Ganja Farming : అపార్ట్ మెంట్ ప్లాట్ లో గంజాయి పెంచడమే విచిత్రం. దాన్ని పాలల్లో కలుపుకుని తాగడం, చట్నీ చేసుకుని తినడం మరింత విచిత్రం. ఇలాంటి వింత ఘటన తాజాగా వెలుగుచూసింది.
Ganja Farming: సాధారణంగా పొలాల మధ్యలో గుట్టుగా గంజాయి పెంచుతుంటారు. కొందరు ఇంటి పరిసరాల్లోనూ పెంచుతుంటారు. కానీ ఇంట్లోనే గంజాయిని పెంచడం గురించి ఎప్పుడైనా విన్నారా...? ఇలాంటి వింత ఘటన కేరళలో వెలుగుచూసింది.
హర్యానాకు చెందిన విశాల్ కేరళలోని తిరువనంతపురంలో నివాసం ఉంటున్నారు. ఇతడు సాప్ట్ వేర్ ఇంజనీర్... టెక్నోపార్క్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని నెలజీతం సుమారు రూ. 1.5 లక్షలు. మంచి ఉద్యోగం, మంచి శాలరీతో హాయిగా సాగుతున్న ఇతడి జీవితంలోకి గంజాయి ఎంటరయ్యింది. దీనికి అలవాటుపడ్డ విశాల్ ఇంట్లోని గంజాయిని సాగు చేసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు.
24
సేంద్రియంగా గంజాయి సాగు
విశాల్ తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. గంజాయికి అలవాటుపడ్డ అతడు తన ప్లాట్ లోనే గంజాయి సాగు ప్రారంభించాడు. ఆధునిక పద్దతిలో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. అయితే ఈ గంజాయి మొక్కలకు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులనే వాడుతున్నాడు. ఇలా జనావాసాల మధ్యలో గంజాయిని నేచురల్ గా పండిస్తూ అందరినీ ఆశ్చర్యపర్చాడు విశాల్.
34
అపార్ట్ మెంట్ ప్లాట్ లో గంజాయి సాగు
అయితే ఎలా అనుమానం వచ్చిందో గానీ అపార్ట్మెంట్ వాసులు విశాల్ గంజాయి సాగు గురించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఫ్లాట్‌లో తనిఖీ చేయగా 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగిన సుమారు 70 గంజాయి మొక్కలు లభించాయి. పగలంతా ప్రొఫెషనల్ ఐటీ మేనేజర్‌గా పనిచేసే విశాల్, రాత్రిళ్లు ఫ్లాట్‌కు వచ్చి ఈ గంజాయి తోటను చూసుకునేవాడని తెలిసింది. మార్కెట్లో కొన్న ప్రత్యేక కుండీలు, గుడ్లు పెట్టే ట్రేలు, చిన్న చిన్న పాత్రలలో ఇతను గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.
'ఆపరేషన్ తూఫాన్'లో భాగంగా కేరళ పోలీసులు మాధక ద్రవ్యాల స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగానే విశాల్ ఫ్లాట్‌లో తనిఖీ చేసిన పోలీసులు అక్కడి దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. అయితే ఈ గంజాయిని సొంతంగా వాడుకోడానికి మాత్రమే అతడు ఉపయోగిస్తున్నాడట... స్మగ్లింగ్ కోసం కాదట. ఇంట్లో గంజాయిని సాగుచేస్తున్న ఈ టెకీని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని సంచలన విషయాలు బైటపడ్డాయి.
గంజాయి ఆకులను చట్నీ చేసుకోవడానికి, పాలలో కలుపుకుని తాగడానికే పెంచుతున్నానని విశాల్ పోలీసులకు చెప్పడం గమనార్హం. ప్రాథమిక విచారణ ప్రకారం... గంజాయి అమ్మి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం విశాల్‌కు లేదని తెలుస్తోంది. పూర్తిగా సొంత అవసరాల కోసమే అతను ఈ గంజాయి తోటను పెంచాడు.
గంజాయి ఆకులను పేస్ట్ చేసి పాలలో కలుపుకుని తాగడం ఇతనికి ఎప్పట్నుంచో అలవాటట. అంతేకాకుండా గంజాయి ఆకులతో చట్నీ (పచ్చడి) చేసుకుని కూడా రోజూ తినేవాడని పోలీసులు తెలిపారు. ఇంత మంచి జీతంతో ఐటీ ప్రొఫెషనల్‌గా ఉన్న వ్యక్తి, ఇంట్లోనే ఇంత పెద్ద ఎత్తున గంజాయి పెంచడం పోలీసులతో పాటు స్థానికులను కూడా ఆశ్చర్యపరిచింది. నిందితుడిపై మరింత విచారణ జరుపుతున్నామని శ్రీకార్యం పోలీసులు తెలిపారు.