చంద్రబాబు అరెస్ట్‌‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్న జనసేన?.. పైచేయి వారిదేనా..!

First Published Sep 24, 2023, 4:23 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. అంతేకాకుండా ఏపీ రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. అంతేకాకుండా ఏపీ రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా టీడీపీ, జనసేనల మధ్య పొత్తు అంశం తీవ్రమైన చర్చ జరగగా.. చంద్రబాబు అరెస్ట్ జరిగిన మూడు, నాలుగు రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పొత్తుపై ప్రకటన చేశారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో ఉండటంతో.. తమతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందనే నమ్మకాన్ని పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు. 

Chandrababu, pawan kalyan

అయితే టీడీపీ, జనసేనల మధ్య పొత్తుపై క్లారిటీ వచ్చినప్పటికీ.. రెండు పార్టీల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య సయోధ్య ఉన్నప్పటికీ.. మరికొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా టికెట్ రాకపోతే ఎలా అనే భయం అటు టీడీపీ, ఇటు జనసేన నాయకులను వెంటాడుతోంది. ఇలాంటి చోట్ల ఇరు పార్టీలు ఎలాంటి సమన్వయంతో ముందుకు సాగుతాయనేది ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠగా మారింది. 
 

అయితే పొత్తు ప్రకటించిన తర్వాత తెలుగుదేశంతో సమన్వయ కోసం జనసేన పార్టీ నుంచి కమిటీని కూడా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు అరెస్ట్, ఇతర పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నేతలు జనసేనతో సమన్వయం కోసం ఇప్పుడే కార్యచరణను ప్రారంభించే పరిస్థితి లేదు. 
 

చంద్రబాబు జైలులో ఉండటం, నారా లోకేష్ గత కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేయడం, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు.. ఇలా టీడీపీకి గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటుంది. బాలకృష్ణ, లోకేష్, అచ్చెన్నాయుడు, యనమల వంటి ముఖ్య నేతలు ఉన్నప్పటికీ.. క్యాడర్‌కు సరైన మార్గనిర్దేశం అందడం లేదనే చర్చ జరుగుతుంది. తాత్కాలికంగా చంద్రబాబు పాత్రను భర్తీ చేసే నాయకుడు ఎవరనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది. 

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. క్యాడర్‌ను ఉత్తేజ పరిచే విధంగా మాట్లాడుతున్నారు. అయితే వారు గత కొద్దిరోజులుగా రాజమండ్రిలోనే బస చేస్తూ.. తమను పరామర్శించేందుకు వస్తున్న వారిని కలుస్తున్నారు. అంతేతప్ప పార్టీ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కావడం లేదనే టాక్ కూడా ఉంది. 
 

మరోవైపు జనసేన నేతలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. కొన్నిచోట్ల జనసైనికులు టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. అయితే కొందరు జనసేన  నేతలు మాత్రం.. గతంలో టీడీపీ నేతలతో తమకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొందరైతే పవన్ కల్యాణ్‌ సీఎం కావాలనేదే తమ ఆకాంక్ష అని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసినట్టుగా చెబుతున్న కామెంట్స్ రాజకీయంగా హాట్ టాఫిక్‌గా మారాయి. అసలు ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే.. గతంలో టీడీపీ నేతలు తమను వేధించారని నాగబాబు ముందు కొందరు జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కార్యకర్తలకు నాగబాబు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గతాన్ని మరచి మంచి భవిష్యత్ కోసం ముందుకు సాగాలని సూచించారు. అలాగే పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ నేతలు మన కిందనే పని చేయాల్సి ఉంటుందని నాగబాబు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

చంద్రబాబు అరెస్ట్‌ను జనసేన అడ్వాంటేజ్‌గా తీసుకుంటుందా? అనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. అటు బీజేపీని కూడా పొత్తుకు ఒప్పించడం, ఇటు టీడీపీ‌లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా.. కూటమిలో తమ పార్టీనే ప్రధాన భాగస్వామిగా జనసేన భావిస్తుందా?అనే అనుమాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

click me!