అమరావతి ఉద్యమం 200 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉన్నట్టుగానే కనబడుతుంది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి ప్రాంత ప్రజల ఉద్యమానికయితే తలొగ్గే పరిస్థితి కనబడడంలేదు.
అమరావతిని జగన్ కొనసాగించకపోవడానికి ప్రధాన కారణం అమరావతిని చంద్రబాబు ఓన్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. నాడు హైటెక్ సిటీ, నేడు అమరావతి అంటూ, నవ్యంధ్ర నిర్మాత చంద్రబాబు అంటూ చంద్రబాబును తెగపొగిడేసారు.
ఇప్పుడు అమరావతిని నిర్మించినా అది చంద్రబాబు ఖాతాలోకే వెళుతుంది. దానితోపాటుగా అమరావతి వల్ల ఎక్కువగా లాభపడేది చంద్రబాబు అనుకూల వర్గాలు, వారి సామాజికవర్గం అనే వాదనను వైసీపీ ఎప్పటినుండో వినిపిస్తూనే ఉంది. అమరావతిని వ్యతిరేకించడానికి ఈ ప్రధాన కారణాలున్నప్పటికీ... అమరావతి ఉద్యమం సైతం జగన్ ను కదిలించలేకపోగా....జగన్ ను ఈ ఉద్యమ వ్యతిరేకిగా మార్చాయని చెప్పవచ్చు, కనీసం ఉద్యమ నాయకుల వ్యతిరేకినయితే చేసాయి.
ఇందుకు అనేక కారణాలు కనబడుతున్నాయి. తొలుత సేవ్ అమరావతి అని నినాదాన్ని ఎత్తుకున్న రైతులు, ఉద్యమోన్ముఖులైన ప్రజలు నెమ్మదిగా వారి నినాదాలన్ని యాంటీ జగన్ గా మారిపోయాయి. వారు అమరావతి ఉద్యమం అనే నినాదంఇస్తున్నప్పటికీ... జగన్ దిగిపోవాలి, జగన్ వ్యతిరేకనినాదాలేఎక్కువగా వినబడుతున్నాయి.
బహుశా ఈ నినాదాలన్నీ ఆ ఉద్యమంలోకి ఎంటర్ అయిన నాయకులు ఇస్తుండొచ్చు. రాజకీయ నాయకులూ తమకు స్పేస్ దక్కాలంటే అధికారపక్షంవారయితే విపక్షంపైన, విపక్షంవారయితే అధికారపక్షంపైన విమర్శలను గుప్పించడం సహజం. ఇక్కడ కూడా జరిగింది అదే.
ముఖ్యంగా ప్రతిపక్షనేత చంద్రబాబు అమరావతి ఉద్యమంలో ముందువరసలో ఉండడం జగన్ కు అసలే నచ్చని అంశం అయి ఉండవచ్చు. నాడు జోలె పట్టి చందాలు స్వీకరించినప్పటినుండి మొదలు నేడు అమరావతి దీక్ష 200రోజులను పురస్కరిన్చుకొని పెట్టిన సమావేశం వరకు చంద్రబాబే ప్రధానంగా కనబడుతున్నారు.
అమరావతి ని జగన్ ప్రభుత్వం వదిలేసినా చంద్రబాబు మాత్రం దాన్ని వదలకుండా పట్టుకున్నారు. ఇలాంటి ఉద్యమానికి జగన్ మోహన్ రెడ్డి తలొగ్గేలా కనిపించడంలేదు. అందుకే ఆయన తన మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి కట్టుబడి శరవేగంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆయన మూడు రాజధానులు ఏర్పాటు చేయడం దాదాపుగా నిశ్చయంగా కనబడుతుంది.
అమరావతి రైతుల ఉద్యమంలో తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యమంలో చేసిన పొరపాటునేఇక్కడ కూడా చేసారు. కేసీఆర్ ను గద్దె దింపడం అనే నినాదం తెలంగాణాలో వినబడితే, జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపాలి అనే నినాదం ఇక్కడ వినబడింది. అంతే తేడా. రెండు చోట్ల కూడా ప్రభుత్వం పట్టించుకునే ప్రసక్తిలేదు.
ఇప్పటికైనా అమరావతి రైతులు రాజధాని అనే డిమాండ్ ను పక్కనుంచి తామిచ్చిన భూములకు, తాము చేసిన త్యాగాలను గుర్తించి ఆదుకోండి అని అడిగితే బాగుండేది. అమరావతి ప్రాంతన్ని ఆర్ధిక కేంద్రంగా, పెట్టుబడుల హబ్ గా మార్చమని ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరితే అది వారికి మేలు చేస్తుంది.
శాసన రాజధాని వల్ల వచ్చే లాభం ఎలాగూ లేదు. కాబట్టి ఫైనాన్షియల్ సెంటర్ గా అమరావతిని డెవలప్ చేసి అక్కడ నూతన ఎకనామిక్ ఆక్టివిటీ ప్రారంభమయితే లాభముంటుంది. అప్పుడు భూముల విలువ రాజధాని కన్నా అధికంగా రాకపోయినా, కనీసం మంచి రేటయినా దక్కే ఆస్కారముంది.
ఇక్కడ జగన్ రాజధానిని తరలించడాన్ని సమర్థించడాన్ని కాదు, జగన్ మూడు రాజధానులు డిసైడ్ అయి ఉన్నాడన్నప్పుడు కనీసం వారు నష్టపోకుండా లాభం తెచ్చుకోగలిగితే చాలు అన్నది ప్రధాన ఉద్దేశం. వైజాగ్ ని తలదన్నే రీతిలో ఎకనామిక్ ఆక్టివిటీనిగనుక ఇక్కడ కూడా వీరు ఏర్పరుచుకోగలిగితే అమరావతి రైతులకు ఎంతో కొంత లాభం ఉంటుంది.