ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాటలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన మాటలను రాజకీయంగా పెద్దగా ఎవరూ పట్టించుకోరు, శరద్ పవార్ వంటివారైతే చాలా ఈజీగా పక్కనపెట్టేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఎన్డీఏ లో భాగస్వామి కాబోతున్నాడంటూ ఇచ్చిన హింట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఆయన ఒక్కడి వ్యాఖ్య ఆధారంగా మాత్రమే కాకుండా.... రాష్ట్రంలో ఇటీవల జరిగిన మరో పరిణామం ఇక్కడ మరింత చర్చకు దారి తీస్తుంది. హడావుడిగా జగన్ కేంద్ర హోమ్ మంత్రి దేశ రాజకీయాల్లో అపరచాణక్యుడిగా పేరున్న అమిత్ షా ని కలవడం. ఆయన కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నప్పటికీ ఇంకా మునుపటి జోష్ కనబడడం లేదు. అయినా జగన్ మోహన్ రెడ్డినిఢిల్లీ రమ్మని అమిత్ షా కబురు పెట్టారు.
అమిత్ షా ను రాష్ట్రానికి రావలిసినవాటాల గురించి అడిగారు అన్న వార్త బయట వినిపిస్తున్నప్పటికీ.... ఎన్డీయే నుండి శివసేన, అకాళీదళ్ వంటి మిత్ర పక్షాలు బయటకు వెళ్లిపోయిన తరువాత కూడా ఇంకా ఆ సమావేశంలో బకాయిల గురించి మాత్రమే మాట్లాడారు అంటే నమ్మడం కష్టం.( అప్పటికి అకాలీదళ్ విడిపోకున్నప్పటికీ, హరిసిమ్రత్ కౌర్ రాజీనామా చేసేసారు)
ఇక ప్రస్తుత తరుణంలో ఎన్డీఏ నుండి మిత్ర పక్షాలు విడిపోతున్న తరుణంలో బీజేపీకి మిత్రపక్షాల అవసరం ఉంది. లోక్ సభలో ఎటువంటి మిత్రుల అవసరం లేకున్నప్పటికీ... రాజ్యసభలో మాత్రం అత్యవసరం. ఈ నేపథ్యంలో వైసీపీకి ఒకటి రెండు బెర్తులిచ్చి కూటమిలోకి ఆహ్వానించాలని బీజేపీ భావిస్తుంది.
ఇటీవల కాలంలో కొన్ని సొంత బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తున్న వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు తెలిపింది. అసలు ఇప్పటివరకు బీజేపీ ప్రవేశపెట్టిన ఏ బిల్లుకు కూడా వ్యతిరేకంగా వ్యవహరించాలేదు వైసీపీ. ఈ నేపథ్యంలో వైసీపీ ఎన్డీఏ లో కలుస్తుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుంది.
వైసీపీ ఎలాగూ మద్దతిస్తుంది కదా, కూటమిలో చేర్చుకోవడం ఎందుకు అని అనిపించవచ్చు. కానీ కూటమిలో ఉంటే... శత్రువుల కంటికి దుర్బేధ్యమైన శక్తిగా బీజేపీ కనబడుతుంది. ఇతర పార్టీలను కూడా ఆహ్వానించడం తేలికవుతుంది. ఒక్కొక్కరిగా పార్టీలు బయటకు వెళుతుండడం, బీజేపీ శక్తి తగ్గుతుందేమో అనే మెసేజ్ బయటకు వెళ్లే ప్రమాదం ఉంది.
ఈ పరిస్థితుల్లోనే వైసీపీ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి తోడు ఇటీవల వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం ఇదే విషయమై మాట్లాడారు. వైసీపీ ఎన్డీఏ లో చేరేందుకు ప్రయత్నిస్తుందని. దానితో ఈ విషయానికి మరింత బలం చేకూరినట్టయింది.
రాష్ట్రంలో బీజే,పీ వైసీపీ పై హిందుత్వ కార్డును ప్రయోగిస్తోంది. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో చేరితే ఈ దాడి నుండి వైసీపీ తప్పించుకునే వీలుంటుంది కూడా. జగన్ కి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారింది.
కాకపోతే బీజేపీలో చేరితే తన మైనారిటీ బేస్ ను కోల్పోవాలిసి రావడమే కాకుండా... ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష టీడీపీ గళమెత్తే ఆస్కారం కూడా లేకపోలేదు. బీజేపీ సైద్ధాంతిక పరిస్థితుల నేపథ్యంలో వైసీపీతో పొత్తు సాధ్యం కాదు అని కొందరు అంటున్నారు. కానీ బీజేపీ గోవాలో, కాశ్మీర్ లో చేసిందేమిటో వేరుగా చెప్పనవసరం లేదు కదా!
ఇక వైసీపీ గనుక ఎన్డీఏ కూటమిలో చేరితే పవన్ కళ్యాణ్ పరిస్థితేమిటనేది ఆసక్తికరంగా మారింది. ఆయనకు జగన్ మోహన్ రెడ్డి అంటే అసలు పడదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వైసీపీ ఎన్డీఏ లో చేరుతుందా, లేదా బయటనుండి మద్దతిస్తుందా అనేది వేచి చూడాలి!