బద్వేలు శానససభ ఉప ఎన్నిక (Badvel bypoll) విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బిజెపి బద్వేలు సీటును జనసేనకు కేటాయించింది. ఈ విషయంపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా జరిగాయి. జనసేన (jana Sena) నాయకులు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బిజెపి రాష్ట్రాద్యక్షుడు సోము వీర్రాజుతో ఇటీవల చర్చలు జరిపారు.
అయితే, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బద్వేలు ఉప ఎన్నికలో అభ్యర్థిని పోటీకి దించడంపై అనూహ్యమైన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము బద్వేలులో పోటీ చేయడం లేదని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయమే బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు.
పవన్ కల్యాణ్ నిర్ణయంపై బిజెపి (BJP) నేతలు పార్టీపరంగా చర్చించాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థిని పోటీకి దించకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇదిలావుంటే, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి పవన్ కల్యాణ్ ఓ సూచన కూడా చేశారు. దాసరి సుధ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన వైసీపీ నేతలకు సూచించారు. దాసరి సుధ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, టీడీపీ తరఫున ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేయనున్నారు. ఓబుళాపురం రాజశేఖర్ పోటీ నుంచి తప్పుకుంటే దాదాపుగా దాసరి సుధ ఎన్నిక ఏకగ్రీవం కావచ్చు.
బద్వేలు శాసనసభ ఉప ఎన్నిక అక్టోబర్ 30వ తేదీన జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలు శానససభ సీటుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఓవైపు వైఎస్ జగన్ ప్రభుత్వంపై, వైసీపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూనే పవన్ కల్యాణ్ బద్వేలు బరి నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరణించిన ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధకు ఆయన మద్దతు ప్రకటించారు.
కాగా, గతంలో తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన ఉత్సుకత ప్రదర్శించింది. తిరుపతి (Tirupathi) లోకసభ సీటును తమకు కేటాయించాలని పవన్ కల్యాణ్ బిజెపి నేతలను కోరారు. తిరుపతి లోకసభ ఓటర్ల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ సీటును ఆశించారు. అయితే, బిజెపి తన తన అభ్యర్థినే పోటీకి దించింది. ఈ కారణంగానే బద్వేలు సీటు నుంచి తాము బరిలోంచి తప్పుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారా అనే సందేహం కలుగుతోంది.