Rahul Gandhi
తెలంగాణ పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత శ్రద్ధతో, జాగరూకతతో వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన గమనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో పార్టీని గట్టెక్కించే ఉద్దేశంతో తెలంగాణ పార్టీ నాయకులను కూడా దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ నాయకులు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి చేస్తున్న అంతర్గత రాజకీయాలను కూడా ఆయన గమనిస్తూ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. సిఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఉదంతమే అందుకు తాజా ఉదాహరణ.
revanth reddy
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గానికి, సిఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క వర్గానికి మధ్య ప్రచ్ఛన్న వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్ర పీపుల్స్ మార్చ్ పేరు మీద చేపట్టిన పాదయాత్రకు మైలేజీ రాకూడదనే ఉద్దేశంతో రాజకీయ డ్రామాకు రేవంత్ రెడ్డి వర్గం తెర తీసినట్లు ప్రచారం జరుగుతోంది. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర జులై 2వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభకు ఖమ్మంలో ఏర్పాట్లు చేశారు.
జూలై 2వ తేదీననే మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దాంతో జనగర్జన సభను చేరికల సభగా మార్చాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వర్గం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకే చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మల్లు భట్టి విక్రమార్కకు మధ్య విభేదాలు కల్పించాలనే ఉద్దేశం కూడా అందులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన రాహుల్ గాంధీ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు.
mallu
పాదయాత్ర చేస్తున్న మల్లు భట్టివిక్రమార్క వద్దకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రేను పంపించారు. మల్లు భట్టి విక్రమార్కతో మాణిక్ రావు థాక్రే చర్చలు జరిపారు. ఆ చర్చలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభగానే ఖమ్మం సభ ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. తద్వారా రేవంత్ రెడ్డి వర్గం వ్యూహానికి అధిష్టానం చెక్ పెట్టింది.
జులై 2వ తేదీన జరిగే బహిరంగ సభకు రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు. ఈ స్థితిలో సభ ఎలా జరగుతుందో కూడా మాణిక్ రావు థాక్రే వివరించారు. శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో కలిసి పని చేసే విధంగా ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మొత్తం మీద, కాంగ్రెస్ తెలంగాణ నాయకుల విభేదాలకు చెక్ పెట్టే విధంగా రాహుల్ గాంధీ స్వయంగా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.