నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్. తనను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా తిరిగి నియమించమని హైకోర్టు గవర్నర్ కి చెప్పడంతో ఆయన వెళ్లి గవర్నర్ ని కలిశారు. గవర్నర్ సైతం సానుకూలంగా స్పందిస్తూ ఆయనను నియమించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.
ఈ గ్యాప్ లోనే ఒక సీన్ చోటు చేసుకుంది. కేసు సుప్రీమ్ కోర్టు పరిధిలో ఉన్నందున రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రమేష్ కుమార్ విషయంలో ఉన్న ట్విస్టులు, కేసులు సరిపోవు అన్నట్టుగా ఈ కొత్త కేసు కూడా వచ్చి చేరింది.
నిమ్మగడ్డ విషయాన్నిప్రారంభం నుంచి గమనించినా మనకు జగన్ మొండిపట్టు మాత్రమే కనిపిస్తుంది. రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయగానే తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్ర గవర్నర్ ని కలిసి, ఆతరువాత ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.
ఆ తరువాత జస్టిస్ కనగరాజ్ ను తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేసారు. అది సాధ్యపడలేదు. అది సాధ్యపడకపోవడంతో మరల కోర్టుకెక్కి టెక్నికల్ అంశాలను వల్లెవేస్తూ, కోర్టు తీర్పులకు కొత్త భాష్యాలుచెబుతూ కాలాన్ని వెళ్లదీస్తుంది అధికార వైసీపీ.
కోర్టు తీర్పులన్నిటిని, హై కోర్టు తీర్పు నుంచి స్టే విధించడానికి సుప్రీమ్ నిరాకరించినంతవరకు, పరిశీలించి చూస్తే ప్రధానంగా రమేష్ కుమార్ కిఅనుకూలంగానే తీర్పు వచ్చిందని చెప్పవచ్చు. ఆ తీర్పులన్నిటిలోను చెప్పిన ముఖ్యమైన అంశం ఆయన తొలిగింపు చెల్లదు అని.
ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి హక్కులకు భంగం కలిగేలా, ఆయన పదవిపై నెగటివ్ గాప్రభావం చూపే విధంగా ఉండే ఎటువంటి సర్వీస్ రూల్స్ ని కూడా మార్చడానికి వీల్లేదు అనే విషయాన్నే కోర్టులు వెల్లడించాయి. హై కోర్టు అదే విషయాన్నీ చెప్పింది. సుప్రీమ్ కూడా హై కోర్టు తీర్పు పై స్టే విధించడానికి నిరాకరించిందంటే అదే కారణం.
గవర్నర్ కూడా తన పరిధికి లోబడే నిర్ణయాలను తీసుకోవలిసిఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన సూచన చేయడం జరిగింది. కానీ ఇప్పుడు గవర్నర్ సూచన చేసినంతమాత్రాన ప్రభుత్వం రమేష్ కుమార్ ని నియమించే ఆస్కారం మాత్రం కనబడడంలేదు.
సుప్రీమ్ కోర్టు ఫైనల్ తీర్పువచ్చాక మాత్రమే ప్రభుత్వం ఆయనను తిరిగి నియమించే ఆస్కారం ఉంది. కనగరాజ్ నియామకం సందర్భంలోజారీ చేసిన ఆర్డినెన్సు ను వెనక్కి తీసుకోలేదు అని చెప్పడం దగ్గరి నుంచి కేసు కోర్టు పరిధిలో ఉందని చెప్పడం వరకు అనేక కారణాలను ప్రభుత్వం చూపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రమేష్ కుమార్ ని నియమించినా, ఆయన పదవి కాలంపూర్తయ్యే లోపు ఎన్నికలను నిర్వహించే ఆస్కారమే లేదు. ప్రస్తుత కరోనా మహమ్మారి ప్రభావం సాధారణ పరిస్థితికి రావడానికి కనీసం మరో సంవత్సరం అయినా పట్టేలా ఉంది. 2021 వరకు వాక్సిన్ వచ్చే ఆస్కారమే లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసిన తరుణంలో ఎన్నికలు ఇప్పుడప్పుడు అయితే నిర్వహించే ఆస్కారమే లేదు.
కాబట్టి రమేష్ కుమార్ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనేఆస్కారమయితే కనబడడం లేదు. ఆయన వల్ల ఇబ్బందులే లేనప్పుడు మరి ఇంత పట్టింపు ఎందుకు అనే అనుమానం రావడం సాధారణం.
అదే జగన్ మొండి వైఖరి. చంద్రబాబు నియమించిన వ్యక్తి అనే మాట దగ్గరి నుండి చంద్రబాబుది, రమేష్ కుమార్ ది ఒకటే కులం అనేవరకు అనేక మాటలను స్వయంగా జగన్ మోహన్ రెడ్డి గారే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నైతిక ఓటమిగా భావించే ఆస్కారమయితే ఉంది. ఒక వర్గం మీడియా ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రచురిస్తుంది కూడా!
ఈ కరోనా కష్టకాలంలో అంత డబ్బు ఖర్చు పెట్టి, ప్రముఖ లాయర్లను పెట్టి కోర్టుల్లో కేసులు వాదించడం వల్ల రాష్ట్రంపై ఆర్ధిక భారం తోపాటుగా కెరీర్ చరమాంకంలో ఉన్న ప్రధాన కార్యదర్శులకు మాయని మచ్చలుగా మిగిలిపోతాయి కూడా!