
దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
దీంతో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లలో సమావేశం నిర్వహించారు. పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఘర్షణలు, నిరసనలు మధ్య ముగిశాయి. పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. పులివెందులలో స్వల్ప ఘర్షణలు జరిగాయి.
ఒంటిమిట్టలోనూ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. దాడులు, రహదారులపై ఆందోళనలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ-వైకాపా వర్గాల మధ్య పలు చోట్ల తోపులాటలు, ఏజెంట్లపై దాడులు జరిగాయి. వివాదాల కారణంగా పలుమార్లు పోలింగ్ నిలిచిపోయి, అధికారులు జోక్యం చేసుకుని పునఃప్రారంభించారు. ఓట్ల లెక్కింపు ఆగస్టు 14న జరుగుతుంది.
కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి చిప్ తయారీ కంపెనీ రానుంది. ఏపీ, ఒడిశా, పంజాబ్‌లలో రూ.4,594 కోట్ల పెట్టుబడితో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటితో దేశ సాంకేతిక సామర్థ్యం పెరిగి, ఉపాధి అవకాశాలు రానున్నాయి.
చిప్ తయారీలో స్వావలంబన దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. అలాగే, లక్నో మెట్రో రైల్ ఫేజ్-1బి, టాటో-II జలవిద్యుత్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని షియోమి జిల్లాలో 700 మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి టాటో-II జలవిద్యుత్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది.
సుప్రీంకోర్టు ఢిల్లీ NCR ప్రాంతంలో అన్ని వీధికుక్కలను 8 వారాల్లో షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆదేశించింది. రేబిస్ కేసులు, కుక్కకాటు ఘటనలు పెరగడాన్ని కారణంగా చూపింది. ఆదేశాలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
అయితే, సుప్రీంకోర్టు తీర్పుపై చాలా మంది ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రేమికులు, రాహుల్ గాంధీ, మేనకా గాంధీ వంటి పలువురు ఈ నిర్ణయంపై స్పందించారు. కాగా, ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య ఢిల్లీలో 35 వేల మంది కుక్కకాటుకు గురయ్యారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
భారతదేశంపై అమెరికా విధించిన 50% టారిఫ్‌లు విధించింది. మొదట 25% టారిఫ్‌లు ఆగస్టు 7, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత మరో 25% టారిఫ్‌లు ఆగస్టు 27, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే టారిఫ్‌ల పై కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఈ అంశంపై పుతిన్ తనతో మాట్లాడాలని కోరారని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రభుత్వం ఈ చర్యను ఖండించగా, ఈ టారిఫ్‌ల వల్ల చిన్న, మధ్య తరహా భారతీయ వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, దిగుమతి బంగారు కడ్డీలపై సుంకాలు విధించబోమని కూడా తాజాగా పేర్కొన్నారు. అమెరికా కస్టమ్స్ ప్రకటన, వైట్‌హౌస్ అధికారుల వ్యాఖ్యలతో గందరగోళం నెలకొని, బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రంప్ ప్రకటన తర్వాత ఔన్సుపై ధర 50 డాలర్లు తగ్గింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఉత్తర్వులు జారీ కాలేదు.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయాపడ్డారు. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. జస్టిస్ జాన్ మైఖేల్ డీకున్హా కమిషన్ నివేదిక ప్రకారం స్టేడియం డిజైన్, సౌకర్యాలు పెద్ద ఈవెంట్లకు తగినట్టుగా లేవని తేలింది. దీంతో బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో భవిష్యత్తు పై ప్రశ్నలు వస్తున్నాయి.
మహిళ ప్రపంచ కప్ 2025 తో పాటు రాబోయే పలు క్రికెట్ ఈవెంట్లు మరో వేదికకు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లో ఆర్సీబీకి హోం గ్రౌండ్ గా కూడా ఉంది. ఇక్కడ జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, KSCA నిర్లక్ష్యమే కారణమని తేల్చి, ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. భద్రతా ప్రమాణాలు మెరుగుపరచకపోతే, భవిష్యత్తులో ఈ వేదికపై ప్రధాన మ్యాచ్‌లు జరగకపోవచ్చు.