమయంలో.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన రైతులకు కేసీఆర్ నష్టపరిహారం అందించడాన్ని బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకుంది. ఆ పార్టీ నామా నాగేశ్వరరావు కూడా ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కూడా ప్రస్తావించారు. 

‘‘రైతుల ఉద్యమంలో మరణించిన 750 మంది రైతుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున ప్రకటించిన విషయం కేంద్ర ప్రభుత్వ అవగాహనలో ఉందా? అటువంటి ఆందోళన జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంత మంది రైతులు మరణించారన్న డేటాను సేకరించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు ఏమిటి?’’ అని నామా నాగేశ్వరరావు  లిఖితపూర్వక ప్రశ్న అడిగారు. 

అయితే ఇందుకు సమాధానమిచ్చిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2021 డిసెంబర్ 24న.. ‘‘తెలంగాణ నుంచి సమాచారం కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అందలేదు’’అని  రాతపూర్వక సమాధానం ఇచ్చింది. అయితే ఈ లిఖితపూర్వక సమాధానాన్ని హామీల అమలు పార్లమెంటరీ కమిటీ.. హామీగా పరిగణించింది. దాంతో హామీ అమలు స్థితి ఏమైందని పార్లమెంటరీ కమిటీ అడుగుతున్న ప్రశ్నకు వ్యవసాయ శాఖ సమాధానం చెప్పడం అనివార్యంగా మారింది.

దీంతో సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చనిపోయిన రైతులకు చెందిన కుటుంబాలకు ప్రకటించిన పరిహార వివరాలను పలుమార్లు అడిగినా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మరోమారు వెల్లడించింది. పదే పదే కోరిన తెలంగాణ ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వట్లేదని పేర్కొంది. వివరాలు లేనిదే హామీపై స్పష్టత ఇవ్వడం సాధ్యంకాదని, కాబట్టి హామీల జాబితా నుంచి ఈ ప్రశ్నను తొలగించాలని కమిటీకి కేంద్ర వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. అయితే  హామీల అమలు పార్లమెంటరీ కమిటీ అందుకు నిరాకరించింది. 

అదే సమయంలో ఇది ముఖ్యమైన అంశమని.. తార్కిక ముగింపు వచ్చేంత వరకూ తెలంగాణ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే ఇదంతా లోక్‌సభ హామీల కమిటీ తాజాగా సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొనడంతో వెలుగులోకి వచ్చింది. 

nama

దీంతో ఇప్పుడు తెలంగాణ  ప్రభుత్వంపై వివరాలు అందించాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మళ్లీ కోరే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అప్పుడు నామా అడిగిన ప్రశ్న.. ఇప్పుడు కేసీఆర్‌ చిక్కులు తెచ్చిపెట్టిందనే టాక్ వినిపిస్తోంది.

click me!