ఉసురు తీస్తున్న టమాటా ధరలు.. వారంలో ఇద్దరు రైతుల హత్య.. దోపిడీలు...

First Published | Jul 21, 2023, 8:48 AM IST

పెరుగతున్న టమాటా ధరలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారంలో ఇద్దరు టమాటా రైతులను హత్య చేయడంతో భయాందోళనలు రేపుతున్నాయి. 

అమరావతి : టమాటా ధరలు ఓ వైపు సామాన్యులకు కళ్ళల్లో కన్నీరు పుట్టిస్తుంటే…టమాటా రైతుల ఇళ్లల్లో సిరులు కురిపిస్తుంది. అయితే దీనితో పాటే పెరిగిన టమాటా ధరలు రైతులకి ఎప్పుడూ లేని కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. పెరిగిన ధరలతో టమాటా రైతులు కోటీశ్వరులుగా మారుతుంటే.. మరోవైపు డబ్బుల కోసం టమాటా రైతులను హత్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. 

తోటలోని పంటలను ఎత్తుకుపోవడం, టమాటా లోడ్లను తరలించడం,  టమాటా రైతులను డబ్బుల కోసం హతమార్చడం కొత్తగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో రైతుల కంటిమీద కునుకు లేకుండా పోతోంది. గతంలో అరుదైన జపాన్ రకం మామిడికాయ ఒక్కోటి రూ.21వేలు  ధర పలుకుతుండడంతో.. మధ్యప్రదేశ్లో ఆ రకం మామిడికాయలను సాగు చేసే ఓ రైతు తోటలకు కాపలాగా గార్డులను పెట్టుకున్నాడు. వారితోపాటు తొమ్మిది కుక్కలను కూడా కాపలాగా పెట్టాడు. 


మిరప ధర పెరిగిన సమయంలో కూడా మన రాష్ట్రంలో.. రూ.25వేలు  క్వింటాల్ ధర పరిగిన సమయంలో.. కల్లాల్లో ఆరబెట్టిన మిరపను దొంగలు ఎత్తుకెళ్లకుండా కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాశారు రైతులు. ఇప్పుడు టమాటా పరిస్థితి అలాగే మారింది. రూ.150కి  పైగానే కేజీ ధర పలుకుతుండడంతో రైతులకు ఓవైపు సంతోషంతో పాటు మరోవైపు భయంతో నిద్ర పట్టడం లేదు.  

అన్నమయ్య జిల్లాలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు టమాటా రైతులు హత్యకు గురి కావడంతో మరింత భయాందోళనలు చెలరేగుతున్నాయి.  అయితే చనిపోయిన ఇద్దరి మరణాలకు వేర్వేరు కారణాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయినా టమాటా రైతుల్లో భయాలు పోవడం లేదు. రాత్రిపూట పొలాల దగ్గరికి కాపలాకు వెళ్లాలంటే వనికి పోతున్నారు.  

పొలానికి వెళితే ఏ దోపిడీ దొంగలు ఏం చేస్తారో అనే భయం ఓవైపు వెళ్లకపోతే పంట ఏమవుతుందో అని ఆందోళన మరోవైపు. దీంతో వారిని  తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. మొలకల చెరువు, మదనపల్లి ప్రాంతాల్లో.. రైతులు ఒక్కరు ఒకరుగా కాకుండా.. . ఇద్దరు ముగ్గురు కలిసి కాపలా కాస్తున్నారు. కర్ణాటకలో  దొంగలు రూ.2.50 లక్షల విలువైన టమాటాలను దొంగిలించగా మన రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనలు రెండు చోట్ల వెలుగు చూసాయి.  

చిత్తూరు జిల్లాలో ఓ రైతు పొలం నుంచి 50 వేల రూపాయల విలువైన టమాటాలు కోసుకెళ్లారు. మూడు రోజుల కిందట పెద్ద తిప్ప సముద్రం మండలంలో కూడా ఆరు క్వింటాళ్ల టమాటా కాయలను ఎత్తుకెళ్లారు.  దీంతోపాటు చిన్నాచితక దొంగతనాలలో కూడా టమాటాల పాత్ర ఉంటుంది. మహారాష్ట్రలో ఓ రైతు  నెల రోజుల వ్యవధిలోనే టమాటాలు అమ్మి రూ.3 కోట్లు సంపాదించాడు. యేటా టమాటా పంటలో నష్టాలే చావి చూసిన ఆ రైతు ఈ లాభాలతో పొంగిపోతున్నాడు.

ఇంకోవైపు దుబాయ్ నుంచి వస్తున్న ఓ కూతురు  తల్లికి ఏం తీసుకురావాలి అని అడిగితే..  10 కిలోల టమాటా తీసుకురమ్మని చెప్పిందంట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, బుధవారం ట్విట్టర్లో వైరల్ గా మారింది. దుబాయ్ లో టమాటా ధర కిలో రూ.99  ఉంది. దీంతో ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది.

ఇక.. టమాటాల కోసం సరిహద్దులు దాటుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో పిఠోరాఘర్ ప్రాంతంలో కిలో టమాటాలు రూ.120కి పైనే ఉంది. దీంతో దగ్గర్లోని నేపాల్ లో వీటి ధర తక్కువగా ఉండడంతో అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.

నేపాల్ లో కిలో టమాట రూ.60-75 వరకు ఉంది. నేపాల్ నుంచి భారత్ కు కూరగాయల దిగుమతులపై నిషేధం ఉంది.  దీంతో దేశంలోకి టమాటాలను కొనుగోలు చేసి తీసుకొస్తున్న వారిని అనుమతించడంతో సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

ఇక తమిళనాడులోని ఒక టమాటా వ్యాపారి మరో విచిత్రమైన ఫీట్ చేశారు. కూరగాయల దుకాణ వార్షికోత్సవం సందర్భంగా కడలూరుకు చెందిన అతను కిలో టమాట రూ.20లకే పంపిణీ చేసి వినియోగదారులని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

Latest Videos

click me!